Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాళవికపై ఫైనల్లో ఏకపక్ష విజయం
- సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ
లక్నో : రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. సహచర యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్‌పై పి.వి సింధు సాధికారిక విజయం సాధించింది. వరుస గేముల్లో యువ షట్లర్‌పై అలవోక విజయం నమోదు చేసింది. 21-13, 21-16తో పి.వి సింధు గెలుపొందింది. 35 నిమిషాల్లోనే ముగిసిన టైటిల్ పోరులో హైదరాబాదీ అమ్మాయికి ఎదురు లేదు. 2017లో తొలిసారి సయ్యద్ మోడీ టైటిల్ నెగ్గిన సింధు.. రెండోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
సింధు అనుభవం ఉపయోగించి, ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అగ్రశ్రేణి షట్లర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మాళవిక బాన్సోద్ శతథా ప్రయత్నం చేసింది. తొలి గేమ్‌లో 7-0తో దూసుకెళ్లిన సింధు విరామ సమయానికి 11-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలో మాళవిక పుంజుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ సింధు జోరు ముందు ఆమె ఆట చిన్నబోయింది. రెండో గేమ్‌లో మాళవిక కాస్త మెరుగైన ప్రదర్శన చేసినా.. సింధుకు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేకపోయింది. అలవోకగా రెండు గేములు గెల్చుకున్న సింధు మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 'తొలి గేమ్ నుంచి గెలుపు కోసం వెళ్లాను, ప్రతి పాయింట్‌కు నాకు ముఖ్యమే. నేను ఆధిక్యంలో కొనసాగినా ఏ దశలో మాళవికను అలవోకగా తీసుకోలేదు. నిలకడగా రాణించాలని అనుకున్నాను' అని టైటల్ అందుకున్న అనంతరం సింధు తెలిపింది.