Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాష్లె బార్టీ, క్రజికోవా సైతం
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022
స్పెయిన్ బుల్ మెల్బోర్న్లో అదరగొట్టింది. తొలి సెట్లోనే 28 నిమిషాల 40 సెకండ్ల మహా టైబ్రేకర్‌ను జయించిన రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రీ క్వార్టర్స్ గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు మరో విజయాల దూరంలో నిలిచాడు నాదల్. స్పెయిన్ బుల్ 14వ సారి మెల్బోర్న్ మెగా ఈవెంట్లో క్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు.
నవతెలంగాణ-మెల్బోర్న్
నాలుగు సెట్ పాయింట్లు కాచుకుని, 28 నిమిషాల 40 సెకండ్ల టైబ్రేకర్‌ను దాటుకుని దూకుడు ప్రదర్శించిన స్పెయిన్ బుల్, 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రఫెల్ నాదల్ తనదైన శైలిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఆడ్రియన్ మన్నారిన్హో వరుస సెట్లలో గెలుపొందిన రఫెల్ నాదల్ సింహగర్జన చేశాడు. మాట్లో బెరాటిని, మోన్ఫిల్స్, షపలోవ్ సైతం పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నం.1 యాష్లె బార్టీ, అమెరికా భామ మడిసన్ కీస్, నాల్గో సీడ్ చెక్ భామ క్రిజకోవాలు క్వార్టర్ఫైనల్లో అడుగుమోపారు.
నాదల్ జోరు : మెల్బోర్న్లో రఫెల్ నాదల్ జోరు సాగుతోంది. ఫ్రాన్స్ ఆటగాడు ఆడ్రియన్ మన్నారిన్హోపై వరుస సెట్లలో నాదల్ గెలుపొందాడు. 7-6(16-14), 6-2, 6-2తో స్పెయిన్ బుల్ గర్జించింది. 16 ఏస్‌లతో దండెత్తిన నాదల్ ఐదు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టాడు. పాయింట్ల పరంగా 107-85తో, గేముల పరంగా 19-10తో నాదల్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. ఏడో సీడ్ మాట్లో బెరాటిని సైతం వరుస సెట్లలో గెలుపొందాడు. 7-5, 7-6(7-4),6-4తో స్పెయిన్ ఆటగాడు పాబ్లో కారెనో బుస్టాపై అలవోక విజయం సాధించాడు. 28 ఏస్‌లు సంధించిన బెరాటిని రెండు బ్రేక్ పాయింట్లు సైతం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మూడో సీడ్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. 14వ సీడ్ డెనిస్ షపలోవ్ చేతిలో జ్వెరెవ్ వరుస సెట్లలో ఓటమి చెందాడు. 3-6, 6-7(5-7), 3-6తో జ్వెరెవ్ నిరాశపరిచాడు. షపలోవ్ నాలుగు బ్రేక్ పాయింట్లతో జ్వెరెవ్‌ను దెబ్బకొట్టాడు. జ్వెరెవ్ 88 పాయింట్లు సాధించగా, షపలోవ్ 104 పాయింట్లు గెల్చుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు గేల్ మోన్ఫీల్స్ 7-5, 7-6(7-4), 6-3తో చెక్ రిపబ్లిక్ ఆటగాడిపై వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరాడు.
మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్, వరల్డ్ నం.1 యాష్లె బార్టీ క్వార్టర్స్‌లో కాలుమోపింది. 6-4, 6-3తో అమెరికన్ క్రీడాకారిణి ఆమంద అనిసిమోవపై గెలుపొందింది. 6-4, 6-3తో బార్టీ (ఆస్ట్రేలియా) అదరగొట్టింది. ఏడు ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో బార్టీ ఆధిపత్యం చెలాయించింది. అమెరికా క్రీడాకారిణి మడిసన్ కీస్ 6-3, 6-1తో పౌలా బడోసాపై గెలుపొందింది. మూడు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. విక్టోరియా అజరెంకాకు ప్రీ క్వార్టర్స్‌కు చుక్కెదురైంది. 2-6, 2-6తో చెక్ భామ బార్బరా క్రిజకోవా చేతిలో అజరెంకా ఓటమి పాలైంది. ఐదో సీడ్ మరియ సక్కరి 6-7(0-7), 3-6తో జెస్సికా పెగులా చేతిలో పరాజయం పాలైంది.
క్వార్టర్స్‌లో సానియా జోడీ : భారత టెన్నిస్ స్టార్, ఈ సీజన్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. అమెరికా భాగస్వామి రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. అన్‌సీడెడ్ ఇండో అమెరికన్ జోడీ గంట 27 నిమిషాల ప్రీ క్వార్టర్స్‌లో 7-6(8-6), 6-4తో ఆస్ట్రేలియా జోడీపై విజయం సాధించింది.