Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ ఫేవరేట్‌గా యువ భారత్
- ఇంగ్లాండ్‌తో ఫైనల్ సమరం నేడు
- ఐసీసీ అండర్-19 ప్రపంచకప్
14 ప్రపంచకప్‌లు, 8 ఫైనల్స్, నాలుగు టైటిళ్లు. అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ రికార్డు ఇది. వరుసగా నాల్గోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత కుర్రాళ్లు రికార్డు స్థాయిలో ఐదోసారి కప్పు కొట్టాలని ఉరకలేస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన భారత్ నేడు టైటిల్ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. 24 ఏండ్ల అనంతరం టైటిల్ పోరుకు చేరుకున్న ఇంగ్లాండ్ నేడు టైటిల్ ఫేవరేట్ టీమ్ ఇండియాను ఎదుర్కొగలదా? ఆసక్తికరం.
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా)
కరోనా కలకలంతో లీగ్ దశలో కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండానే యువ భారత్ తుది జట్టును బరిలో నిలిపింది. అయినా, అజేయ రికార్డుతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు ఇంగ్లాండ్ సైతం అంతే ఆకట్టుకుంది. ఓటమెరుగని ప్రస్థానంతో నేడు తుది పోరుకు సై అంటోంది. చివరగా 1998 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన ఇంగ్లాండ్ అప్పుడే తొలి టైటిల్‌ను సాధించింది. సుదీర్ఘ విరామం అనంతరం ఫైనల్స్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ నేడు వరుసగా నాల్గోసారి ఫైనల్లో ఆడుతున్న భారత్‌తో తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంది. అన్ని విభాగాల్లోనూ గొప్పగా కనిపిస్తోన్న యువ భారత్ నేడు ఫైనల్లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్, ఇంగ్లాండ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడు సాయంత్రం 6.30 గంటలకు ఆరంభం కానుంది.
జోరుమీదున్న భారత్ : సెమీఫైనల్లో అదిరే విజయంతో భారత కుర్రాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌లు అద్వితీయ ఇన్నింగ్స్‌లతో సెమీస్‌లో చెలరేగారు. ఆరంభంలో ఓపెనర్లు తడబడినా.. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను నియంత్రణలో ఉంచారు. కోవిడ్-19తో లీగ్ దశలో రెండు మ్యాచులకు దూరంగా ఉన్న షేక్ రషీద్ రీ ఎంట్రీలో చెలరేగాడు. యువ నాయక జోడీ క్రీజులో పాతుకుపోవటంతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. నేడు ఇంగ్లాండ్‌తోనూ యశ్ ధుల్, రషీద్‌లు అదే జోరు చూపించాలని జట్టు కోరుకుంటోంది. బౌలింగ్ విభాగంలో రాజ్యవర్ధన్, లెఫ్టార్మ్ పేసర్ రవి కుమార్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ వీక్కీ వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఒత్తిడిలోనూ పరిణితితో కూడిన ప్రదర్శన చేస్తున్న యువ జట్టు నేడు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇంగ్లాండ్ ఆశలు : 1998 అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత మరో టోర్నీలో ఫైనల్‌కు చేరుకోలేదు. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ సైతం బాగా ఆడుతోంది. సెమీస్‌లో అఫ్గాన్‌తో ఉత్కంఠ పోరులో ఇంగ్లీష్ కుర్రాళ్లు పైచేయి సాధించారు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్ నేడు భారత్‌కు కఠిన సవాల్ విసిరేందుకు సిద్దమైంది. కెప్టెన్ టామ్ ప్రెస్ట్ 292 పరుగులతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ బోడెన్ ఆరంభంలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. మణికట్టు మాయగాడు రెహాన్ అహ్మద్ మిడిల్ ఓవర్లలో ప్రమాదకారి. అన్ని విభాగాల్లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల ఇంగ్లాండ్ రెండో అండర్-19 ప్రపంచకప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కుర్రాళ్లకు కోహ్లి సందేశం : అండర్-19 కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన సూపర్‌స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ఫైనల్స్‌కు ముందు కుర్రాళ్లతో మాట్లాడాడు. విండీస్‌తో సిరీస్ కోసం అహ్మదాబాద్‌లో ఉన్న విరాట్ కోహ్లి వీడియో కాల్లో యశ్ ధుల్ బృందంతో అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్స్‌కు ముందు విరాట్ కోహ్లితో మాట్లాడటంతో కుర్రాళ్లు జోశ్ అందుకున్నట్టు కనిపిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ నుంచి పాఠాలు నేర్చుకున్న కుర్రాళ్లు.. నేడు టైటిల్ పోరుకు ముందు కింగ్ కోహ్లి నుంచి గెలుపు పాఠాలు అందుకున్నారు.
పూర్తి జట్లు :
భారత్ : యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, రఘవంశి, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, అన్నీశ్వర్ గౌతమ్, మానవ్, కౌశల్, రాజ్యవర్ధన్, విక్కీ, సాంగ్వాన్, దినేశ్, ఆరాధ్య యాదవ్, రాజ బవ, వాసు, రవి కుమార్.
ఇంగ్లాండ్ : టామ్ ప్రెస్ట్ (కెప్టెన్), జార్జ్ బెల్, బోడెన్, అలెక్స్, రెహన్ అహ్మద్, జేమ్స్ సేల్స్, జార్జ్ థామస్, థామస్ అస్పిన్‌వాల్, నాతన్ బార్న్‌వెల్, జాకబ్ బెథెల్, జేమ్స్ కొల్స్, విలియమ్ లక్ట్సన్, జేమ్స్ రీవ్, ఫతే సింగ్, బెంజమిన్ క్లిఫ్.