Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థాంతరంగా తప్పుకున్న కంగారూ కోచ్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాకు చారిత్రక తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం సహా స్వదేశంలో తాజాగా యాషెస్‌లో 4-0తో సిరీస్‌ను సాధించిన కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు జస్టిన్ లాంగర్ వ్యవహారాలు పర్యవేక్షించే కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం ఉదయం ఆస్ట్రేలియా కోచ్ పదవికి లాంగర్ రాజీనామా చేసినట్టు ఆ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. స్వదేశంలో టీ20 ప్రపంచకప్ నిలుపుకోవటం సహా తాజా పాకిస్థాన్ పర్యటనకు ముందు జస్టిన్ లాంగర్ రాజీనామా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ అని చెప్పాలి. జస్టిన్ లాంగర్ ప్రస్తుత కాంట్రాక్టు జూన్‌తో ముగియనుంది. టీ20 ప్రపంచకప్, యాషెస్ విజయాలు సాధించిన జస్టిన్ లాంగర్ కాంట్రాక్టు పొడగింపు ఆశించినట్టు తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో టీ20 ప్రపంచకప్ వరకు లాంగర్‌కు పొడగింపు ఇచ్చేందుకు సీఏ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. సీఏ ఆఫర్‌ను తిరస్కరించిన జస్టిన్ లాంగర్ ప్రపంచకప్‌కు జట్టు నిర్మాణం కోసం ముందుగానే కోచ్ పదవి నుంచి వైదొలినట్టు సమాచారం. మరోవైపు యాషెస్ సిరీస్ పరాభవంతో ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్‌వుడ్ శుక్రవారమే పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ లాంగర్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరు పట్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బోర్డుపై పదునైన విమర్శలు సంధిస్తున్నారు. జస్టిన్ లాంగర్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి ఆఫర్‌ను తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.