Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 వికెట్ల తేడాతో మూడో టెస్టులో గెలుపు
- 2-1తో టెస్టు సిరీస్ దక్షిణాఫ్రికా వశం
- కీగన్ పీటర్సన్ వీరోచిత ఇన్నింగ్స్
- భారత్‌కు తప్పని దారుణ భంగపాటు
భారత్ అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. తిరుగులేని పేస్ దళం, ఎదురులేని బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. మరోవైపు తరం మార్పిడితో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. అగ్రజట్టు భారత్‌కు సవాల్ విసిరే పరిస్థితి లేదు. సఫారీ గడ్డపై టీమ్ ఇండియా చారిత్రక టెస్టు సిరీస్ విజయం లాంఛనమే అనుకున్నారు. అందుకు తగినట్టే తొలి టెస్టులో భారత్ అఖండ విజయం సాధించింది.
కెప్టెన్ డీన్ ఎల్గార్ సఫారీ దశ మార్చేశాడు. వాండరర్స్‌లో వండర్ ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టును విజేతగా నిలిపిన ఎల్గార్.. డ్రెస్సింగ్‌రూమ్‌లో స్ఫూర్తి రగిల్చాడు. కీగన్ పీటర్సన్ నిలకడగా రాణించి భారత పేసర్లకు పరీక్షగా నిలిచాడు. 212 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిన దక్షిణాఫ్రికా కేప్‌టౌన్ టెస్టులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 2-1తో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ భారత్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది.
నవతెలంగాణ-కేప్‌టౌన్
దిగ్గజాలు ఆటగాళ్లు ఎవరూ లేరు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల మ్యాచ్ విన్నర్లు లేరు. వరుస పరాజయాలతో సతమతమతం అవుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి అగ్ర జట్టును ఎదురించి నిలువటం సాధ్యం కాని పనే అనేశారు క్రికెట్ పండితులు. దక్షిణాఫ్రికా అంచనాలను తలికిందులు చేశారు. అగ్ర జట్టు ఆశలను ఆవిరి చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆశలతో వచ్చిన టీమ్ ఇండియాను సాధికారికంగా ఓడించింది. తొలి టెస్టులో ఓడినా.. చివరి రెండు టెస్టుల్లో స్ఫూర్తిదాయక విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. యువ బ్యాటర్ కీగన్ పీటర్సన్ (82, 113 బంతుల్లో 10 ఫోర్లు), డుసెన్ (41 నాటౌట్, 95 బంతుల్లో 3 ఫోర్లు), తెంబ బవుమా (32 నాటౌట్, 58 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 63.3 ఓవర్లలోనే ఛేదించింది. భారత బౌలర్లు వికెట్ల వేటలో లోపరహిత ప్రయత్నం చేసినా సఫారీ బ్యాటర్లు పైచేయి సాధించారు. నాల్గో రోజు లంచ్ విరామం అనంతరం దక్షిణాఫ్రికా లాంఛనం ముగించింది. అద్వితీయ బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కీగన్ పీటర్సన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు.
పీటర్సన్ అదుర్స్ : భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బుమ్రా, షమి అవకాశాలు సృష్టించినా.. ఫీల్డర్లు అందిపుచ్చుకోలేదు. మూడో రోజు బాల్ ట్రాకింగ్ మాదిరిగా.. నాల్గో రోజు సైతం పేసర్లకు ఏదీ కలిసి రాలేదు. ఓవర్‌నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ (82) ఆతిథ్య జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఏడు ఫోర్లతో 65 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన కీగన్ పీటర్సన్ భారత్ అవకాశాలను తొలి సెషన్‌లోనే తుడిచిపెట్టేశాడు. రాసీ వాన్‌డర్ డుసెన్ (41 నాటౌట్)తో కలిసి పీటర్సన్ 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పీటర్సన్ నిష్క్రమించటంతో డుసెన్‌కు తెంబ బవుమా (32 నాటౌట్) తోడయ్యాడు. ఈ బవుమా, డుసెన్ జోడీ అజేయ భాగస్వామ్యంతో లాంఛనం ముగించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమి, శార్దుల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 223/10
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 210/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 198/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : ఎడెన్ మార్కరం (సి) రాహుల్ (బి) మహ్మద్ షమి 16, డీన్ ఎల్గార్ (సి) రిషబ్ పంత్ (బి) జశ్‌ప్రీత్ బుమ్రా 30, కీగన్ పీటర్సన్ (బి) శార్దుల్ ఠాకూర్ 82, రసెన్ వాన్‌డర్ డుసెన్ నాటౌట్ 41, తెంబ బవుమా నాటౌట్ 32, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(63.3 ఓవర్లలో 3 వికెట్లకు) 212.
వికెట్ల పతనం : 1-23, 2-101, 3-155.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 17-5-54-1, మహ్మద్ షమి 15-3-41-1, ఉమేశ్ యాదవ్ 9-0-36-0, శార్దుల్ ఠాకూర్ 11-3-22-1, రవిచంద్రన్ అశ్విన్ 11.3-1-51-0.