Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నాడు
- ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్
విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ త్యజించటం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదు రోజుల ఆటకు సరికొత్త వన్నె తీసుకొచ్చిన నాయకుడు, సూపర్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా వైదొలగటం వెనుక మిస్టరీ ఇప్పటికీ బహిర్గతం కాలేదు. రెడ్ బాల్ ఫార్మాట్లో నాయకుడిగా కొనసాగాలని బలంగా కోరుకున్న విరాట్ కోహ్లి.. అనూహ్యంగా తప్పుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. 2021 ఐపీఎల్ సందర్భంగా విరాట్ కోహ్లితో సంభాషణను ఓ ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ వెల్లడించాడు. ఆ వివరాలు రికీ పాంటింగ్ మాటల్లోనే..
న్యూఢిల్లీ :
ఆశ్చర్యానికి గురి చేసింది :
' టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు ప్రధాన కారణంగా గత ఐపీఎల్ సీజన్ ప్రథమార్థంలో కోహ్లితో నేను బాగా మాట్లాడాను. వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ వదులుకోవటంపై అతడు మాట్లాడాడు. టెస్టు ఫార్మాట్లో జట్టును నడిపించేందుకు అతడు ఎంతో మక్కువ చూపించాడు. టెస్టు కెప్టెన్ హోదాను విరాట్ కోహ్లి బాగా ఆస్వాదించడాన్ని మనం చూశాం. అతడి నాయకత్వంలో భారత జట్టు సైతం అద్భుత ఫలితాలు సాధించింది. కోహ్లి కెప్టెన్సీ వదులుకున్న వార్త వినగానే నిజంగా ఆశ్చర్యపోయాను' అని పాంటింగ్ అన్నాడు.
గొప్ప ఘనతే సాధించాడు :
' విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా అనితరసాధ్య విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియా సాధించిన విజయాల కంటే భారత్ ఎక్కువ సాధించిందని చెప్పవచ్చు. నేను ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు జట్టు అప్పటికే ప్రపంచ క్రికెట్లో అగ్రజట్టు. విరాట్ కోహ్లి కెప్టెన్సీకి ముందు భారత జట్టు ఎక్కువగా సొంతగడ్డపై విజయాలు సాధించింది. విదేశీ గడ్డపై పెద్దగా విజయవంతం కాలేదు. విరాట్ కోహ్లి నాయకుడిగా భారత్ విదేశాల్లో మరిన్ని విజయాలు నమోదు చేసింది. ఆ ఘనత పట్ల భారత క్రికెట్ గర్వపడాలి. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాక, బీసీసీఐ సైతం టెస్టు క్రికెట్‌పై ఫోకస్ చేసింది. కెప్టెన్‌గా సాధించిన ఘనతల పట్ల కోహ్లి గర్వపడాలి. టెస్టుల్లో పోటీతత్వ భారత జట్టు నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు విరాట్. ఆరంభంలో ఆ జట్టును అతడు అగ్రజట్టుగా తీర్చిదిద్దుతాడని ఎవరూ ఊహించలేదు. గత 4-5 ఏండ్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం టీమ్ ఇండియాది. ఈ మార్పు ఎవరూ అంచనా వేయలేదు. విరాట్ నాయకుడు కాగానే ఈ గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. అతడి నాయకత్వంలో భారత్ ఎక్కువ కాలం వరల్డ్ నం.1గానే కొనసాగింది. 68 టెస్టుల్లో 40 విజయాలు అందించిన విరాట్ కోహ్లి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడని' పాంటింగ్ గుర్తు చేశాడు.
