Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు కెప్టెన్సీపై జశ్‌ప్రీత్ బుమ్రా
పార్ల్ : భవిష్యత్‌లో అవకాశం లభిస్తే భారత జాతీయ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బుమ్రా ఈ మేరకు ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ వదులుకోవటంతో ఐదు రోజుల ఫార్మాట్లో నాయకుడి కుర్చీ ఖాళీగా ఉంది. టెస్టుల్లో దీర్ఘకాలిక నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న బీసీసీఐ.. 35 ఏండ్ల రోహిత్ శర్మను టెస్టు సారథి చేసేందుకు సుముఖంగా లేనట్టు వార్తలొస్తున్నాయి. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రాల పేర్లు టెస్టు కెప్టెన్సీ రేసులో చక్కర్లు కొడుతున్నాయి. ' అవకాశం ఇస్తే భారత జట్టుకు నాయకత్వం వహించటం ఓ గౌరవంగా భావిస్తాను. ఏ ఆటగాడు సైతం కెప్టెన్సీ వద్దు అనడు, నేను అందుకు మినహాయింపు కాదు. ఏ నాయకత్వ గ్రూప్‌లో ఉన్నా నా శక్తి సామర్థ్యాల మేరకు జట్టుకు సేవలు అందించేందుకు చూస్తాను. సహచర ఆటగాళ్లకు తోడుగా నిలువటం నా సహజ లక్షణం' అని బుమ్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ వదులుకున్న విషయం డ్రెస్సింగ్‌రూమ్‌లో సహచరులతో పంచుకున్నాడని, అందరూ విరాట్ నిర్ణయాన్ని గౌరవించినట్టు బుమ్రా తెలిపాడు.