Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లవి, డీపీఎస్‌లో అకాడమీ ఏర్పాటు
నవతెలంగాణ, హైదరాబాద్ :
దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోని క్రికెట్ అకాడమీని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండటం గొప్ప విషయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంఎస్‌డీసీఏ అకాడమీ ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్యతో ఆర్కా ఎంఎస్‌డీసీఏ ఎండీ మిహిర్ దివాకర్ రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 'ప్రతిభ గల క్రికెటర్లకు ప్రణాళికబద్దమైన శిక్షణ అందించే ఆలోచనలో భాగంగా పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్‌లో పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. తొలిదశలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఈ నెలాఖరు నుంచి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. డీపీఎస్ నాదర్గుల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ గండిపేట, బోడుప్పల్లో వచ్చే నెలలో అకాడమీలు తెరవనున్నామని' మిహిర్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)తో ఒప్పందం చేసుకున్నామని కొమరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఉప్పల్ ఎంఎల్ఏ సుభాష్ రెడ్డి, పల్లవి విద్యాసంస్థల సీఓఓ మల్కా యశశ్రీ, ఎంఎస్‌డీసీఏ ప్రతినిధులు సిఖిందర్, ఉమా శంకర్, రాబిన్, కోచ్‌లు సత్రజిత్ లహరి, వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.