Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ క్వార్టర్స్‌లో నాదల్ గెలుపు
- సెమీస్‌కు చేరిన ఆష్లె బార్టీ, మడిసన్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ఏస్‌లు, విన్నర్లు, కండ్లుచెదరే ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో వేడెక్కిన మెల్బోర్న్ పార్క్.. మంగళవారం యువ ఆటగాడి అసహనంతో కాస్త ఎక్కువ వేడెక్కింది!. స్పెయిన్ బుల్, 20 గ్రాండ్‌స్లామ్ విజేత రఫెల్ నాదల్‌తో ఐదు సెట్ల పోరులో తృటిలో విజయానికి దూరమైన డెనిస్ షపలోవ్ మ్యాచ్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. నాలుగు గంటల మెగా సమరంలో రఫెల్ నాదల్ పలుమార్లు, సుదీర్ఘంగా విరామం తీసుకునేందుకు అంపైర్లు అనుమతించటం అనైతికమని షపలోవ్ విమర్శలు గుప్పించాడు. సెమీస్‌లో చెమటోడ్చిన రఫెల్ నాదల్ ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
నవతెలంగాణ-మెల్బోర్న్
పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. నాలుగు గంటలకు పైగా సాగిన ఉత్కంఠ క్వార్టర్ఫైనల్లో కెనడా కుర్రాడు డెనిస్ షపలోవ్పై స్పెయిన్ బుల్ పైచేయి సాధించాడు. రఫెల్ నాదల్ పలుమార్లు విరామం తీసుకోవటంతో షపలోవ్ అసహానానికి లోనవటంతో పాటు అంపైర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఏడో సీడ్ మాట్టో బెరాటిని (ఇటలీ) సైతం మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. 17వ సీడ్ ఫ్రాన్స్ ఆటగాడు మోన్ఫిల్స్పై బెరాటిని విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసింది. అమెరికా అమ్మాయి పెగులాపై బార్టీ వరుస సెట్లలో విజయంతో సెమీపైనల్లోకి కాలుమోపింది. మడిసన్ కీస్ సైతం ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు చేరుకుంది. క్రజికోవాపై కీస్ గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో నేడు క్వార్టర్‌ఫైనల్స్‌లో సిన్నర్, స్టెఫానోస్ సిట్సిపాస్‌లు, ఆగర్, డానిస్ మెద్వదేవ్‌లు తలపడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఇగా స్వైటెక్‌తో కానేపి.. కార్నెట్తో కొలిన్స్‌లు సెమీఫైనల్స్ బెర్త్ కోసం పోటీపడనున్నారు.
అతి కష్టంగా రఫెల్ నాదల్ : ఆరో సీడ్, టైటిల్ ఫేవరేట్ రఫెల్ నాదల్ క్వార్టర్ఫైనల్లో చెమటోడ్చాడు. క్వార్టర్ఫైనల్లో కెనడా కుర్రాడు, 14వ సీడ్ డెనిస్ షపలోవ్పై 6-3, 6-4, 4-6, 3-6, 6-3తో నాదల్ గెలుపొందాడు. నాలుగు గంటల పాటు సాగిన క్వార్టర్స్ పోరులో తొలి రెండు సెట్లు నాదల్ గెలుపొందినా.. తర్వాతి రెండు సెట్లను షపలోవ్ సొంతం చేసుకున్నాడు. షపలోవ్ గట్టి పోటీ ఇవ్వటంతో ఫిట్నెస్ పరంగా నాదల్ బాగా అలసిపోయాడు. ఎనర్జీ లెవల్స్ అడుగంటినట్టు కనిపించాడు. దీంతో నాదల్ పలుమార్లు విరామం తీసుకోవటంతో, విరామం సమయంలో తరచూ మాట్లాడాడు. దీంతో షపలోవ్ కాస్త అసహనానికి గురయ్యాడు. చైర్ అంపైర్లు నాదల్‌ను ప్రత్యేకంగా చూడటం షపలోవ్ కోపాన్ని రెట్టింపు చేసింది. నిర్ణయాత్మక ఐదో సెట్లో నాదల్ 6-3తో గెలుపొంది మెల్బోర్న్ సెమీఫైనల్లోకి చేరుకున్నాడు. చివరగా ఇక్కడ ఆడిన 13 క్వార్టర్‌ఫైనల్స్‌లో నాదల్ ఏకంగా ఏడు సార్లు పరాజయం పాలయ్యాడు. దీంతో మంగళవారం సైతం నాదల్ అదే ప్రదర్శన పునరావృతం చేస్తాడనే అనిపించింది. కానీ నాదల్ ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించి నిలిచాడు. 