Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలిన్స్‌తో టైటిల్ పోరుకు ఆష్లె రెఢ
- 42 నిరీక్షణకు తెరదించిన ఆసీస్ భామ
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
42 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఆసీస్ భామ ఆష్లె బార్టీ కంగారూ ప్రజల్లో కొత్త ఆశలు రేపింది. 1978 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి చేరుకున్న తొలి ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణిగా ఆష్లె బార్టీ చరిత్ర సృష్టించింది. వరల్డ్ నం.1గా మెల్బోర్న్లో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న ఆష్లె బార్టీ టైటిల్‌ను సైతం ముద్దాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అమెరికా అమ్మాయి డానిలీ కొలిన్స్‌తో ఆష్లె బార్టీ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం పోటీపడనుంది.
నవతెలంగాణ-మెల్బోర్న్
వరల్డ్ నం.1, అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి ఆష్లె బార్టీ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి చేరుకుని, 42 ఏండ్ల ఆస్ట్రేలియా నిరీక్షణకు తెరదించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా స్టార్ మడిసన్ కీస్పై వరుస సెట్లలో గెలుపొందిన బార్టీ.. లోకల్ స్టార్‌గా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ విజయం అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మహిళల సింగిల్స్ మరో సెమీఫైనల్లో అమెరికా చిన్నది డానిలీ కొలిన్స్ అదరగొట్టింది. ఫేవరేట్, ఏడో సీడ్ ఇగా స్వైటెక్ (పొలాండ్)పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. 2020 ఫ్రెంచ్ ఓపెన్ విజేత స్వైటెక్ పోరుకు సెమీఫైనల్లోనే తెరపడింది.
బార్టీకి ఎదురేది?! : మహిళల సింగిల్స్‌లో ఆష్లె బార్టీకి ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి క్రీడాకారిణికి ఒక్క సెట్‌కు సైతం కోల్పోకుండా ఆష్లె బార్టీ అలవోకగా ఫైనల్లోకి ప్రవేశించింది. 6-1, 6-3తో మడిసన్ కీస్ (అమెరికా)పై ఆష్లె బార్టీ సులువుగా గెలుపొందింది. మడిసన్ కీస్పై ఏకంగా 20 విన్నర్లు కొట్టిన బార్టీ.. ప్రత్యర్థికి ఐదు విన్నర్లు మాత్రమే కోల్పోయింది. ఐదు ఏస్‌లు సంధించిన బార్టీ కీలకమైన నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 65-39తో మడిసన్ కీస్పై స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. గేముల పరంగా బార్టీ 12 గెలుపొందగా.. మడిసన్ నాలుగే నెగ్గింది. సొంత సర్వ్‌లో ఎనిమిది గేములు గెల్చుకున్న బార్టీ.. మడిసన్ సర్వ్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. ' నమ్మశక్యంగా లేదు. వాస్తవం అనిపించటం లేదు.ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని ప్రేమిస్తున్నాను. ఆస్ట్రేలియన్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటాన్ని గొప్పగా ఆస్వాదిస్తున్నాను. మెల్బోర్న్లో గతంలోనూ ఆడాను. కానీ ఇప్పుడు ఏకంగా టైటిల్ కోసం ఆడే అవకాశం ఉంది. ఈ రోజు పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఉక్కపోత వాతవరణంలో బంతి నెమ్మదిగా కదిలింది. మడిసన్ కీస్ బాగా ఆడింది. మనకు తెలియకుండానే మన నుంచి గేమ్‌ను లాగేసుకోగల సామర్థ్యం ఆమెది' అని ఆష్లె బార్టీ విజయానంతరం వ్యాఖ్యానించింది.
మరో సెమీఫైనల్లో అమెరికా అమ్మాయి డానిలీ కొలిన్స్ అద్భుతం చేసింది. 2020 ఫ్రెంచ్ ఓపెన్ విజేత, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఫేవరేట్లలో ఒకరు ఇగా స్వైటెక్ (పొలాండ్)కు కొలిన్స్ షాక్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరుస సెట్లలోనే స్వైటెక్‌పై విజయం సాధించింది. శనివారం టైటిల్ పోరుకు బెర్త్ సొంతం చేసుకుంది. 6-4, 6-1తో ఇగా స్వైటెక్‌పై డానిలీ కొలిన్స్ అదిరే విజయం సాధించింది. ఏడు ఏస్‌లు కొట్టిన కొలిన్స్.. నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. కొలిన్స్‌కు ఆరు సార్లు సర్వ్‌ను కోల్పోయిన స్వైటెక్ అక్కడే గేమ్ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో కాస్తంత పోటీనిచ్చిన స్వైటెక్.. రెండో సెట్లో ఆ మాత్రం పోటీ సైతం ఇవ్వటంలో విఫలమైంది. పాయింట్ల పరంగా 63-40తో పైచేయి సాధించిన కొలిన్స్ కెరీర్ తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫైనల్‌కు చేరేదెవరు? : పురుషుల సింగిల్స్‌లో నేడు సెమీఫైనల్స్ జరుగనున్నాయి. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లతో సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన రఫెల్ నాదల్.. మెల్బోర్న్లో టైటిల్ రేసులో నిలిచాడు. ఫిట్నెస్ కారణాలతో ఫెదరర్, టీకా వివాదం సహా వీసా రద్దు వివాదంతో నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇద్దరు బలమైన పోటీదారులు లేకుండా మెల్బోర్న్ రేసులో నిలిచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ నేడు ఏడో సీడ్ మాట్టో బెరాటినితో తలపడనున్నాడు. ఇటలీ ఆటగాడు బెరాటినిపై నాదల్కు మంచి రికార్డుంది. నేడు తొలి సెమీఫైనల్లో ఫేవరేట్‌గా నాదల్ బరిలోకి దిగుతున్నాడు. మరో సెమీఫైనల్లో యువ హీరోలు ఢకొీట్టనున్నారు. గ్రీసు వీరుడు, నాల్గో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌తో రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్ (రష్యా) పోటీపడనున్నాడు. సమవుజ్జీల సమరంలో డానిల్ మెద్వదేవ్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నాడు. వర్థమాన ఆటగాళ్లలో అద్వితీయ ప్రదర్శన చేస్తున్న రష్యన్ స్టార్ క్రీడాకారుడు ఫైనల్లోకి చేరుకోవాలని తహతహ లాడుతున్నాడు.