Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే నేడు
- ఓడితే సిరీస్‌పై ఆశలు గల్లంతు
- మధ్యాహ్నాం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-పార్ల్
వైట్వాల్ ఫార్మాట్లో ఓటమితో సిరీస్‌ను ఆరంభించిన టీమ్ ఇండియా.. నేడు కీలక సవాల్‌కు ఎదురు నిలిచింది. తొలి వన్డేలో దారుణ భంగపాటుతో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. వ్యూహాత్మకంగా, నైపుణ్య పరంగా భారత్‌పై దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. ఆ ఉత్సాహంలోనే మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ విజయం సాధించాలని సఫారీలు భావిస్తున్నారు. నేడు ఓడితే వన్డే సిరీస్‌పైనా భారత్ ఆశలు వదులుకోవాల్సిందే. లెక్క సమం చేస్తారా? సమర్పిస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే సమరం నేడు ఆరంభం.
రాహుల్‌పై ప్రశ్నలు! : పేస్ ఆల్‌రౌండర్ చేరికతో జట్టు సమతూకంపై మ్యాచ్‌కు ముందు ఉపన్యాసం ఇచ్చిన కెఎల్ రాహుల్.. తొలి వన్డేలో అసలు పేస్ ఆల్‌రౌండర్ సేవలను వాడుకోలేదు. యుజ్వెంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్లపై డసెన్, బవుమాలు విరుచుకుపడుతున్నా అరంగ్రేట ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చేతికి బంతిని ఇవ్వలేదు. నాయకత్వ పరంగా కెఎల్ రాహుల్ తొలి వన్డేలో పూర్తిగా నిరాశపరిచాడు. చెప్పుకోదగిన రీతిలో ఏ ఒక్క బౌలింగ్ మార్పు లేదు. బవుమా, డసెన్ భాగస్వామ్యం బలపడుతున్న దశలో రాహుల్ వద్ద ప్రత్యామ్నాయ వ్యూహలే కరువయ్యాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగానూ భారత్‌ను దెబ్బతీసింది. సరైన సమయంలో బౌలింగ్ మార్పులతో ఫలితం రాబట్టింది. విరాట్ కోహ్లి వన్డే కెప్టెన్సీపై బోర్డు వేటు వేయగా.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలి సిరీస్‌లో ముందడుగు వేస్తున్నాడు. టెస్టు కెప్టెన్సీ ఆశిస్తోన్న రాహుల్ వన్డే నాయకత్వంతో వైస్ కెప్టెన్సీ సైతం కోల్పోయే ప్రమాదంలో పడేందుకు అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లి శతక నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఛేదనలో మొనగాడిగా పేరొందిన కోహ్లి తొలి వన్డేలో 51 పరుగులు చేసినా.. జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు ఆ ప్రదర్శన సరిపోలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో జట్టులో తన విలువను చాటుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ షార్ట్ బంతులకు సమాధానం వెతుక్కోవాలి, లేదంటే జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం కావచ్చు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ జోడీ నుంచి జట్టు మేనేజ్మెంట్ అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తోంది.
మరో వైపు దక్షిణాఫ్రికా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి 20 ఓవర్లలో తడబడినా, ఆ జట్టు గొప్పగా పుంజుకుంది. తొలి 30 ఓవర్లలో చేసిన పరుగులను, చివరి 20 ఓవర్లలోనే పిండుకుంది. ఇద్దరు బ్యాటర్ల శతకాలతో సఫారీలు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆ జట్టు బౌలర్లు సైతం అంచనాల మేరకు రాణిస్తున్నారు. తొలి వన్డే వేదికలోనే నేటి మ్యాచ్ ఆడనుండటం ఆతిథ్య దక్షిణాఫ్రికా కలిసి రానుంది.