Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కెప్టెన్లపై బీసీసీఐ బాస్ గంగూలీ
- మేలో మహిళల ఐపీఎల్ చాలెంజర్ ట్రోఫీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పలు విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదుర్కొన్న సవాళ్లతో పోల్చితే బీసీసీఐ అధ్యక్ష పదవి అంత సవాల్‌తో కూడుకున్నది కాదని అన్నాడు!. కోవిడ్-19తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై గట్టి దెబ్బ పడిందని, ఈ సమయంలో బోర్డు అధ్యక్షుడిగా కఠిన పరిస్థితులు చవిచూసినట్టు తెలిపాడు. రెండేండ్ల విరామం అనంతరం ఫిబ్రవరి 10 నుంచి రంజీ ట్రోఫీ ఆరంభం కానున్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇవిగో...
నవతెలంగాణ-న్యూఢిల్లీ
- రెండేండ్ల విరామం అనంతరం రంజీ ట్రోఫీ ఆరంభం అవుతోంది. వాయిదా అనంతరం రంజీ ట్రోఫీ సీజన్‌కు షెడ్యూల్ చేయటం ఎంత కష్టంగా అనిపించింది?
కోవిడ్-19తో 2020-21 రంజీ ట్రోఫీ సీజన్‌ను కోల్పోయాం. భారత్‌లో అత్యంత ముఖ్యమైన టోర్నీ రంజీ ట్రోఫీ. బీసీసీఐ ఎప్పుడూ దాన్ని నిర్వహించాలని అనుకుంటుంది. కానీ గత రెండేండ్లలో ప్రపంచంలో ఏం జరిగిందో..నాకు తెలిసి ఎవరి జీవిత కాలంలో సైతం సంభవించి ఉండకపోవచ్చు. అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, ఏ టోర్నమెంట్‌ను నిర్వహించటమైనా సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. కూచ్ బెహార్ ట్రోఫీని నిర్వహిస్తే మూడో వేవ్ వచ్చేసింది. టోర్నీ తొలి రోజు సుమారు 50 మంది క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. ఏదీ అంత సులువు కాదు. అయినా, మనం టోర్నమెంట్లు నిర్వహించగలుగుతున్నాం. పరిస్థితులు అనుకూలించి, టోర్నీ సజావువుగా సాగుతుందని ఆశిస్తున్నాం.
- రానున్న కొన్ని వారాల్లో భారత్ వరుస టోర్నీలు ఆడాల్సి ఉంది. బ్యాకప్ బయో బబుల్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటివి సహజం. ఆటగాళ్లు విభిన్న ప్రాంతాల నుంచి వస్తారు. అలాంటి సమయంలో కొన్ని కేసులు వెలుగు చూడటం సహజం. కోవిడ్-19 మూడో వేవ్ ముగిస్తే పరిస్థితులు చక్కబడుతాయి. క్రికెటర్లు క్వారంటైన్ ముగించుకుని బయో బబుల్‌లోకి అడుగుపెడితే.. అప్పుడు పెద్దగా సమస్యలు ఉండవు.
- దేశవాళీ క్రికెట్ సీజన్‌ను రంజీ ట్రోఫీతో మొదలెట్టాలని కొందరు భావిస్తున్నారు. అందుకు బీసీసీఐ ఏమంటుంది?
గత ఏడెనిమిది సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్ సీజన్ విజరు హజారే ట్రోఫీతో ఆరంభం అవుతోంది. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, చివర్లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ. కానీ కోవిడ్ పరిస్థితుల్లో రంజీ ట్రోఫీని ఆలస్యంగా ఆరంభించాలని అనుకున్నాం. ఇప్పుడు మరోసారి మూడో దశ కోవిడ్ ప్రభావం వచ్చేసింది.
- గత సీజన్‌కు దేశవాళీ క్రికెటర్లకు నష్ట పరిహారం అందించారు. దేశవాళీ క్రికెటర్లకు సైతం కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొస్తామని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ అన్నారు. అది ఎంత వరకు వచ్చింది?
