Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెద్వదేవ్‌తో టైటిల్ పోరుకు సై
- ముగిసిన బెరాటిని, సిట్సిపాస్ పోరు
- నేడు మహిళల సింగిల్స్ తుది సమరం
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
స్పెయిన్ బుల్ చరిత్రకు చేరువయ్యాడు. ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన క్రీడాకారుడిగా నిలిచేందుకు రఫెల్ నాదల్ అడుగు దూరంలో నిలిచాడు. కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ వేటలో స్పెయిన్ బుల్ ఆదివారం రష్యన్ స్టార్ డానిల్ మెద్వదేవ్‌తో పోటీపడనున్నాడు. గ్రీసు కెరటం సిట్సిపాస్‌ను చిత్తు చేసిన మెద్వదేవ్ మరోమారు బుల్‌తో మెగా ఫైట్‌కు సై అంటున్నాడు. మహిళల సింగిల్స్ కిరీటం కోసం లోకల్ స్టార్ ఆష్లె బార్టీ, అమెరికా భామ కొలిన్స్‌లు నేడు తాడోపేడో తేల్చుకోనున్నారు.
నవతెలంగాణ-మెల్బోర్న్
ఆస్ట్రేలియన్ ఓపెన్ రసవత్తర ముగింపునకు చేరుకుంది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వేటగాడు, స్పెయిన్ బుల్‌తో ఫైనల్ ఫైట్‌కు యువ స్టార్, రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్ రంగం సిద్ధం చేసుకున్నాడు. నాల్గో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌పై నాలుగు సెట్ల సమరంలో గెలుపొందిన డానిల్ మెద్వదేవ్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇటలీ ఆటగాడు, ఏడో సీడ్ మాట్టో బెరాటినిపై నాలుగు సెట్ల పోరులో పైచేయి సాధించిన రఫెల్ నాదల్ మెల్బోర్న్లో మెగా పోరుకు సిద్ధమయ్యాడు. 2019 యుఎస్ ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్, డానిల్ మెద్వదేవ్ ఐదు గంటల పాటు ఐదు సెట్ల పోరులో నువ్వా నేనా అన్నట్టు పోరాడారు. ఆ మెగా వార్‌లో స్పెయిన్ బుల్ పైచేయి సాధించినా.. తాజాగా యుఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన డానిల్ మెద్వదేవ్ ఆదివారం నాడు మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం రఫెల్ నాదల్, డానిల్ మెద్వదేవ్ ఢ కొట్టనున్నారు.
అలవోకగా..! : పురుషుల సింగిల్స్ ఫైనలిస్ట్‌లు సెమీఫైనల్లో అలవోక విజయాలు నమోదు చేశారు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 2 గంటల 55 నిమిషాల్లోనే రఫెల్ నాదల్ ఫైనల్ బెర్త్ సొంతం చేసుకున్నాడు. 6-3, 6-2, 3-6, 6-3తో బెరాటినిపై నాదల్ గెలుపొందాడు. 14 ఏస్‌లు కొట్టిన రఫెల్ నాదల్ ఏకంగా 28 విన్నర్లు కొట్టారు. మాట్టో బెరాటిని 38 విన్నర్లతో విజృంభించినా ఫలితం లేకపోయింది. రఫెల్ నాదల్ 19 అనవసర తప్పిదాలు చేయగా.. బెరాటి38 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పాయింట్ల పరంగా 108-96లో నాదల్ పైచేయి సాధించాడు. బెరాటిని సర్వ్‌ను నాదల్ నాలుగు సార్లు బ్రేక్ చేయటంతో అతడి మ్యాచ్‌పై పట్టు కోల్పోయాడు. గేముల పరంగానూ 21-14తో నాదల్ ఆధిపత్యం చూపించాడు. సొంత సర్వ్‌లో 17 గేములు గెలుపొందిన నాదల్.. బెరాటిని స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. మరో సెమీఫైనల్లో డానిల్ మెద్వదేవ్ సైతం అలవోకగానే గెలుపొందాడు. 