Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీగ్, నాకౌట్ దశలుగా రంజీ సమరం
- బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టీకరణ
ముంబయి : భారత వర్థమాన క్రికెటర్లకు, భారత క్రికెట్ ప్రియులకు శుభవార్త. కోవిడ్-19 కారణంగా 2020-21 రంజీ ట్రోఫీ రద్దు కాగా.. తాజాగా భారత్‌లో కోవిడ్-19 మూడో వేవ్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో రంజీ ట్రోఫీ నిర్వహణను బీసీసీఐ వాయిదా వేసింది. భారత క్రికెట్‌కు వెన్నెముక వంటి రంజీ ట్రోఫీ వాయిదా, రద్దుతో అంతిమంగా భారత క్రికెట్‌కే చేటు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ నిర్వహణ అనివార్యమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి పరిస్థితులో రంజీ ట్రోఫీని ఈ ఏడాది రెండు దశల్లో నిర్వహించనున్నట్టు షా తెలిపారు. ఫిబ్రవరి-మార్చి సమయంలో అన్ని లీగ్ దశ మ్యాచులను నిర్వహించనున్నారు. జూన్ మాసంలో నాకౌట్ మ్యాచులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాస్తవంగా రంజీ ట్రోఫీ జనవరి 13 నుంచి ఆరంభం కావాల్సి ఉంది. కానీ దేశవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త కేసులు భారీగా పెరగటంతో రంజీ ట్రోఫీని నిరవధిక వాయిదా వేశారు.
'ఈ ఏడాది రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. తొలి దశలో అన్ని లీగ్ మ్యాచులు పూర్తి చేయాలని అనుకుంటున్నాం. నాకౌట్ మ్యాచ్‌లను జూన్‌లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. కరోనా మహమ్మారితో ఆరోగ్య ముప్పుపై బీసీసీఐ బృందం క్షుణ్ణంగా పని చేస్తోంది. అదే సమయంలో అత్యుత్తమ పోటీతత్వ రెడ్ బాల్ క్రికెట్ నిర్వహణ సాఫీగా జరిగేలా చూస్తోంది. భారత క్రికెట్‌కు ప్రతిభావంతులైన క్రికెటర్లను అందిస్తున్న రంజీ ట్రోఫీ మనకు అత్యంత ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్. మెగా ఈవెంట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మహమ్మారి మూలంగా టోర్నమెంట్‌ను వాయిదా వేసినప్పుడే, పరిస్థితులు సద్దుమణిగాక, టోర్నీ నిర్వహణకు అనువైన వాతావణం ఏర్పాటుకు బోర్డు పలు ఆలోచనలు చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయో సెక్యూర్ బబుల్స్‌ను కొనసాగిస్తాం. రంజీ ట్రోఫీ నిర్వహణకు ఆరోగ్యవంతమైన, సురక్షిత వాతావరణం నెలకొల్పేందుకు బీసీసీఐ కట్టుబడి ఉంది' అని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రాసిన లేఖలో జై షా రాసుకొచ్చారు.
శాస్త్రి సూటి విమర్శ! : ఇదిలా ఉండగా, భారత జట్టు మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి బోర్డుపై ఘాటు విమర్శలు చేశాడు. కరోనా మహ్మమారి కారణంగా రంజీ ట్రోఫీ వరుసగా రెండో ఏడాది ఆరంభానికి నోచుకోలేదు. దీంతో రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. 'భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక వంటిది. రంజీ ట్రోఫీని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయటం మొదలుపెడుతామో అప్పుడే భారత క్రికెట్ వెన్నెముక లేనిది అవుతుంది' అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. 2020-21 రంజీ ట్రోఫీ రద్దు కావటంతో దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ ఇటీవల నష్ట పరిహారం చెల్లించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 50 శాతం డబ్బులను దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ అందజేసింది. ప్రధానంగా రంజీ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే భారత్-ఏ జట్టులో చోటు దక్కుతుంది. రంజీ ట్రోఫీ లేకపోవటంతో రెడ్ బాల్ క్రికెట్లో క్రమంగా నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 15ను మార్చి నెలాఖరు నుంచి నిర్వహించే యోచనలో ఉన్న బీసీసీఐ.. అందుకు ట్రయల్ రన్‌గా రంజీ ట్రోఫీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ లీగ్ దశ అనంతరం ఐపీఎల్ 15 ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ఫైనల్స్ తర్వాత రంజీ ట్రోఫీ నాకౌట్ పోటీలు నిర్వహించేలా బోర్డు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.