రాష్ట్ర క్రికెట్ సంఘాల సూచనల మేరకు గత ఏడాది కాంట్రాక్టు ఆలోచన వైపు వెళ్లలేదు. కానీ రంజీ ట్రోఫీలో ప్లేమెంట్ స్లాబ్స్‌ను రూపొందించిన విషయాన్ని మీరు గమనించాలి. మనీ స్లాబ్స్‌ను దాదాపు రెట్టింపు చేశాం, దీంతో ఆటగాళ్ల వేతనాలు సైతం రెట్టింపు అయ్యాయి. మేము ఆ పని చేసేశాం. మ్యాచ్ ఫీజును పెంచటం ఉత్తమ మార్గమని భావించాం. కాంట్రాక్టు పద్దతిలోనూ ఇదే జరుగుతుంది. మీరు ఎన్ని మ్యాచులు ఆడితే, అంత మనీ వస్తుంది. ఆ మనీ స్లాబ్స్‌ను ప్రవేశపెట్టాం. ఆటగాళ్లకు రెండింతలు పరిహారం చెల్లించాం.
- దేశవాళీ సీజన్ మధ్యలో ఆగిపోయింది. మహిళల టోర్నీ, కూచ్ బెహార్ ఎప్పుడు పున ప్రారంభమవుతాయి?
కూచ్ బెహర్ టోర్నీ నిర్వహణకు ఇంకా సమయం ఉంది. కోవిడ్-19 ఉదృతి కాస్త చల్లబడినవ్వండి. కేవలం నాకౌట్ దశ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. ఏప్రిల్-మే సమయంలో కూచ్ బెహార్ పూర్తి చేస్తాం. మహిళల టోర్నమెంట్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టిన అనంతరం మరో నెలలో మహిళల టోర్నీని సైతం నిర్వహిస్తాం.
- ఈ ఏడాది ఐపీఎల్ మార్చిలో మొదలవుతోంది. గత రెండు సీజన్లు యుఏఈలో నిర్వహించారు. ఈ సీజన్ కోసం బోర్డు ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
కోవిడ్-19 బలంగా దెబ్బకొట్టనంత వరకు, ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్‌లోనే నిర్వహిస్తాం. వేదికల పరంగా మహారాష్ట్రను ఎంచుకున్నాం. ముంబయి, పుణెలలో లీగ్ దశ మ్యాచ్‌లను ప్రణాళిక చేస్తున్నాం. నాకౌట్ దశ మ్యాచులకు తర్వాత నిర్ణయం తీసుకుంటాం.
- ఈ రంజీ ట్రోఫీ సీజన్లో రహానె, పుజారా ఫామ్ అందుకుంటారని అనుకుంటున్నారా?
రహానె, పుజారా మంచి ఆటగాళ్లు. రంజీ ట్రోఫీలో ఆడి టన్నుల కొద్ది పరుగులు చేస్తారని ఆశిస్తున్నాను. సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనంతరం రంజీ ట్రోఫీలో ఆడటంలో సమస్య ఏముంది?. రంజీ ట్రోఫీ పెద్ద టోర్నమెంట్. మేమందరం ఆ టోర్నీ ఆడాం. వాళ్లు అక్కడికి వెళ్లి రాణిస్తారు. రహానె, పుజారా టెస్టు జట్టులోనే ఉన్నారు. వైట్‌బాల్ జట్టు ప్రణాళికల్లో లేనందున రంజీ ట్రోఫీలో ఆడటంలో ఎటువంటి సమస్య లేదు.
- భారత జట్టుకు కొత్త కోచ్, కొత్త కెప్టెన్ వచ్చారు. ఈ దశను ఏ విధంగా చూస్తారు?
కొత్త కోచ్, కొత్త కెప్టెన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతాను. వారి ముంగిట గొప్ప కెరీర్ ఉంది. భారత్‌కు మంచి ప్రదర్శన చేస్తారనే నమ్మకం ఉంది. ముందు ఏం జరుగుబోతుందనే నేను జోస్యం చెప్పలేను, కానీ మంచి ప్రదర్శన చేసేందుకు అవసరమైన ఆత్మ విశ్వాసం జట్టులో కనిపిస్తోంది.
- బీసీసీఐ దీర్ఘకాలిక కెప్టెన్ వైపు చూస్తోందా? గతంలో భారత్ రెడ్, వైట్‌బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకుంది?
కెప్టెన్సీ విషయాన్ని సెలక్షన్ కమిటీకి వదిలేద్దాం. నాయకత్వం విషయంలో సెలక్టర్లు ఏం నిర్ణయిస్తారో, మనం అదే విధంగా వెళ్దాం.
- మీరు బోర్డు చీఫ్‌గా, ద్రవిడ్ చీఫ్ కోచ్‌గా, లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ జట్టు, ఎన్సీఏ మెరుగైన సమన్వయంతో ఎన్సీఏ ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపర్చబోతున్నారు?
