Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ 1000వ వన్డే పోరు విండీస్‌తో నేడు
- రోహిత్ సారథ్యంలో సరికొత్తగా టీమ్ ఇండియా
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ప్రపంచ అగ్రజట్టు ప్రపంచ రికార్డు మ్యాచ్‌కు సిద్ధమైంది. వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ వన్డే ఆడుతున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తొలి వన్డేతో భారత్ చారిత్రక సహస్ర సమరం ఆడనుంది. కోవిడ్ నిబంధనలతో సొంతగడ్డపై జరుగుతున్న చారిత్రక మ్యాచ్‌ను బీసీసీఐ అత్యంత సాధారణంగా నిర్వహిస్తోంది. భారత్ సహస్ర సమరానికి అభిమానులకు అనుమతి లేకపోవటం నిరాశ కలిగించేదే!. భారత్, వెస్టిండీస్ తొలి వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
పెద్దగా అంచనాల్లేని దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్ వైట్‌వాష్ ఓటమి. వైట్‌బాల్ ఫార్మాట్లో విధ్వంసక జట్టు ఇంగ్లాండ్‌పై పొట్టి సిరీస్ విజయం సంబురం. అహ్మదాబాద్‌లో నేడు చారిత్రక వన్డే సమరానికి ముందు ఇటు భారత్, అటు వెస్టిండీస్ ఫామ్ ఇది. భారీ అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుమోపిన టీమ్ ఇండియా భంగపాటుకు గురవగా.. ఇంగ్లాండ్‌కు వెస్టిండీస్ షాకిచ్చింది. అదే ఉత్సాహంతో నేడు భారత్‌ను ఢకొీట్టేందుకు రెఢ అవుతోంది. 2023 వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో భారత వన్డే జట్టు ప్రణాళికలను ప్రక్షాళన గావించేందుకు రోహిత్-ద్రవిడ్ ద్వయం ఈ సిరీస్ నుంచే మిషన్ 2023 మొదలెట్టనున్నారు!. భారత జట్టు చారిత్రక 1000వ వన్డే పోరులో పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నేడు తొలి సమరానికి సై అంటున్నాడు. భారత్, వెస్టిండీస్ తొలి వన్డే పోరు నేడు మధ్యాహ్నాం 1.30 గంటలకు ఆరంభం కానుంది.
ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా.. : తొలి వన్డేకు భారత్ ఓపెనింగ్ చిక్కు వచ్చి పడింది. శిఖర్ ధావన్ కోవిడ్-19 పాజిటివ్‌తో దూరమవగా.. కెఎల్ రాహుల్ తొలి వన్డేకు అందుబాటులో లేడు. కొత్తగా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ క్వారంటైన్లో ఉన్నాడు. దీంతో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తోడుగా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఈ మేరకు రోహిత్ శర్మ మ్యాచ్‌కు ముందు మీడియాతో వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ రాకతో టీమ్ ఇండియా మిషన్ 2023 ఆరంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్ దిశగా జట్టు ప్రణాళికల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వన్డే జట్టు బ్యాటింగ్ లైనప్‌లో బ్యాటర్ల పాత్ర, బాధ్యతపై రోహిత్ శర్మ దిశానిర్దేశనం చేయనున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మరోసారి ఫోకస్ కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో శతక నిరీక్షణకు ముగింపు పలకలేకపోయిన విరాట్ కోహ్లి స్వదేశంలో వంద పరుగుల మైలురాయిని అందుకుంటాడేమో చూడాలి. ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చిన విరాట్ కోహ్లి మ్యాచ్‌లో మెరుస్తాడని జట్టు అంచనా వేస్తోంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌ల చేరికతో మిడిల్ ఓవర్లలో పరుగుల వేట ఊపందుకునే అవకాశం ఉంది. లోయర్ ఆర్డర్లో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లు పరుగుల బాధ్యత తీసుకోవాల్సి ఉంది. సీనియర్ పేసర్లు జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలకు విశ్రాంతి లభించటంతో.. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ బృందానికి నాయకత్వం వహించనున్నాడు. దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. మణికట్టు మాయగాళ్లు యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ చాన్నాండ్ల తర్వాత తిరిగి కలిసి మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చాహల్, కుల్దీప్ కాంబినేషన్‌ను తిరిగి ఆడించేందుకు చూస్తున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వ్యాఖ్యానించటంతో ఈ ఇద్దరు నేడు తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది.
జోరుమీదున్న విండీస్ : మరోవైపు వెస్టిండీస్ జట్టు జోరు మీద కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం సాధించిన కరీబియన్లు అదే ప్రదర్శన టీమ్ ఇండియాపైనా పునరావృతం చేయాలని చూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ప్రాంఛైజీల దృష్టి పడేలా కరీబియన్ క్రికెటర్లు మైదానంలో రెచ్చిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్, యువ బ్యాటర్ నికోలస్ పూరన్, యువ పేసర్ ఫబియన్ అలెన్ సహా స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హౌల్డర్లు వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు కీలకం కానున్నారు. యువ ఆటగాళ్లు సైతం భారత్‌పై సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వెస్టిండీస్ క్రికెటర్లను రెట్టించిన ఉత్సాహంతో నడిపించే అవకాశం కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు అనుకూలం. ఇక్కడ బౌండరీలు పెద్దవి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత 1000వ వన్డే పోరుకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి; సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్.
వెస్టిండీస్ : బ్రూక్స్, బ్రాండన్ కింగ్, షారు హౌప్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హౌల్డర్, కీమర్ రోచ్, హెడెన్ వాల్ష్, ఫబియన్ అలెన్, అకీల్ హౌసీన్.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరీ పెద్దగా మార్పులు అవసరం లేదు. విభిన్న మ్యాచ్ పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యం. సఫారీ చేతిలో సిరీస్ ఓటమి నుంచి నేర్చుకుంటాం. క్రికెట్ జట్టు ఆట. అందరూ సమిష్టిగా ఆడితేనే విజయం. జట్టులో కొందరి ఆటగాళ్లకు వాళ్ల పాత్ర, బాధ్యతపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాను'
- రోహిత్ శర్మ, భారత కెప్టెన్
వన్డేల్లో భారత్
మ్యాచులు : 999
విజయాలు : 518
ఓటములు : 431
టై : 09
ఫలితం తేలనవి : 041