కెప్టెన్‌గా ఒక్కరే ముద్దు! :
'సహజంగా ప్రపంచ క్రికెట్లో ప్రతి డ్రెస్సింగ్‌రూమ్‌లో భిన్న ఫార్మాట్లలోనూ ఒకే స్వరం, ఒకే నాయకత్వం ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుత ఆధునిక క్రికెట్లో ప్రపంచకప్‌లు, ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లతో ఓ ఆటగాడు అన్ని మ్యాచుల్లో, అన్ని ఫార్మాట్లలో ప్రతి ఏడాది ఆడగలడా అనే సవాల్ ఇప్పుడు ముందుకొస్తుంది. ఈ సవాల్‌ను ఎదుర్కొవటంపై కోచ్ స్థానంలో ఉండే వ్యక్తులు మరింత మధనపడుతున్నారు. ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్ల ఉత్తమ జట్టులో చోటు సాధించగల క్రికెటర్లు అతికొద్ది మాత్రమే ఉన్నారు. అందులో భారత వైట్‌బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరు. కెఎల్ రాహుల్ సైతం ఈ విభాగంలోకే వస్తాడు. నా వరకు, జట్టుకు ఒక్క కెప్టెన్ ఉండటమే మేలు. ద్వంద్వ కెప్టెన్సీ అంతగా మేలు చేయదు' అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ మంచి నాయకుడు :
'2013 ఐపీఎల్ సీజన్ మధ్యలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి నేను తప్పుకున్నాను. ఆ సమయంలో నాయకత్వ పగ్గాలు అందుకోగల సమర్థ ఆటగాడిపై యాజమాన్యం, కోచ్‌లు మేథోమథనం చేసింది. ముంబయి ఇండియన్స్‌ను నడిపించగల ఆటగాడిగా నాకు ఒక్కరే కనిపించాడు.. అతడే రోహిత్ శర్మ. అప్పటికి రోహిత్ యువకుడే అయినా.. అతడిలోని నాయకత్వ లక్షణాలు ఉట్టిపడేవి. ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన, తిరుగులేని కెప్టెన్‌గా ఎదిగాడు. భారత్‌కు సైతం పలు సిరీల్లో అద్వితీయ విజయాలు అందించాడు. గత 2-3 ఏండ్లలో టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ సాధించిన ఘనతల పట్ల వాదన అక్కర్లేదు. ఆ సమయంలో ప్రపంచంలో అత్యుత్తమంగా రాణించిన వారితో సమానంగా రోహిత్ ఆడాడు. వైట్‌బాల్ క్రికెట్లో అతడి ఎంతటి ఆటగాడో మన అందరికీ తెలుసని' పాంటింగ్ పేర్కొన్నాడు.
ఆ బాధ్యత కోహ్లిదే :
'కెప్టెన్‌గా తప్పుకోవాలని కోహ్లి నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో జట్టులో ఆటగాడిగా కొనసాగాలనే నిర్ణయం అతడే తీసుకున్నాడు. ఈ సమయంలో నూతన కెప్టెన్‌తో తన ఆలోచలను పంచుకోవాల్సిన బాధ్యత విరాట్ కోహ్లిదే. నేను ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి నిష్క్రమించినప్పుడు కొత్త కెప్టెన్‌తో స్పష్టంగా మాట్లాడాను. ' జట్టులో నేను ఓ సభ్యుడిని. ఇది ఎంతమాత్రం ఇక నా జట్టు కాదు. ఈ జట్టుపై నా ముద్ర లేదు' అని చెప్పాను. కొత్త కెప్టెన్‌కు ప్రతిదీ అందించాలి. జట్టులో తను పోషించాలనుకున్న పాత్రపై నూతన సారథికి స్పష్టత ఇవ్వాలి. కొత్త కెప్టెన్‌తో సావధానంగా కూర్చోని ఈ సంభాషణ జరపాల్సిన బాధ్యత విరాట్ కోహ్లి మీద ఉందని' పాంటింగ్ అన్నాడు.
బ్యాటర్‌గా మెరుస్తాడు :
'అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్లు, కోచ్‌లకు వృద్ది చెందే లక్షణం ఉంటుందని నా నమ్మకం. సుమారు ఏడేండ్లుగా విరాట్ కోహ్లి టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగాడు. ప్రపంచంలో ఏ జట్టుకైనా సారథ్యం వహించటం అత్యంత సవాల్‌తో కూడుకున్న జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతగానో ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరు భారత క్రికెట్ విజయాలను సంబరాలు చేసుకుంటారు. ఆ అంచనాలను నిలుపుకోవటం అంత సులువు కాదు. విరాట్ కోహ్లికి ఇప్పుడు 33 ఏండ్లు. మరికొంత కాలం క్రికెట్ ఆడతాడు. బ్యాటర్‌గా అతడు కొన్ని రికార్డులను బద్దలు కొడతాడని నమ్మకంగా చెప్పగలను. నాయకత్వ బాధ్యత, భారం లేకుండా బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డులను మరింత సులువుగా బద్దలు కొడతాడేమో' అని రికీ పాంటింగ్ తెలిపాడు.