Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ సాధించిన రోహిత్ శర్మ
న్యూఢిల్లీ : ఎడమ కాలి తొడ కండరం గాయంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు సమాచారం. స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆరు మ్యాచుల వైట్‌బాల్ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాల అనధికార సమాచారం. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు చివరి నిమిషంలో గాయపడిన రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే జట్టు ఎంపిక సమయానికి రోహిత్ శర్మ మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదు. దీంతో వన్డే సిరీస్‌కు సైతం అందుబాటులో ఉండలేదు. 'ఎన్సీఏలో రోహిత్ శర్మ రిహాబిలిటేషన్ బాగా సాగుతోంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధంగా ఉంటాడని అనుకుంటున్నాం. అహ్మదాబాద్‌లో తొలి వన్డేకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడని చెప్పవచ్చు' అని ఎన్సీఏ అధికారి ఒకరు వెల్లడించారు. భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ ఫిబ్రవరి 6-12న జరుగనుండగా, టీ20 సిరీస్ ఫిబ్రవరి 15-20న జరుగనుంది.