Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబితా విడుదల చేసిన బీసీసీఐ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ మెగా ఆటగాళ్ల వేలానికి తొలి అడుగు పడింది. ఎనిమిది ప్రాంఛైజీలకు తోడు రెండు నూతన ప్రాంఛైజీలు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న అనంతరం వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసింది. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో కలిసి ఏకంగా 1214 మంది ఆటగాళ్లు మెగా ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉన్నారు. 1214 మంది క్రికెటర్లలో 270 మంది క్యాప్డ్ క్రికెటర్లు ఉండగా.. 312 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అసోసియేట్ జట్ల నుంచి 41 మంది క్రికెటర్లు వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాను ప్రాంఛైజీలకు పంపించనున్న బీసీసీఐ.. వేలానికి ఓ రెండు రోజుల ముందు తుది జాబితాను తయారు చేయనుంది. ప్రాంఛైజీలు తమ అవసరాల జాబితాను బోర్డుకు తిరిగి పంపాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూర్ వేదికగా ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు.
వార్నర్‌కు అందలం! : ఐసీసీ టీ20 ప్రపంచకప్ హీరో డెవిడ్ వార్నర్ ఐపీఎల్ అగ్ర తాంబూలం దక్కించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీతో తెగతెంపులు చేసుకున్న వార్నర్ ఈ ఏడాది వేలంలోకి రానున్నాడు. అతడిని బోర్డు రూ. 2 కోట్ల గరిష్ట ధర జాబితాలో చేర్చింది. అంతర్జాతీయ స్టార్స్ మిచెల్ స్టార్క్, శామ్ కరణ్, బెన్ స్టోక్స్, క్రిస్ గేల్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి రావటం లేదు. రూ. 2 కోట్ల జాబితాలో 17 మంది భారత, 32 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, పాట్ కమిన్స్, ఆడం జంపా, స్టీవ్ స్మిత్, షకిబ్ అల్ హసన్, మార్క్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, డుప్లెసిస్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ, డ్వేన్ బ్రావో ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ రూ. 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నాడు. తుది జాబితాలో శ్రీశాంత్ నిలుస్తాడో లేదో చూడాలి. రూ.1.5 కోట్ల జాబితాలో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అరోన్ ఫించ్, క్రిస్ లిన్, నాథన్ లైయాన్, కేన్ రిచర్డ్సన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్, డెవిడ్ మలాన్, ఆడం మిల్నె, కొలిన్ మన్రో, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, కొలిన్ ఇన్‌గ్రామ్, షిమ్రోన్ హెట్మయర్, జేసన్ హౌల్డర్, నికోలస్ పూరన్‌లు ఉన్నారు. రూ. 1 కోటి జాబితాలో పియూశ్ చావ్లా, కేదార్ జాదవ్, ప్రసిద్ కృష్ణ, టి నటరాజన్, మనీశ్ పాండే, అజింక్య రహానె, నితీశ్ రానా, వృద్దిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్, ఫాల్క్‌నర్, మహ్మద్ నబి, మోయిసిస్ హెన్రిక్స్, లివింగ్‌స్టోన్, మార్కరం, కాన్వే, శాంట్నర్, వాన్‌డర్ డసెన్, హసరంగ, రోస్టన్ ఛేజ్, రూథర్‌ఫోర్డ్‌లు చోటు చేసుకున్నారు.