Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత, భారత సూపర్‌స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. 2022 లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నీరజ్ చోప్రా నామినేట్ అయ్యాడు. టోక్యో ఒలింపిక్స్ మెన్స్ జావెలిన్ త్రో విభాగంలో 23 ఏండ్ల నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో అరంగ్రేటం చేస్తూనే బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో వందేండ్ల భారత అథ్లెటిక్స్ పసిడి కల సాకారం చేశాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పసిడి పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా భారత్‌కు తొలి వ్యక్తిగత పసిడి అందించాడు. టోక్యోలో రెండో ప్రయత్నంలో 87.58 మీటర్ల దూరం ఈటను విసిరిన చోప్రా.. భారత అథ్లెటిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. వినోశ్ ఫోగట్ (2019) తర్వాత లారెస్ అవార్డులకు నామినేట్ అయిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. 2000-2020 లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డు విభాగంలో సచిన్ టెండూల్కర్ లారెస్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. నీరజ్ చోప్రాతో పాటు డానిల్ మెద్వదేవ్ (రష్యా), ఎమ్మా రెడుకాను (బ్రిటన్), పెడ్రి (స్పెయిన్), యులిమర్ రోజాస్ (వెనుజులా), టిట్మస్ (ఆస్ట్రేలియా) ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. ఏడు విభాగాల్లో అవార్డులకు 1300 మందితో కూడిన పాత్రికేయులు, ప్రసారదారుల ప్యానెల్ అథ్లెట్లను నామినేట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటిస్తారు. ' లారెస్ అవార్డుకు నామినేట్ కావటం పట్ల సంతోషంగా ఉన్నాను. టోక్యో ఘనతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించటం గొప్ప గౌరవం. భారత్‌కు ప్రాతినిథ్యం వహించటం, అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించటం గౌరవంగా భావిస్తాను. గొప్ప అథ్లెట్లతో పాటు నన్ను అవార్డుకు పరిగణనలోకి తీసుకోవటం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది' అని నీరజ్ చోప్రా అన్నాడు.