Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బారిన ఏడుగురు షట్లర్లు
- సైనా నెహ్వాల్‌కు షాకిచ్చిన యువ షట్లర్
- ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కరోనా మహమ్మారి మరోసారి భారత క్రీడా రంగంపై పంజా విసురుతోంది. బయో బబుల్‌లో దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహిస్తున్నా.. బుడగ వాతావరణంలోనూ కోవిడ్-19 కేసులు వెలుగు చూస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో కూచ్ బెహార్ టోర్నీని బీసీసీఐ వాయిదా వేయగా.. ఐఎస్‌ఎల్ బయో బబుల్స్‌లోనూ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. బిడబ్ల్యూఎఫ్ టోర్నీ ఇండియా ఓపెన్‌ను సైతం కోవిడ్-19 వదల్లేదు. ఏడుగురు షట్లర్లు కోవిడ్-19 వైరస్ బారిన పడటంతో ఇండియా ఓపెన్‌లో గురువారం కలకలం రేగింది. ప్రపంచ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురు టాప్ షట్లర్లు కోవిడ్ వైరస్ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఏడుగురు షట్లర్లు సహా వారితో సన్నిహితంగా మెలిగిన ఇతర షట్లర్లు సైతం ఇండియా ఓపెన్ పోటీ నుంచి నిష్క్రమించారు. డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప, రితిక రాహుల్ టక్కర్, ట్రెస్సా జొల్లీ, మిథున్ మంజునాథ్, సిమ్రన్ ఆమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కోవిడ్-19 ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ' మంగళవారం నిర్వహించిన తప్పనిసరి కోవిడ్-19 ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలో ఏడుగురు క్రీడాకారులు పాజిటివ్‌గా వచ్చారు. పాజిటివ్‌గా తేలిన షట్లర్ల డబుల్స్ భాగస్వామ్యలు సైతం టోర్నీ నుంచి వైదొలిగారు. కోవిడ్-19 సోకటంతో తప్పుకున్న షట్లర్ల స్థానంలో ఇతర షట్లర్లకు అవకాశం ఇవ్వటం లేదు. ప్రధాన డ్రాలో ప్రత్యర్థి షట్లర్లకు వాకోవర్ లభించనుంది. వారు నేరుగా తర్వాతి రౌండ్‌కు చేరుకుంటారు' అని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. వైరస్ బారిన షట్లర్ల పేర్లు వెల్లడించేందుకు తొలుత బిడబ్ల్యూఎఫ్ నిరాకరించింది. బి. సాయిప్రణీత్, మను అత్రి, ధ్రువ్ రావత్‌లు ఇండియా ఓపెన్ ఆరంభానికి ముందే కోవిడ్-19 సోకటంతో పోటి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
సైనాకు షాక్ : భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రం, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. భారత బ్యాడ్మింటన్‌లో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన సైనా నెహ్వాల్ గత కొంత కాలంతో అంచనాలను అందుకోవటం లేదు. కోవిడ్-19 అనంతరం కొత్త ఇన్నింగ్స్ ఆశిస్తోన్న సైనా నెహ్వాల్‌కు ఇండియా ఓపెన్‌లో ఊహించని ఫలితం ఎదురైంది. యువ షట్లర్ మాళవిక బాన్సోద్ చేతిలో సైనా నెహ్వాల్ అనూహ్య పరాజయం చవిచూసింది. 17-21, 9-21తో వరుస గేముల్లోనే సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టైటిల్ పోరుకు చేరుకోవటం లాంఛనమే అనుకోగా.. యువ షట్లర్ మాళవిక అదరగొట్టే ప్రదర్శనతో కెరీర్ అతిపెద్ద విజయం సాధించింది. టాప్ సీడ్ పి.వి సింధు క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకుంది. 21-10, 21-10తో వరుస గేముల్లో సహచర షట్లర్ ఇరా శర్మపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో అష్మిత చాలిహతో సింధు తలపడనుంది. మిథున్ మంజునాథ్ కోవిడ్ బారిన పడటంతో హెచ్.ఎస్ ప్రణరుకి వాకోవర్ లభించింది. ప్రణరు నేరుగా క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో సమీర్ వర్మ కథ సైతం ముగిసింది.