Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలోనూ భారత్ చిత్తు
- వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా వశం
సఫారీ గడ్డపై టీమ్ ఇండియా వైఫల్య యాత్ర కొనసాగుతోంది. ఆధిక్యంలో నిలిచినా తుదకు టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. వన్డేల్లోనూ నిరాశపరుస్తోంది. వరుసగా రెండో వన్డేలో దారుణ ఓటమితో సిరీస్ ఓటమి మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (85), రాహుల్ (55), శార్దుల్ ఠాకూర్ (40) రాణించటంతో భారత్ తొలుత 287 పరుగులు చేయగా.. ఊరించే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-పార్ల్
వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా వశమైంది. జానెమాన్ మలాన్ (91, 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), క్వింటన్ డికాక్ (78, 66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో 288 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు మలాన్, డికాక్ తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యంతో గెలుపుకు బాటలు వేయగా తెంబ బవుమా (35, 36 బంతుల్లో 3 ఫోర్లు), ఎడెన్ మార్కరం (367నాటౌట్, 41 బంతుల్లో 4 ఫోర్లు), రాసెన్వాన్డర్ డసెన్ (37 నాటౌట్, 38 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. బ్యాటింగ్ లైనప్‌లో టాప్-4 బ్యాటర్లు అంచనాల మేరకు రాణించటంతో 48.1 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా లాంఛనం పూర్తి చేసింది. 7 వికెట్లతో తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత భారత్ 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85, 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (55, 79 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరువగా శార్దుల్ ఠాకూర్ (40 నాటౌట్, 38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షోతో కదం తొక్కాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) దారుణంగా నిరాశపరిచాడు. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగనుంది.
పంత్ మెరిసినా..! : టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లు తొలి వికెట్‌కు 63 పరుగులతో శుభారంభం అందించారు. దూకుడుగా ఆడిన ధావన్ వికెట్ కోల్పోగా.. కొద్దిసేపటికే స్పిన్నర్ మహరాజ్ భారత్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. శతక వేటలో ఉన్న విరాట్ కోహ్లి (0)ని మహరాజ్ మాయ చేశాడు. కోహ్లి సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 64/2తో ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలిసి రిషబ్ పంత్ శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్‌కు 8, 46 పరుగుల వద్ద జీవనదానాలు లభించగా.. ఓ రనౌట్ ప్రమాదం నుంచి సైతం గట్టెక్కాడు. అయినా, అర్థ సెంచరీ అనంతరం అతడు వికెట్ నిలుపుకోలేదు. మరోవైపు రిషబ్ పంత్ ధనాధన్ షో చూపించాడు. పది ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. 43 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రిషబ్ పంత్ వేగంగా శతకం వైపు సాగాడు. స్వల్ప విరామంలో పంత్, రాహుల్ పెవిలియన్ చేరటంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది.
శ్రేయస్ అయ్యర్ (11) మరోసారి విఫలం కాగా, వెంకటేశ్ అయ్యర్ (22, 33 బంతుల్లో 1 సిక్స్) అంచనాలను అందుకోలేదు. పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (40 నాటౌట్), స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (25 నాటౌట్) చివర్లో మెప్పించారు. ఈ ఇద్దరు జోరుతో భారత్ పోటీపడగల స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో షంషి (2/57) రెండు వికెట్లతో రాణించాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) డసెన్ (బి) మంగల 55, ధావన్ (సి) మంగల (బి) మార్కరం 29, కోహ్లి (సి) బవుమా (బి) మహరాజ్ 0, పంత్ (సి) మార్కరం (బి) షంషి 85, శ్రేయస్ (ఎల్బీ) షంషి 11, అయ్యర్ (స్టంప్డ్) డికాక్ (బి) ఫెలుక్వాయో 22 ఠాకూర్ నాటౌట్ 40, అశ్విన్ నాటౌట్ 25, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (50 ఓవర్లలో 6 వికెట్లకు) 287.
బౌలింగ్ : లుంగి ఎంగిడి 8-0-35-0, మంగల 8-0-64-1, మార్కరం 8-0-34-1, మహరాజ్ 9-052-1, ఫెలుక్వాయో 8-0-44-1, షంషి 9-0-57-2.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : మలాన్ (బి) బుమ్రా 91, డికాక్ (ఎల్బీ) ఠాకూర్ 78, బవుమా (సి,బి) చాహల్ 35, మార్కరం 37 నాటౌట్, డసెన్ 37 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 288.
బౌలింగ్ : బుమ్రా 10-0-37-1, భువనేశ్వర్ 8-0-67-0, అశ్విన్ 10-1-68-0, చాహల్ 10-047-1, ఠాకూర్ 5-0-35-0, అయ్యర్ 5-0-28-0, శ్రేయస్ 0.1-0-1-0.