Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్, కోహ్లి, శార్దూల్ అర్ధసెంచరీలు
- దక్షిణాఫ్రికా చేతిలో 31 పరుగుల తేడాతో ..
- బవుమా, డుస్సెన్ సెంచరీలు
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. సఫారీ జట్టు నిర్దేశించిన 297 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 265 పరుగులే చేయగల్గింది. ఓ దశలో 214 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. చివర్లో శార్దూల్(50నాటౌట్) మెరుపు అర్ధశతకంతో చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన దక్షిణాప్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా(110 పరుగులు; 8ఫోర్లు), డుస్సేన్(129పరుగులు, 9ఫోర్లు, 4సిక్సర్లు.. నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్లు డికాక్ (27) ఫర్వాలేదనిపించినా.. మలన్(6), మార్క్రామ్(4) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా.. బవుమా, డుస్సెన్ మాత్రం స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 204పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. టీమిండియా బౌలర్లలో బుమ్రాకు రెండు, అశ్విన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో టీమిండియా ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(12) నిరాశపరిచినా.. ధావన్(79), కోహ్లి(51) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 92 పరుగులు జతచేశారు. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం మిడిలార్డర్ బ్యాటర్స్ నిరాశపరిచారు. జట్టు స్కోర్ 152 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా.. 214 పరుగుల వద్దకు స్కోర్ బోర్డు వెళ్లేసరికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో శార్దూల్(50నాటౌట్) మెరుపు అర్ధశతకం భారత విజయానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డుస్సెన్‌కు లభించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే శుక్రవారం జరగనుంది.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి)అశ్విన్ 27, మలన్ (సి)పంత్ (బి)బుమ్రా 6, బవుమా (సి)కేఎల్ రాహుల్ (బి)బుమ్రా 110, మార్క్రామ్ (రనౌట్) వెంకటేశ్ అయ్యర్ 4, డుస్సెన్ (నాటౌట్) 129, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 2, అదనం 18. (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 296పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/58, 3/68, 4/272
బౌలింగ్: బుమ్రా 10-0-48-2, భువనేశ్వర్ 10-0-64-0, శార్దూల్ 10-1-72-0, అశ్విన్ 10-0-53-1, చాహల్ 10-0-53-0.
ఇండియా ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి)డికాక్ (బి)మార్క్రామ్ 12, ధావన్ (బి)మహరాజ్ 79, కోహ్లి (సి)బవుమా (బి)షాంసీ 51, పంత్ (స్టంప్)డికాక్ (బి)ఫెల్హులియో 16, శ్రేయస్ (సి)డికాక్ (బి)ఎన్గిడి 17, వెంకటేశ్ అయ్యర్ (సి)డుస్సెన్ (బి)ఎన్గిడి 2, అశ్విన్ (బి)ఫెల్హులియో 7, శార్దూల్ (నాటౌట్) 50, భువనేశ్వర్ (సి)బవుమా (బి)షాంసీ 4, బుమ్రా (నాటౌట్) 14, అదనం 13. (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 265 పరుగులు.
వికెట్ల పతనం: 1/46, 2/138, 3/152, 4/181, 5/182, 6/188, 7/199, 8/214,
బౌలింగ్: మార్క్రామ్ 6-0-30-1, జెన్సన్ 9-0-49-0, మహరాజ్ 10-0-42-1, ఎన్గిడి 10-0-64-2, షాంసీ 10-1-52-2, ఫెల్హులియో 5-0-26-2.