Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0-3తో వన్డే సిరీస్ ఓడిన భారత్
- ఉత్కంఠ పోరులో సఫారీలదే పైచేయి
- ఛేదనలో చాహర్ పోరాటం వృథా
నవతెలంగాణ-కేప్‌టౌన్
పరాజయం పరిపూర్ణమైంది. 0-3తో వన్డే సిరీస్ వైట్‌వాష్ ఓటమి. రాహుల్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ శిక్షణ సారథ్యంలో భారత్ తొలి వన్డే సిరీస్‌లోనే బొక్కాబోర్లా పడింది. చివరి వన్డేలో గెలుపు వేటలో చివరి వరకు పోరాడినా టీమ్ ఇండియాకు నిరాశ తప్పలేదు. 288 పరుగుల ఛేదనలో భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకే కుప్పకూలింది. 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (124, 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాన్‌డర్ డసెన్ (52, 59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత దక్షిణాఫ్రికా 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లి (65, 84 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్ ధావన్ (61, 73 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలకు తోడు చివర్లో దీపక్ చాహర్ (54, 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ షోతో చెలరేగినా భారత్‌కు భంగపాటు తప్పలేదు.
పోరాడినా..! : 288 పరుగుల లక్ష్యం. 210 పరుగులకే ఆరు వికెట్లు. టెయిలెండర్లు మాత్రమే మిగిలిన పరిస్థితుల్లో సఫారీ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ దీపక్ చాహర్ (54) ధనాధన్ షోతో విజృంభించాడు. 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిన చాహర్ భారత్‌ను గెలుపుకు చేరువ చేశాడు. బుమ్రా (12, 15 బంతుల్లో 2 ఫోర్లు) చాహర్‌కు తోడుగా నిలిచాడు. 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ విజయం ఖాయమనిపించింది. వరుసగా చాహర్, బుమ్రా వికెట్లతో పరిస్థితి మారిపోయింది. చివరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో చాహల్ వికెట్‌తో భారత్ ఆలౌటైంది. విజయానికి ఐదు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. తొలుత ఛేదనలో కెప్టెన్ రాహుల్ (9) నిరాశపరిచినా శిఖర్ ధావన్ (61), విరాట్ కోహ్లి (65) అర్థ సెంచరీలతో భారత్‌ను ట్రాక్‌లో నిలిపారు. పంత్ (0), శ్రేయస్ (26) విఫలమయ్యారు.
డికాక్ శతకం : టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు డికాక్ గట్టి షాక్ ఇచ్చాడు. సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ వన్డేల్లో 16వ శతకంతో ఆతిథ్య జట్టుకు భారీ స్కోరు అందించాడు. 12 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన క్వింటన్ డికాక్ భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. జానెమాన్ మలాన్ (1), తెంబ బవుమా (8), ఎడెన్ మార్కరం (15) వికెట్లతో దక్షిణాఫ్రికా ఇరకాటంలో పడినా.. డికాక్‌తో కలిసి వాన్‌డర్ డసెన్ (52) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. డికాక్ శతకబాదగా.. డసెన్ మరో అర్థ సెంచరీతో కదం తొక్కాడు. లోయర్ ఆర్డర్లో డెవిడ్ మిల్లర్ (39, 38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డ్వేన్ ప్రిటోరిస్ (20, 25 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, చాహర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : డికాక్ (సి) ధావన్ (బి) బుమ్రా 124, మలాన్ (సి) పంత్ (బి) చాహర్ 1, బవుమా (రనౌట్) 8, మార్కంర (సి) గైక్వాడ్ (బి) చాహర్ 15, డసెన్ (సి) అయ్యర్ (బి) చాహల్ 52, మిల్లర్ (సి) కోహ్లి (బి) ప్రసిద్ 39, ఫెలుక్వాయో (రనౌట్) 4, ప్రిటోరియస్ (సి) సూర్య (బి) బుమ్రా 6, మంగల (సి) రాహుల్ (బి) ప్రసిద్ 0, లుంగి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు :18, మొత్తం :(49.5 ఓవర్లలో ఆలౌట్) 287.
బౌలింగ్ : చాహర్ 8-0-53-2, బుమ్రా 10-0-52-2, ప్రసిద్ 9.5-0-59-3, జయంత్ 10-0-53-0, చాహల్ 9-0-47-1, శ్రేయస్ 3-0-21-0.
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) మలాన్ (బి) లుంగి 9, ధావన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 61, కోహ్లి (సి) బవుమా (బి) మహరాజ్ 65, పంత్ (సి) మంగల (బి) ఫెలుక్వాయో 0, శ్రేయస్ (సి) ఫెలుక్వాయో (బి) మంగల 26, సూర్య (సి) బవుమా (బి) ప్రిటోరిస్ 39, చాహర్ (సి) ప్రిటోరిస్ (బి) లుంగి 54, జయంత్ (సి) బవుమా (బి) లుంగి 2, బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12, చాహల్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరిస్ 2, ప్రసిద్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (49.2 ఓవర్లలో ఆలౌట్) 283.
బౌలింగ్ : లుంగి ఎంగిడి 10-058-3, ప్రిటోరిస్ 9.2-0-54-2, మంగల 10-0-69-1, మహరాజ్ 10-039-1, ఫెలుక్వాయో 7-0-40-3, మార్కరం 3-0-21-0.