Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ 1000వ వన్డేకు రంగం సిద్ధం
- ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో చారిత్రక పోరు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఎంతో దూరంలో లేదు. ఆతిథ్య జట్టుగా 2021 టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా భంగపడిన భారత్.. కంగారూ గడ్డపై కప్పు కొట్టాలనే పట్టుదలతో సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఇతర జట్లతో పాటు భారత్ సైతం ప్రధానంగా పొట్టి సమరాలపైనే దృష్టి నిలిపింది. వన్డే మ్యాచులకు తాజా సీజన్లో ప్రాధాన్యత లేకుండాపోయింది. అయినా, వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ 1000వ వన్డే మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ క్రికెట్లో వెయ్యి వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్. సొంతగడ్డపై అహ్మదాబాద్ వేదికగా భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా నిరాశపరిచింది. కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లి బ్యాటర్‌గా మెరవటంలో విఫలమయ్యాడు. బౌలింగ్ విభాగంలోనూ చెప్పుకోదగిన ప్రదర్శనలు లేవు. వైట్‌వాష్ ఓటమితో స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా.. మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. వైట్‌బాల్ వీరోచిత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడనుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. జట్టు ప్రదర్శన, కెప్టెన్సీ, గెలుపోటములు ఇవేవీ వన్డే సిరీస్‌కు ముందు చర్చనీయాంశం కాదు. ప్రపంచ క్రికెట్లో వెయ్యి వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ నిలువబోతుంది. ఈ చారిత్రక మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం వేదిక కానుంది. దీంతో ఇప్పుడు చర్చంతా భారత్ సహస్ర వన్డే సమరంపైనే నెలకొంది.
చారిత్రక సమరం : వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ చారిత్రక 1000వ వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలువనుంది. 999 వన్డేలు ఆడిన భారత్ 54.44 గెలుపు శాతంతో అద్వితీయ ప్రదర్శన చేసింది. 518 విజయాలు సాధించిన భారత్, 431 మ్యాచుల్లో పరాజయం పొందింది. 9 మ్యాచులు టైగా ముగియగా 41 మ్యాచులు ఫలితం తేలకుండానే ముగిశాయి. వన్డేల్లో 500కు పైగా మ్యాచులు ఆడిన జట్టు తొమ్మిది. అందులో భారత్ కంటే మెరుగైన విజయ శాతం నమోదు చేసిన జట్లు రెండు. ఆస్ట్రేలియా 63.66, దక్షిణాఫ్రికా 63.75తో ముందున్నాయి. 958 వన్డేల్లో 581 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా.. 334 మ్యాచుల్లో ఓటమి చెందింది. తొమ్మిది మ్యాచులు టై కాగా, 34 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. దక్షిణాఫ్రికా 638 వన్డేలు ఆడగా అందులో 391 విజయాలు, 221 అపజయాలు, ఆరు టైలు, 20 ఫలితం తేలని మ్యాచులు ఉన్నాయి. పాకిస్థాన్ (936), శ్రీలంక (870), ఇంగ్లాండ్ (761), న్యూజిలాండ్ (775), వెస్టిండీస్ (834), జింబాబ్వే (541)లు సైతం 500కి పైగా వన్డేలు ఆడిన జాబితాలో నిలిచాయి.
మెగా వేదిక : ఇటీవల స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో టెస్టు పోరుతో టెస్టుల్లో 500వ టెస్టు పోరు ఆడేసిన టీమ్ ఇండియా.. తాజాగా వన్డేల్లో 1000 మ్యాచుల మార్క్‌కు రంగం సిద్ధం చేసుకుంది. భారత్ సహస్ర సమరానికి అహ్మదాబాద్‌లోని మహా స్టేడియం వేదిక కానుంది. లక్షకు పైగా సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో ఫిబ్రవరి 6న సహస్ర సమరం జరుగనుంది. తొలి వన్డే సహా వన్డే సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించటంపై గుజరాత్ క్రికెట్ సంఘం ఎటువంటి ప్రకటన చేయలేదు. కోవిడ్-19 పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సీటింగ్ సామర్థ్యంతో మ్యాచ్ నిర్వహణకు అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారత్ 1000వ వన్డే సమరానికి రికార్డు స్థాయిలో లక్ష మంది అభిమానులు హాజరు కానున్నారు. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 16-20న టీ20 సిరీస్‌కు కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్ వేదిక కానుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో 75 శాతం సీటింగ్ సామర్థ్యంతో మ్యాచ్ నిర్వహణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వన్డేల్లో భారత్
మ్యాచులు : 999
గెలుపు : 518
ఓటమి : 431
టై : 009
నో రిజల్ట్ : 041
గెలుపు శాతం : 54.54