Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతీ
దుబాయ్ : భారత మహిళల క్రికెట్ సూపర్‌స్టార్, ఆల్ ఫార్మాట్ అగ్ర బ్యాటర్ స్మృతీ మంధానను ప్రతిష్మ్టాత్మక ఐసీసీ పురస్కారం వరించింది. 2021లో అన్ని ఫార్మాట్లలో అదిరే ప్రదర్శన చేసిన మంధాన 'ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021' అవార్డును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిసీ పెర్రీ గత ఏడాది ఈ అవార్డును గెల్చుకోగా.. ఈ పురస్కారం అందుకోనున్న రెండో మహిళా క్రికెటర్‌గా స్మృతీ మంధాన నిలిచింది. ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సైతం మంధాన నామినేట్ అయినా.. ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమోంట్ ఆ అవార్డును గెల్చుకుంది. 2018లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన మంధాన రెండోసారి ఐసీసీ వార్షిక పురస్కారం దక్కించుకుంది. నిరుడు జరిగిన 22 అంతర్జాతీయ మ్యాచుల్లో (మూడు ఫార్మాట్లు) స్మృతీ మంధాన 855 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి.
పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా ఆఫ్రిది ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా అంపైర్ మరియస్ ఎరాస్మస్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు.