Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు?
- సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెట్లో మరో వివాదం ముసురుకుంటోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివాదాస్పదంగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా మరో వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు గంగూలీ బలవంతంగా హాజరయ్యారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సెలక్షన్ కమిటీ సమావేశాలకు బీసీసీఐ అధ్యక్షుడు హాజరు కావటంపై అటు బీసీసీఐ వర్గాలు, ఇటు గంగూలీలను సంప్రదించే ప్రయత్నం చేయగా ఇరు వైపుల నుంచీ సమాధానం లభించలేదు. ఈ అంశంలో బీసీసీఐలో సైతం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
సెలక్షన్ కమిటీ భేటీలకు వెళ్లాడా?! : ' సౌరవ్ గంగూలీ చాలా అంశాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో బీసీసీఐ ఇలాగా నడుస్తోంది. సెలక్షన్ కమిటీ సమావేశంలో గంగూలీకి ఎటువంటి పని లేదు. అయినా, అతడు సమావేశాలకు హాజరు కావటం దురదృష్టకరం' అని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ' సౌరవ్ గంగూలీ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు అయ్యారనేది పూర్తి అవాస్తవం. గంగూలీపై వస్తున్న తప్పుడు ఆరోపణలు' అని మరో బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయంలో బోర్డు నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుత, లేదా మాజీ సెలక్షన్ కమిటీ సభ్యులు లేదా సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కోచ్ రవిశాస్త్రిలు మాత్రమే ఈ అంశంపై సరైన సమాధానం ఇవ్వగలరు.
రూల్స్ అంగీకరిస్తాయా? : బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సెలక్షన్ కమిటీ సమావేశాలకు అధ్యక్షుడు హాజరు కాకూడదు. కానీ సెలక్షన్ కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలు అధ్యక్షుడు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పున సమీక్ష చేయాలని అధ్యక్షుడు కోరేందుకు అవకాశం ఉంది. కెప్టెన్సీ మార్పు వంటి అంశాల్లో అధ్యక్షుడు సెలక్షన్ కమిటీ నిర్ణయాలను అధ్యక్షుడు వీటో చేసే అధికారం ఉంటుంది. హోదా రీత్యా బీసీసీఐ కార్యదర్శి ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతారు. కార్యదర్శికి సైతం సమావేశంలో ఓటు హక్కు ఉండదు. హోదా రీత్యా సమావేశం నిర్వహిస్తారు, చర్చలో కార్యదర్శి భాగం కారు. జట్టు ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీదే పూర్తి బాధ్యత అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో సెలక్షన్ కమిటీ సమావేశాలకు ముందు గంగూలీతో కలిసి ఉన్న ఫోటోలను బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్లో ఉంచింది. తాజా ఆరోపణలకు ఆ ఫోటోలు మరింత బలం చేకూర్చుతున్నాయి. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన గంగూలీ.. ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో ఎంపిక విషయంలో జోక్యం చేసుకోవటం సిగ్గుచేటని నెటిజన్లు దాదాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదానికి గంగూలీ ఏ విధంగా ముగింపు పలుకుతాడో చూడాలి.