Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు గ్రాండ్‌స్లామ్ నాదల్ సొంతం
- ఫైనల్లో మెద్వదేవ్‌పై సూపర్ విజయం
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో రెండో సీడ్ రష్యన్ స్టార్ డానిల్ మెద్వదేవ్ టైటిల్ పోరు. తొలి రెండు సెట్లు ముగిశాయి. రష్యా కుర్రాడు రెండు సెట్లలోనూ విజయం సాధించాడు. ఇంకో సెట్ నెగ్గితే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ అతడి సొంతం అవుతుంది. స్పెయిన్ బుల్‌పై విపరీత ఒత్తిడి. రికార్డు గ్రాండ్‌స్లామ్ నెగ్గాలంటే వరుసగా చివరి మూడు సెట్లు గెలవాలి.
ఐదు గంటల 24 నిమిషాలు, ఐదు సెట్ల మహా సమరంలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. అద్వితీయ పునరాగమనంతో వరుసగా చివరి మూడు సెట్లను సొంతం చేసుకున్నాడు. కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన మెన్స్ ఆల్‌టైమ్ జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. 2009లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన నాదల్ 13 ఏండ్ల విరామం అనంతరం మెల్బోర్న్ పార్క్‌లో మరోసారి చాంపియన్‌గా నిలిచాడు.
నవతెలంగాణ-మెల్బోర్న్
2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో రోజర్ ఫెదరర్‌పై ఐదు సెట్ల పోరులో గెలుపొంది తొలిసారి మెల్బోర్న్ పార్క్‌లో, హార్డ్‌కోర్ట్‌లో గ్రాండ్‌స్లామ్ విజయం సాధించిన రఫెల్ నాదల్... 13 ఏండ్ల తర్వాత ఇక్కడ సాధించిన మరో విజయంతో చరిత్రే సృష్టించాడు. రష్యా యువ ఆటగాడు, రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్‌పై ఐదు సెట్ల మహా సమరంలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గెలుపుతో గర్జించాడు. 6-2, 6-7(5-7), 6-4, 7-5తో రఫెల్ నాదల్ అద్వితీయ విజయం నమోదు చేశాడు. మెన్స్ ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ విజయాల జాబితాలో టాప్ లేపాడు. రోజర్ ఫెదరర్ (20), నొవాక్ జకోవిచ్ (20)లను వెనక్కి నెట్టిన స్పెయిన్ బుల్ 21వ గ్రాండ్‌స్లామ్ విజయంతో శిఖర స్థానంలో కూర్చుకున్నాడు. 5 గంటల 24 నిమిషాల టైటిల్ పోరులో 25 ఏండ్ల మెద్వదేవ్‌పై 35 ఏండ్ల రఫెల్ నాదల్ చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్)లను కనీసం రెండుసార్లు సాధించిన నాల్గో క్రీడాకారుడిగా నాదల్ రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు విజేతగా నిలిచిన నాదల్.. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్లను రెండేసి పర్యాయాలు గెల్చుకోగా, యుఎస్ ఓపెన్ చాంపియన్‌గా నాలుగుసార్లు అవతరించాడు.
తడబడుతూ ఆరంభం! : పురుషుల సింగిల్స్ ఫైనల్. వీసా రద్దు వివాదంతో నొవాక్ జకోవిచ్, మోకాలి శస్త్రచికిత్సతో రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమవగా.. రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్ మెల్బోర్న్లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగాడు. 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్‌కు టైటిల్ కోల్పోయిన మెద్వదేవ్.. అదే ఏడాది యుఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి అతడికి క్యాలెండర్స్లామ్ నిరాకరించాడు. ఓపెన్ శకంలో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ విజయాలతో టైటిళ్ల వేట మొదలెట్టిన ఆటగాడిగా నిలిచిన చరిత్ర సృష్టించాలనుకున్న మెద్వదేవ్ అందుకు తగ్గట్టుగానే అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి సెట్‌ను 6-2తో అలవోకగా గెల్చుకున్నాడు. 16 అనవసర తప్పిదాలు చేసిన నాదల్.. మెద్వదేవ్ 31 విన్నర్లకు తలొంచాడు. రెండో సెట్లో నాదల్ దూకుడు మొదలైనా.. మెద్వదేవ్ ఈ సెట్‌నూ నిలుపుకున్నాడు. రెండు సార్లు నాదల్ సర్వ్‌ను బ్రేక్ చేసిన మెద్వదేవ్.. 5-3 నుంచి 5-5తో స్కోరు సమం చేశాడు. 5-3 వద్ద ఉండగా సెట్ పాయింట్ వద్ద అనవసర తప్పిదం చేసిన నాదల్ అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. వరుస గేములు గెల్చుకున్న మెద్వదేవ్ టైబ్రేకర్‌లో పైచేయి సాధించి విలువైన ఆధిక్యం సొంతం చేసుకున్నాడు.
