Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్‌గా ఆష్లె బార్టీ
- మహిళల సింగిల్స్ టైటిల్ ఆసీస్ భామ సొంతం
- ఫైనల్లో పోరాడి ఓడిన డానిల్ కొలిన్స్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఆస్ట్రేలియాది ప్రత్యేక అధ్యాయం. క్రిస్ ఓ నీల్, ఎవానె గూలాగాంగ్ కావ్లీ సహా దిగ్గజ ఆటగాళ్లు కలిగిన ఘన చరిత్ర ఆస్ట్రేలియా సొంతం. అయితేనేం, 42 ఏండ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఓ ఆస్ట్రేలియన్ ప్లేయర్ పోటీపడలేదు. 44 ఏండ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఆస్ట్రేలియా క్రీడాకారులెవరూ అందుకోలేదు. ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నా.. సొంత గూటికి టైటిల్‌ను అందని వేదన కంగారూ అభిమానుల్లో ఉండిపోయింది!.
ప్రపంచ నం.1 క్రీడాకారిణిగా ఎదిగి, ప్రత్యర్థుల గౌరవాన్ని సైతం చూరగొన్న ఆష్లె బార్టీ ఆస్ట్రేలియా ప్రజలకు మంచి పార్టీ ఇచ్చింది. అమెరికా చిన్నది డానిలీ కొలిన్స్‌పై వరుస సెట్లలో విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. 44 ఏండ్ల ఆస్ట్రేలియా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆస్ట్రేలియా టెన్నిస్‌లో నవ చరిత్రకు నాంది పలికింది.
నవతెలంగాణ-మెల్బోర్న్
ఆస్ట్రేలియా 44 ఏండ్ల సుదీర్ఘ కల సాకారమైంది. మెల్బోర్న్ పార్క్‌లో లోకల్ చాంపియన్‌ను చూసుకోవాలనే స్వప్నం శనివారంతో సాక్షాత్కారించింది. మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1, లోకల్ స్టార్ ఆష్లె బార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించి నవ చరిత్రకు శ్రీకారం చుట్టింది. 27వ సీడ్, అమెరికా అమ్మాయి డానిలీ కొలిన్స్‌పై 6-3, 7-6(7-2)పై ఆష్లె బార్టీ వరుస సెట్లలో గెలుపొంది మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆష్లె బార్టీ అంచనాలను అందుకోవటంలో విజయవంతమైంది. గంటన్నరలోనే పని పూర్తి చేసి ఆస్ట్రేలియా ప్రజలను సంబరాల్లో ముంచెత్తింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్న ఆష్లె బార్టీ.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో విలక్షణ రికార్డును సైతం ఖాతాలో వేసుకుంది. కెరీర్లో నెగ్గిన తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌లను భిన్నమైన కోర్టుల్లో సాధించింది బార్టీ. మట్టికోర్టు, గడ్డికోర్టు, హార్డ్కోర్టులపై గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించి దిగ్గజాల సరసన చోటు దక్కించుకుంది.
ఆష్లె అద్భుతం : గంట 27 నిమిషాల పాటు సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌ను ఆష్లె బార్టీ అలవోకగా ఏమీ దక్కించుకోలేదు. ఒక్క సెట్‌ను సైతం కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకున్న బార్టీ.. ప్రత్యర్థికి ఒక్క సెట్‌ను కూడా ఇవ్వకుండానే టైటిల్ సొంతం చేసుకుంది. తొలి సెట్‌ను 6-3తో గెల్చుకున్న బార్టీకి అసలు సవాల్ రెండో సెట్లో ఎదురైంది. రెండో సెట్‌ను సర్వ్‌తో మొదలెట్టిన డానిలీ కొలిన్స్ సొంత సర్వ్ గేమ్‌ను నిలుపుకుంది. బార్టీ సర్వ్‌ను ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో గెల్చుకున్న కొలిన్స్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొలిన్స్ సర్వ్ గేమ్‌లో బార్టీ గట్టి పోటీనిచ్చింది. పలుమార్లు అడ్వాన్స్, డ్యూస్‌తో ఉత్కంఠ రేపిన ఈ గేమ్‌ను కొలిన్స్ నిలుపుకోవటంతో ఆమె ఆధిక్యం 3-0తో మరింత పెరిగింది. సర్వ్ నిలుపుకున్న బార్టీ తొలి గేమ్‌ను సాధించి 1-3తో స్కోరు రేసులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత స్వీయ సర్వ్‌లో గేము గెల్చుకోవటంతో పాటు బార్టీ సర్వ్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ 5-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ దశలో ఆష్లె బార్టీ రెండో సెట్ కోల్పోయిందనే భావన అందరిలోనూ కలిగింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లోనే బార్టీ దూకుడు చూస్తామని అనుకున్నవాళ్లకు వరల్డ్ నం.1 షాకిచ్చింది. 1-5తో సెట్‌పై ఏమాత్రం ఆశల్లేని తరుణంలో బార్టీ గొప్పగా పుంజుకుంది. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేయటంపైనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరంభం నుంచి చెబుతున్న బార్టీ.. తొలిసారి ఫైనల్లో తనే ఇరకాటంలో పడిపోయింది. డానిలీ కొలిన్స్ దూకుడుకు బదులివ్వటమే బార్టీ పనిగా మారింది. మెల్బోర్న్ పార్క్‌లో తొలిసారి ఎదురైన కఠిన సవాల్‌కు బార్టీ ఎదురుగా నిలిచింది. వరుసగా నాలుగు గేములు గెల్చుకుని స్కోరు 5-5తో సమం చేసింది. 6-5తో ముందంజ వేయటంతో పాటు టైబ్రేకర్‌లో 7-2తో పైచేయి సాధించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా సరికొత్త ప్రకంపనలు సృష్టించింది. ఫైనల్లో పది ఏస్‌లు కొట్టిన బార్టీ ఏకంగా 30 విన్నర్లతో విరుచుకుపడింది. బార్టీ, కొలిన్స్ సమానంగా 22 అనవసర తప్పిదాలు చేశారు. పాయింట్ల పరంగా 71-60తో బార్టీ పైచేయి నిలుపుకుంది.
చివరగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ క్రిస్ ఓ నీల్ ట్రోఫీని మైదానంలోకి తీసుకురాగా.. 1974-77లో వరుసగా నాలుగు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం ఎవానె గూలాగాంగ్ కావ్లీ మహిళల సింగిల్స్ ట్రోఫీని ఆష్లె బార్టీకి అందించింది. ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో పోటీపడిన ఆష్లె బార్టీ మూడింటా అద్వితీయ విజయాలు నమోదు చేయటం విశేషం.
డబుల్ పార్టీ : ఆస్ట్రేలియాకు శనివారం డబుల్ పార్టీ. ఆష్లె బార్టీ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలువుగా.. పురుషుల డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిక్ కిర్గియోస్, కొక్కినాకిస్లు అద్భుతం చేశారు. ఆస్ట్రేలియాకే చెందిన ఎబ్డెన్, పుర్చెల్ జోడీపై 7-5, 6-4తో ఫైనల్లో వరుస సెట్లలో విజయం సాధించారు. పురుషుల డబుల్స్ విభాగంలో చాంపియన్స్ ట్రోఫీతో పాటు రన్నరప్ ట్రోఫీని సైతం ఆస్ట్రేలియా వశమైంది.
నాదల్ చరిత్ర సృష్టిస్తాడా? : పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్రపై కన్నేశాడు. స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌లతో కలిసి రఫెల్ నాదల్ 20 గ్రాండ్‌స్లామ్ విజయాలతో సమవుజ్జీగా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్, నొవాక్ లేకపోవటంతో స్పెయిన్ బుల్ టైటిల్‌పై కన్నేశాడు. రష్యా ఆటగాడు, రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్‌తో నాదల్ నేడు టైటిల్ పోరులో తలపడనున్నాడు. మెరుపు వేగం, చురుకైన ఫోర్‌హ్యాండ్, బలమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో మెద్వదేవ్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. నాదల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నా.. అతడు మైదానంలో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నాదల్, మెద్వదేవ్ చివరగా యుఎస్ ఓపెన్ (2019) ఫైనల్లో పోటీపడ్డారు. ఐదు సెట్లలో ఐదు గంటల పాటు సాగిన ఆ పోరులో స్పెయిన్ బుల్ పైచేయి సాధించాడు. యుఎస్ ఓపెన్ లెక్క ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరి చేయాలని చూస్తున్న డానిల్ మెద్వదేవ్ నేడు అత్యుత్తమ ఆటతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. నేడు మధ్యాహ్నాం 2 గంటలకు రఫెల్ నాదల్, డానిల్ మెద్వదేవ్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ పోరు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం అవనుంది.
' ఎంతో మంది అభిమానుల ప్రేమ, మద్దతు పొందిన నేను చాలా లక్కీ అమ్మాయినని ఎన్నోసార్లు చెప్పాను. నా వైపు ఇంత ప్రేమాభిమానాలు ఉండటం ఎంతో అదృష్టం. మన ప్రయాణం ఇక్కడే మొదలైంది, మనమంతా కలిసి ఇక్కడే సాధించాం. మన జట్టులో ఎవరూ మారలేదు. నా తుది శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తాను. ఓ ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా ఈ టోర్నమెంట్ విజయాన్ని ఎంతో మంది అభిమానులతో కలిసి పంచుకోవటం అత్యంత ప్రధానం. ఈ స్థాయిలో అభిమానుల నడుమ ఆడటం ఎంతో గొప్పగా అనిపించింది. నాలోని అత్యుత్తమ ఆటను అభిమానులే బయటకు తీశారు. ఈ విజయం సాధించేందుకు మద్దతుగా నిలిచిన అభిమానులు అందరికీ ధన్యవాదాలు. నా స్వప్నం సాకారమైంది. ఆస్ట్రేలియన్‌గా ఎంతో గర్వపడుతున్నాను'
- ఆష్లె బార్టీ