అన్నింటికి ఒక క్రమపద్దతిలో ఉంచాం. లక్ష్మణ్, రాహుల్ కలిసి పని చేస్తున్నారు. ఇతర కోచ్‌లు వారితో పాటు పని చేస్తున్నారు. అండర్-19 కోచ్‌లు ఎన్సీఏతో ఉన్నారు, వారిలో కొందరు ఇప్పుడు ప్రపంచకప్‌లో భాగంగా పని చేస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ సరికొత్త ప్రాంగణం నిర్మాణ పనులు ఈ నెలలో ఆరంభం అవుతాయి. 18 నెలల్లో కొత్త ఎన్సీఏ క్యాంపస్ సిద్ధమవనుంది.
- మహిళల ఐపీఎల్‌పై బోర్డు ఆలోచనలు ఎలా ఉన్నాయి? భారత మహిళల జట్టు మరిన్ని టెస్టులు ఆడటాన్ని చూస్తామా?
అవును, భారత మహిళల క్రికెట్ జట్టు మరిన్ని టెస్టు మ్యాచులు ఆడుతుంది. మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీ ఈ ఏడాది మేలో నిర్వహిస్తాం. దేశవాళీ మహిళా క్రికెటర్లలో వృద్ది సాధిస్తే త్వరలోనే మహిళల ఐపీఎల్‌ను ప్రారంభిస్తాం. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం ఐపీఎల్ నాకౌట్ దశలో మహిళల టీ20 చాలెంజ్ నిర్వహించనున్నాం.
- రానున్న శ్రీలంకతో సిరీస్‌లో గులాబీ టెస్టు మ్యాచ్ ఉంటుందని అంటున్నారు?
అవును, బెంగళూర్‌లో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఉండబోతుంది. శ్రీలంకతో సిరీస్‌కు వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. కానీ త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తాం. బెంగళూర్‌లో డే నైట్ టెస్టు ఉంటుంది.
- భారత్ అహ్మదాబాద్‌లో 1000వ వన్డే ఆడనుంది. ఓ మాజీ క్రికెటర్‌గా మీరు ఏ విధంగా భావిస్తున్నారు?
భారత్ 500వ వన్డేకు నేను కెప్టెన్‌గా ఉన్నాను. 2002, జులై 4న ఇంగ్లాండ్‌తో చారిత్రక మ్యాచ్ ఆడాం. భారత క్రికెట్‌కు ఇది అతి పెద్ద సందర్భం. పరిస్థితుల కారణంగా చారిత్రక మ్యాచ్‌కు అభిమానులను అనుమతించటం లేదు. ఖాళీ స్టేడియంలోనే పూర్తి సిరీస్ నిర్వహిస్తాం. కోవిడ్-19 లేకుంటే ఈ మ్యాచ్‌ను భారీ స్థాయిలో నిర్వహించేవాళ్లం. కోవిడ్ నిబంధనలతో చారిత్రక మ్యాచ్‌కు ఎటువంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నాం.
- 2022, 2023 భారత మెన్స్ జట్టుకు బిజీగా ఉండనుంది. ప్రపంచకప్‌ల నేపథ్యంలో జట్టుపై అంచనాలు ఎలా ఉన్నాయి?
నేను, జట్టు నుంచి ఏం ఆశించటం లేదు. అంచనాలు పెట్టుకుని జట్టుపై ఒత్తిడి పెంచలేను. ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తాం అంతే. వాళ్లు బాగా రాణిస్తారని అనుకుంటున్నాను. భారత్ గొప్ప జట్టు, ప్రపంచకప్ రేసులో ఎప్పుడూ గట్టి పోటీదారే.
- బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేండ్ల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. భారత కెప్టెన్సీ కంటే ఇది ఎక్కువ సవాల్‌గా అనిపించిందా?
భారత కెప్టెన్సీ కంటే బోర్డు అధ్యక్ష పదవి మరింత సవాల్‌తో కూడుకున్నదని అనుకోను. బోర్డు అధ్యక్షుడిగా నేను సాధించినది.. నేను ఇప్పుడు చెప్పలేను. ఏం జరుగుతుందో చూడాలి. రెండేండ్ల కాలంలో కోవిడ్ కఠిన పరిస్థితుల్లో బోర్డు గడ్డు కాలం చవిచూసింది. కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయినా, మనం ఇప్పటికీ టోర్నీలు నిర్వహించే స్థితిలో ఉన్నందుకు అదృష్టవంతులమే.