ఉప్పెనలా దూసుకొచ్చి..! : రికార్డు గ్రాండ్‌స్లామ్ ఆశలు నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన తరుణంలో రఫెల్ నాదల్ అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించాడు. కెరీర్ ఆరంభంలో వింబుల్డన్‌లో ఓసారి తొలి రెండు సెట్లు కోల్పోయినా పుంజుకున్న నాదల్ మళ్లీ ఇక్కడే ఆ ప్రదర్శన పునరావృతం చేశాడు. అనుభవంతో మెద్వదేవ్‌పై పైచేయి సాధించిన నాదల్ తెలివిగా పాయింట్లు నెగ్గాడు. డ్రాప్ షాట్లు, విన్నర్లు, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో మెద్వదేవ్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మూడో సెట్లో మెద్వదేవ్ సర్వ్‌ను బ్రేక్ చేసిన నాదల్ 6-4తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో రెండుసార్లు మెద్వదేవ్ సర్వ్‌ను బ్రేక్ చేసి 6-4తో మ్యాచ్‌లో సమవుజ్జీగా నిలిచాడు. టైటిల్ పోరును నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. గ్రాండ్‌స్లామ్ విక్టరీ రేసులో నాదల్ 5-3తో ముందంజ వేశాడు. నాదల్ సర్వ్ బ్రేక్ చేసి 5-5తో స్కోరు సమం చేసిన మెద్వదేవ్ ఉత్కంఠ రెట్టింపు చేశాడు. ఈ సమయంలో రెండో సెట్లో చేసిన పొరపాట్లను నాదల్ పునరావృతం కానీయలేదు. వరుసగా రెండు గేముల్లో గెలుపొంది సింహగర్జన చేశాడు. కెరీర్ రికార్డు 21వ గ్రాండ్‌స్లామ్ విక్టరీ ఖాతాలో వేసుకున్నాడు. 2019 యుఎస్ ఓపెన్‌లో సైతంతో మెద్వదేవ్‌తో ఐదు సెట్ల పోరులో ఐదు గంటల పాటు శ్రమించి టైటిల్ సాధించిన నాదల్.. మెల్బోర్న్లో అంతకుమించి పోరాడాల్సి వచ్చింది. 23 ఏస్‌లతో మెద్వదేవ్ చెలరేగగా.. నాదల్ 3 ఏస్‌లే కొట్టాడు. నాదల్ ఏడు బ్రేక్ పాయింట్లు సాధించగా, మెద్వదేవ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. నాదల్ 69 విన్నర్లు కొట్టగా, మెద్వదేవ్ 76 విన్నర్లతో మెరిశాడు. మెద్వదేవ్ 52 అనవసర తప్పిదాలు చేయగా, నాదల్ ఏకంగా 68 అనవసర తప్పిదాలు చేశాడు. పాయింట్ల పరంగా మెద్వదేవ్ 189-182తో నాదల్‌పై పైచేయి సాధించాడు. గేముల్లోనూ నాదల్ 27 నెగ్గగా.. మెద్వదేవ్ 26 సాధించాడు. టైటిల్ పోరులో స్పెయిన్ బుల్‌కు చివరి పాయింట్ వరకు గట్టి పోటీ ఇచ్చిన డానిల్ మెద్వదేవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
నా వరకు ఈ విజయం అమోఘం. నిజాయితీగా చెబుతున్నా.. ఓ నెలన్నర క్రితం అసలు నేను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడతాననే విషయం సైతం తెలియదు. నా టెన్నిస్ కెరీర్లో నిస్సందేహాంగా అత్యంత భావోద్వేగభరిత మ్యాచ్‌లలో ఇదొకటి. గత మూడు వారాలుగా ఇక్కడ భారీ మద్దతు పొందాను. ఈ మూడు వారాల్లో మీరు ఇచ్చిన మద్దతు జీవిత కాలం నా హృదయంలో ఉండిపోతుంది'
- రఫెల్ నాదల్