2 గంటల 30 నిమిషాల సెమీఫైనల్లో డానిల్ మెద్వదేవ్ 39 విన్నర్లతో చెలరేగాడు. స్టెఫానోస్ సిట్సిపాస్ 35 విన్నర్లు సాధించినా.. బ్రేక్ పాయింట్ల విషయంలో వెనుకంజ వేశాడు. సిట్సిపాస్ సర్వ్‌ను మెద్వదేవ్ నాలుగు సార్లు బ్రేక్ చేయగా.. మెద్వదేవ్ సర్వ్‌ను సిట్సిపాస్ రెండు సార్లే బ్రేక్ చేశాడు. స్టెఫానోస్ సిట్సిపాస్ 32 అనవసర తప్పిదాలు చేయగా.. డానిల్ మెద్వదేవ్ 28 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. 13 ఏస్‌లు కొట్టిన మెద్వదేవ్ పాయింట్ల పరంగా 123-97తో పైచేయి సాధించాడు. గేముల పరంగా 23-17తో మెద్వదేవ్ పైచేయి నిరూపించుకున్నాడు.
స్టెఫానోస్ సిట్సిపాస్‌తో సెమీఫైనల్ సందర్భంగా డానిల్ మెద్వదేవ్ సహనం కోల్పోయాడు. మ్యాచ్ సమయంలో సిట్సిపాస్ తండ్రి సూచనలు చేస్తుండటంతో మెద్వదేవ్ చైర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో అలా చేయటం నిబంధనలు విరుద్ధం, దీంతో మెద్వదేవ్ సహనం కోల్పోయాడు. 'నిజాయితీగా చెప్పాలంటే, భావోద్వేగాలు ఉపయోగపడతాయని అనుకోను. దాంతో మ్యాచ్‌పై ఏకాగ్రత దెబ్బతింటుంది, కొంత ఎనర్జీ కోల్పోవాల్సి ఉంటుంది. నాకు అదే జరిగింది.అదో పెద్ద పొరపాటు. మూడో సెట్ ఆరంభంలో తిరిగి ఏకాగ్రత సాధించాను. రఫెల్ నాదల్ గొప్ప క్రీడాకారుడు. అతడితో మరో మెగా పోరు పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మరోసారి నాదల్‌తో పోటీపడతాను. అతడు కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ కోసం ఆడుతున్నాడు. చివరగా నాదల్‌తో గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరు మరచిపోలేదు. ఐదు గంటల పోరు అది. నాదల్ బలమైన ఆటగాడు. ఆదివారం అతడితో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయా లనుకుంటున్నాను' అని డానిల్ మెద్వదేవ్ అన్నాడు.
నేడు మహిళల ఫైనల్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ పోరు నేడు. 42 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి చేరిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచిన ఆష్లె బార్టీ.. టైటిల్ విజయంతో 1968 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తొలి క్రీడాకారిణిగా నయా చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఆమెతో 27వ సీడ్, అమెరికా అమ్మాయి డానిలీ కొలిన్స్ పోటీపడనుంది. మెల్బోర్న్ పార్క్‌లో తొలిసారి టైటిల్ కోసం పోటీపడుతున్న ఈ ఇద్దరు భామలు తొలి ఆస్ట్రేలియన్ టైటిల్ కోసం తహతహ లాడుతున్నారు. ఫైనల్స్‌కు చేరుకునే మార్గంలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని వరల్డ్ నం.1 ఆష్లె బార్టీ అద్భుత ఫామ్‌లో ఉంది. ఆమెను ఎదుర్కొవటం డానిలీ కొలిన్స్‌కు అంత సులువు కాదు. నేడు మధ్యాహ్నాం 2 గంటలకు మహిళల సింగిల్స్ ఫైనల్ సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.