Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దక్షిణాఫ్రికాతో భారత్ మూడో వన్డే నేడు
- వైట్‌వాష్ ప్రమాదంలో భారత్
- క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన సఫారీలు
వన్డే సిరీస్ క్లీప్స్వీప్ విజయంపై ఆతిథ్య దక్షిణాఫ్రికా గురి పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, నాయకత్వంలో భారత్‌పై స్పష్టమైన పైచేయి సాధించిన సఫారీలు నేడు క్లీన్‌స్వీప్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభంలో ఎవరూ ఇటువంటి ముగింపు ఊహించలేదు. చారిత్రక టెస్టు సిరీస్, వన్డే సిరీస్ విజయాలు టీమ్ ఇండియాకు నల్లేరు మీద నడకే అనిపించింది. భారత్‌తో సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుగా గొప్ప ప్రదర్శన చేయగా.. నాయకత్వ మార్పు తరుణంలో భారత్ బొక్కాబోర్లా పడింది. చివరి వన్డేలో నెగ్గి ఊరట పొందాలని భారత్ భావిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే నేడు.
నవతెలంగాణ-కేప్‌టౌన్
వన్డే పోరు వేదిక మారింది. పార్ల్‌లో వన్డే సిరీస్‌పై ఆశలు కోల్పోయిన భారత్.. కేప్‌టౌన్‌లో ఊరట విజయం కోసం బరిలోకి దిగుతోంది. తిరుగులేని హాట్ ఫేవరేట్‌గా సఫారీ పర్యటనను ఆరంభించిన భారత్.. తుదకు వైట్‌వాష్ ప్రమాదం తప్పితే చాలనుకునే దుస్థితిలో నిలిచింది. వరుసగా తొలి రెండు వన్డేల్లో సాధికారిక విజయాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా నేడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. తొలి రెండు వన్డేల్లో అంచనాలను ఏమాత్రం అందుకోని భారత్ నేడైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందేమో చూడాలి. భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే పోరు నేడు ఆరంభం. మధ్యాహ్నాం 2 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం.
సమిష్టిగా రాణిస్తేనే..! : 2023 వన్డే వరల్డ్‌కప్ జట్టు నిర్మాణం సన్నద్ధత భారత్ అసలు లక్ష్యం. ఆ టార్గెట్‌తోనే సఫారీలతో సిరీస్‌లో పలు ప్రయోగాలకు సైతం సిద్ధపడింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ నాయకుడిగా, బ్యాటర్‌గా ఆశించిన ప్రదర్శన చేయటంలో విఫలమయ్యాడు. తొలి రెండు వన్డేల్లో అతడి స్ట్రయిక్‌రేట్ 69.79 మాత్రమే. వనరులను వినియోగం చేసుకోవటంలో కెఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రధాన బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు. తొలి వన్డేలో అర్థ సెంచరీ సాధించినా, రెండో వన్డేలో సున్నా పరుగులకే నిష్క్రమించాడు. శతకం సంగతి అటుంచి, జట్టును గెలుపు తీరాలకు చేర్చగల ఇన్నింగ్స్ ఆడితే అదే చాలు అన్నట్టు పరిస్థితి తయారైంది. ఆరంగేట్ర ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. రిషబ్ పంత్, శిఖర్ ధావన్ నుంచి జట్టు మేనేజ్మెంట్ ధనాధన్ ప్రదర్శన ఆశిస్తోంది.
వన్డేల్లో భారత బౌలర్ల ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్ మాయ చేయటంలో విఫలమయ్యారు. అశ్విన్ బ్యాట్‌తో మెరిసినా.. బంతితో నిరాశపరిచాడు. పవర్‌ప్లేలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత 23 వన్డేల్లో మన బౌలర్లు పవర్‌ప్లేలో పది వికెట్లు మాత్రమే పడగొట్టారు. సగటు 132.10, ఎకానమీ 5.74తో చెత్తగా ఉన్నాయి. కొత్త బంతితో సమస్యల సవాల్‌కు బౌలర్లు కేప్టౌన్లోనైనా కొత్త ఫార్ములా కనుగొంటారామే చూడాలి.
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..! : 2021 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణా ఫ్రికా ఉత్తమ బ్యాటర్ ఎడెన్ మార్కరం. భారత్‌తో టెస్టులు అతడు ఆకట్టుకోలేదు. తొలి వన్డేలోనూ విఫలమ య్యాడు. రెండో వన్డేలో మార్కరం మెరుగైన ప్రదర్శన చేశాడు. 41 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించాడు. దీంతో నేడు చివరి వన్డేలో మార్కరం భారీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కుతాడనే అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ తెంబ బవుమా నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో అతడి వికెట్ కోసం బౌలర్లు చెమటోడ్చేలా చేస్తున్నాడు. క్వింటన్ డికాక్ సహా జానెమాన్ మలాన్, తెంబ బవుమా, ఎడెన్ మార్కరంలు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. వాన్‌డర్ డసెన్ తొలి వన్డేలో శతకం బాదాడు. డెవిడ్ మిల్లర్ తనదైన శైలిలో ధనాధన్ మోత బాకీ పడ్డాడు. బౌలింగ్ విభాగంలో షంషి, మంగలకు తోడుగా నేడు మార్కో జాన్సెన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. లుంగిసాని ఎంగిడికి విశ్రాంతి లభించనుంది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాకు ఎదురు లేదు. ఇక్కడ ఆడిన 37 వన్డేల్లో సఫారీలు ఏకంగా 31 మ్యాచుల్లో విజయాలు నమోదు చేశారు.
పిచ్, వాతావరణం : కేప్‌టౌన్‌లో చివరి వన్డే ఫిబ్రవరి 2020లో జరిగింది. ఇక్కడ వన్డే మ్యాచ్‌కు పిచ్ ఏ విధంగా స్పందిస్తుందో చెప్పటం కొంచెం కష్టమే. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పార్ల్తో పోల్చితే కేప్‌టౌన్ చల్లని ప్రదేశం. ఇక్కడ టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్/భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), జానెమాన్ మలాన్, తెంబ బవుమా (కెప్టెన్), ఎడెన్ మార్కరం, రాసీవాన్డర్ డసెన్, డెవిడ్ మిల్లర్, ఆండ్లీ ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, సిసిందా మంగల, షంషి.