'రఫెల్ నాదల్ సాధించిన ఘనతల పట్ల గౌరవం ఉంది. అతడు నమ్మశక్యం కాని ఆటగాడు. కానీ ఆటలో కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయి. ఓ ఆటగాడిగా ఎంతో అసహనం కలిగించింది. ఓ ఆటగాడిపై ఆడుతున్నట్టుగా లేదు, అంపైర్లతో పోటీపడుతున్నట్టు అనిపించింది' అని షపలోవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ' చిన్న అద్భుతం జరిగిందేమో తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే శారీరకంగా నేను అలసిపోయాను. కానీ నా సర్వ్ బాగా పని చేసింది. నా సర్వ్‌తో గెలిచిన ప్రతి సర్వ్ విజయమే కదా?. షపలోవ్ పట్ల బాధగా ఉంది. ఆటలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు' అని రఫెల్ నాదల్ అన్నాడు. ఇటలీ ఆటగాడు ఏడో సీడ్ మాట్టో బెరాటిని ఐదు సెట్ల పోరులో మోన్ఫిల్స్పై విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు, 17వ సీడ్ మోన్ఫిల్స్పై అతడు గెలుపొందాడు. 6-4, 6-4, 3-6, 3-6, 6-2తో బెరాటిని గర్జించాడు. తొలి రెండు సెట్లను సులువుగా సొంతం చేసుకున్న బెరాటిని.. తర్వాతి రెండు సెట్లను అంతే సులువుగా చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక సెట్లో మాత్రం జోరు చూపించాడు. 12 ఏస్‌లు కొట్టిన బెరాటిని.. నాలుగు బ్రేక్ పాయింట్లతో చెలరేగాడు. మోన్ఫిల్స్ ఏడు డబుల్ఫాల్ట్స్కు పాల్పడ్డాడు. పాయింట్ల పరంగా 156-150తో, గేముల పరంగా 24-22తో బెరాటిని పైచేయి సాధించాడు. సొంత సర్వ్‌లో 20 గేములు గెల్చుకున్న బెరాటిని.. ప్రత్యర్థి సర్వ్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసి సెమీఫైనల్లోకి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో రఫెల్ నాదల్‌తో పోరుకు బెరాటిని రంగం సిద్ధం చేసుకున్నాడు.
బార్టీ దూకుడు : 1978 తర్వాత ఓ ఆస్ట్రేలియన్ అమ్మాయి మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్‌ను ముద్దాడలేదు. 1980 తర్వాత స్థానిక క్రీడాకారిణి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి చేరలేదు. ఈ రెండు రికార్డులు బద్దలుకొట్టేందుకు సిద్ధమవుతున్న వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆష్లె బార్టీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరు ఏస్‌లు సంధించిన బార్టీ.. ఐదు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టింది. బార్టీ జోరు ముందు జెస్సికా పెగులా (అమెరికా) చేతులెత్తేసింది. 6-2, 6-0తో బార్టీ తిరుగులేని విజయం నమోదు చేసింది. ప్రీ క్వార్టర్స్‌లో నాల్గో సీడ్ సక్కారికి షాకిచ్చినా పెగులా క్వార్టర్స్‌లో బార్టీ ముందు నిలువలేకపోయింది. మరో క్వార్టర్ఫైనల్లో నాల్గో సీడ్ చెక్ రిపబ్లిక్ భామ బార్బరా క్రిజికోవాకు చుక్కెదురైంది. అమెరికా క్రీడాకారిణి మడిసన్ కీస్ 6-3, 6-2తో వరుస సెట్లలో విజయం సాధించింది. 11 ఏస్‌లు కొట్టిన మడిసన్ కీస్, నాలుగు బ్రేక్ పాయింట్లు గెలుపొందింది. 76-55 పాయింట్లతో క్రిజికోవాను చిత్తు చేసి సెమీఫైనల్లోకి చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో తొలి సెమీఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి, టైటిల్ ఫేవరేట్ ఆష్లె బార్టీతో మడిసన్ కీస్ సెమీస్‌లో తలపడనుంది.
ఇదిలా ఉండగా, మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జాకు పరాజయం ఎదురైంది. మహిళల డబుల్స్‌లో ఇప్పటికే పరాజయం పాలైన సానియా మీర్జా.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. అమెరికా భాగస్వామి రాజీవ్ రామ్, సానియా మీర్జా జోడీ 4-6, 7-6(7-5)తో జేసన్ కుబ్లెర్, జెమీ ఫోర్లీస్ జంట చేతిలో ఓటమి చెందారు.