Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్‌తో వైట్‌బాల్ సిరీస్
- ఈ వారంలోనే సెలక్షన్ కమిటీ భేటీ
నవతెలంగాణ-ముంబయి
విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల నాయకుడిగా నిష్క్రమించటం, నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవటంతో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ పలు సమస్యలు ఎదుర్కొంది. కెఎల్ రాహుల్ నాయకుడిగా మెప్పించటంలో విఫలమయ్యాడు. ఓ టెస్టు, మూడు వన్డేల్లో జట్టును పేలవంగా నడిపించాడు. వన్డే సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోయింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్ వైట్‌బాల్ సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. అహ్మదాబాద్, కోల్‌కత వేదికగా జరుగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు రోహిత్ శర్మ రానున్నాడు. ప్రస్తుతం ముంబయిలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మ, ఒకట్రెండు రోజుల్లో బెంగళూర్‌లో ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ శర్మ నెగ్గటం లాంఛనమేనని.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతడే నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వెస్టిండీస్‌తో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈ వారంలోనే బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.
దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్ ఓటమితో టీమ్ ఇండియా వైట్‌బాల్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం నేపథ్యంలో పలువురు సీనియర్ క్రికెటర్ల ప్రదర్శన చర్చకు రానున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ భువనేశ్వర్ కుమార్లపై సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకునే వీలుంది. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మెప్పించలేదు. అతడి స్థానంలో తిరిగి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను విండీస్‌తో సిరీస్‌కు తీసుకోనున్నారని చెప్పవచ్చు. హార్దిక్ బౌలింగ్ సామర్థ్యంపై అనుమానాలు కొనసాగుతున్నా లోయర్ ఆర్డర్లో అతడి విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు జట్టుకు ఎంతో అవసరమని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది. ఇక టెస్టు జట్టుకు సైతం రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడు. శ్రీలంకతో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. 2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్‌కప్‌లతో రోహిత్ శర్మపై భారం పడనున్నా.. మరో ప్రత్యామ్నాయం లేనందున రోహిత్ శర్మనే ఐదు రోజుల ఆటకు సారథ్యం వహించాల్సి రావచ్చు. కెఎల్ రాహుల్ మరికొన్నాళ్లూ రోహిత్‌కు డిప్యూటీగా కొనసాగాల్సి ఉంటుంది. స్టార్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా పని భారం దృష్టిలో ఉంచుకుని అతడికి విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది.