Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే నేడు
- విరాట్ కోహ్లి ప్రదర్శనపైనే అందరి దృష్టి
- మధ్యాహ్నాం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలు ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీల కెప్టెన్సీకి రంగం సిద్ధం చేసుకున్నారు!. హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్లకు రూ.15 కోట్లు చొప్పున వెచ్చించిన అహ్మదాబాద్ ప్రాంఛైజీ.. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను రూ.7 కోట్లను తీసుకోనుంది. కెఎల్ రాహుల్ (15 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు), రవి బిష్ణోరు (4 కోట్లు)లను లక్నో ప్రాంఛైజీ తీసుకుంది.
నవతెలంగాణ-పార్లె
టీ20 ప్రపంచకప్ మరో పది నెలల దూరంలో ఉన్న నేపథ్యంలో వన్డే సిరీస్ సవాల్‌కు అర్థం లేదు!. వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగం కాని వన్డే సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. కోవిడ్-19 కొత్త వేరియంట్ ముప్పుతో కుదించిన షెడ్యూల్లో ఆర్థిక ప్రయోజనాల కోసం జరుగుతున్న వన్డే సిరీస్ ఇరు జట్లకు ఓ సన్నాహకం. 2023 వరల్డ్‌కప్ కోసం ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు కొత్త జట్లను నిర్మాణం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో తాజా వన్డే సిరీస్ ఇరు జట్లకు ఉపయుక్తమే. చారిత్రక టెస్టు సిరీస్‌పై కన్నేసి భంగపడిన భారత్ వన్డే సిరీస్ విజయంతోనైనా స్వదేశానికి చేరుకోవాలని భావిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే నేడు ఆరంభం.
విరాట్‌పైనే ఫోకస్ : భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లి ఎప్పుడూ ఆకర్షణీయ ఆటగాడే. కానీ ఈ దశాబ్ద కాలంలో బ్యాటర్ కోహ్లిపై ఎన్నడూ ఫోకస్ లేదు. శతకం లేకుండా రెండేండ్లు గడిపేసిన విరాట్ కోహ్లి టెస్టు సిరీస్‌లో వంద మార్క్ అందుకోలేదు. వన్డే సిరీస్‌లోనైనా వంద పరుగుల మోత మోగించాలని అతడు ఎదురుచూస్తున్నాడు. స్వల్ప వ్యవధిలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్న కోహ్లి ఆటతో పాటు ఇతర అంశాల్లోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 2019 ఆగస్టులో విండీస్‌పై చివరగా కోహ్లి శతకం సాధించాడు. ఆ తర్వాత 15 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 8 అర్థ సెంచరీలు బాదాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లి బ్యాటర్‌గా సరికొత్తగా విజృంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వాండరర్స్ టెస్టులో కెప్టెన్సీ వహించిన రాహుల్ వన్డే సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంటున్నాడు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్‌లు సత్తా చాటాలని చూస్తుండగా.. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అరంగ్రేటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంది.
మరోవైపు టెస్టులకు అనూహ్యంగా వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్ వన్డే సిరీస్‌లో సఫారీలకు నాయకత్వం వహించనున్నాడు. టెస్టుల్లో గొప్పగా పుంజుకున్న దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో తొలి వన్డేలో బరిలోకి దిగుతోంది. మలాన్, బవుమా, మార్కరం, డెవిడ్ మిల్లర్లు సఫారీలకు కీలక బ్యాటర్లు. కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడిలు పేస్ దళాన్ని నడిపించనున్నారు.
పిచ్, వాతావరణం : పార్లె పిచ్ ఏండ్లుగా ఆశ్చర్యపర్చటంలో ముందుంది. దశాబ్దం క్రితం శ్రీలంక ఇక్కడ 43 పరుగులకే కుప్పకూలింది. బౌండరీలు చిన్నవి కావటంతో భారీ స్కోర్లకు అవకాశం ఎక్కువ. సహజంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇ క్కడ పరుగుల వేటకు అను కూలం. తొలి వన్డేకు ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), మలాన్, తెంబ బవుమా, మార్కరం, డుసెన్, డెవిడ్ మిల్లర్, ప్రిటోరియస్, ఫెహ్లువయో, కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడి, షంషి