Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3- 2 తేడాతో ఒడిశాపై విజయం
గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బరిలోకి దిగిన హెచ్ఎఫ్సీ.. ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్(ఓఎఫ్సీ)పై విజయకేతనం ఎగురవేసింది. గురువారం తిలక్మైదానం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ 3-2 తేడాతో ఓఎఫ్‌సీపై విజయం సాధించింది. దీంతో 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 23 పాయింట్లతో హెచ్ఎఫ్సీ తమ అగ్రస్ధానాన్ని మరింత పటిష్ఠం చేసుకోగా, ఒడిశా 17 పాయింట్లతో ఏడో స్ధానంలో నిలిచింది. మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున జోయల్(51ని), జావో విక్టర్(70ని), ఆకాశ్ మిశ్రా(73ని) గోల్స్ చేశారు. మరోవైపు ఒడిశా జట్టులో జెర్రీ(45ని), జొనథాస్(84ని) గోల్స్ అందించారు.
ఆది నుంచే హౌరాహౌరీగా:
ఐఎస్ఎల్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. టాప్-4లో సుస్ధిర స్థానమే లక్ష్యంగా రెండు జట్లు ఆది నుంచే హౌరాహౌరీగా తలపడ్డాయి. ఆట మొదలైన మొదటి నిమిషం నుంచే హైదరాబాద్, ఒడిశా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాయి. మ్యాచ్ మొదలైన ఎనిమిదో నిమిషంలో బంతిని అందిపుచ్చుకున్న అనికేత్ జాదవ్..డీబాక్స్లో దూకుడుగా దూసుకెల్లినా గోల్ సాధ్యపడలేదు. రెండు నిమిషాల తేడాతో సౌవిక్ చక్రవర్తి యెల్లో కార్డ్‌కు గురయ్యాడు. ప్రత్యర్థి ప్లేయర్ లిరిడాన్ను దురుసుగా అడ్డుకోవడంతో సౌవిక్..రిఫరీ మందలింపునకు గురయ్యాడు. రెండు జట్లు ఒకరి గోల్‌పోస్ట్‌పై ఒకరు మెరుపు దాడులకు పూనుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు హెచ్ఎఫ్సీ, ఒడిశా ప్రయత్నించాయి. ఈ క్రమంలో తమ వ్యుహాలకు మరింత పదును పెట్టాయి. ప్రథమార్థం ఇక మరికొద్ది సేపట్లో ముగుస్తుందన్న తరుణంలో ఒడిశా గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హెచ్ఎఫ్సీ గోల్‌కీపర్ కట్టిమణి తప్పిదాన్ని అనుకూలంగా మలుచుకుంటూ ఓఎఫ్సీ ప్లేయర్ జెర్రీ గోల్ కొట్టాడు. బంతిని తమ ఆధీనంలో ఉంచుకునే విషయంలో సమవుజ్జీలుగా వ్యవహరించిన హెచ్ఎఫ్సీ, ఒడిశా కీలకమైన ద్వితీయార్థంలో మరింత జోరు పెంచాయి.
హెచ్ఎఫ్సీ ట్రిపుల్:
ద్వితీయార్థంలో హెచ్‌ఎఫ్‌సీకి మొదట్లోనే అద్రుష్టం కలిసి వచ్చింది. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే జోయల్ చియానిస్ గోల్ కొట్టడంతో హెచ్ఎఫ్సీ గోల్ సంబురాల్లో మునిగి పోయింది. ఒడిశా డిఫెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ జోయల్ కొట్టిన గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఈ క్రమంలో గోల్స్ సంఖ్యను పెంచుకునేందుకు హెచ్ఎఫ్సీ ఇద్దరు ప్లేయర్లను మార్చింది. 62వ నిమిషంలో పెనాల్టీ అవకాశం కోసం హెచ్ఎఫ్సీ రిఫరీకి అప్పీల్ చేసినా..లాభం లేకపోయింది. అయినా వెనుకకు తగ్గని హెచ్‌ఎఫ్‌సీకి 70వ నిమిషంలో లక్ మళ్లీ కలిసి వచ్చింది. అశిష్ రారు నుంచి బంతి అందుకున్న జావో విక్టర్ కండ్లు చెదిరే రీతిలో గోల్ కొట్టడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1కు చేరింది. అయితే మరో మూడు నిమిషాల తేడాతో హెచ్ఎఫ్సీ మరో గోల్ ఖాతాలో వేసుకుంది. యాసిర్ అహ్మద్ అందించిన పాస్‌ను అకాశ్ మిశ్రా గోల్ కొట్టడంతో ఆధిక్యం 3-1కు చేరింది. దీంతో అప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన ఒడిశా..తిరిగి పుంచుకునేందుకు ప్రయత్నించింది. మ్యాచ్ 84వ నిమిషంలో జొనథాస్ గోల్ చేయడంతో ఒడిశా ఖాతాలో మరో గోల్ చేరింది. ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు ఒడిశా ప్రయత్నించినా లాభం లేకపోయింది.