Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కు రికార్డు ఐదో అండర్-19 ప్రపంచకప్
- ఫైనల్లో ఇంగ్లాండ్‌పై యువసేన ఘన విజయం
- రాణించిన రాజ్ బవా, షేక్ రషీద్, నిశాంత్ సింధు
యువ భారత్ చరిత్ర సృష్టించింది. జూనియర్ క్రికెట్లో మరో జట్టుకు సాధ్యపడని రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన యశ్ ధుల్ సేన అండర్-19 ప్రపంచకప్‌ను రికార్డు ఐదో సారి అందుకుంది. రాజ్ బవా (5/31), రవి కుమార్ (4/34) నిప్పులు చెరగటంతో తొలుత ఇంగ్లాండ్ కుర్రాళ్లు 189 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో తెలుగు తేజం షేక్ రషీద్ (50), నిశాంత్ సింధు (50 నాటౌట్) అర్థ సెంచరీలతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 24 ఏండ్ల తర్వాత అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి చేరుకున్న ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్ అజేయ రికార్డుతో యువ విజేతగా నిలిచింది.
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా)
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ అదరగొట్టింది. యశ్ ధుల్ సేన ధనాధన్ షోను అటు ప్రత్యర్థులు, ఇటు కోవిడ్ మహమ్మారి అడ్డుకోలేకపోయాయి. మెగా టోర్నీలో అజేయ రికార్డు నిలుపుకున్న యువ భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను రికార్డు స్థాయిలో ఐదోసారి ముద్దాడింది. శనివారం అర్థరాత్రి ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ జయభేరి మోగించింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో తెలుగు తేజం షేక్ రషీద్ (50, 84 బంతుల్లో 6 ఫోర్లు), నిశాంత్ సింధు (50 నాటౌట్, 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో చెలరేగగా.. రాజ్ బవా (35, 54 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆల్‌రౌండర్ ప్రదర్శన గావించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్-19 జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. 91/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న ఇంగ్లాండ్‌ను జేమ్స్ సేల్స్ (34 నాటౌట్, 65 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి జేమ్స్ రెవ్ (95, 116 బంతుల్లో 12 ఫోర్లు) ఆదుకున్నాడు. భారత పేసర్లు రాజ్ బవా (5/31), రవి కుమార్ (4/34) నిప్పులు చెరగటంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రెచ్చిపోయిన రాజ్ బవా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షాల సరసన తాజాగా యశ్ ధుల్ చేరిపోయాడు.
పేసర్ల ప్రతాపం : ఫైనల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లకు స్పిన్నర్లు చెక్ పెడతారని అనుకుంటే.. ఆ పని పేసర్లు చేసేశారు. పేసర్లు రాజ్ బవా, రవి కుమార్ ఆరంభం నుంచే వికెట్ల వేటలో దూసుకుపోయారు. ఓపెనర్ జార్జ్ థామస్ (27) రాజ్యవర్థన్ ఓవర్లో 16 పరుగులు పిండుకుని జోరందుకోగా.. అతడి మెరుపు ఇన్నింగ్స్‌కు రాజ్ బవా మెరుపు వేగంతో ముగింపు పలికాడు. జాకబ్ బెతెల్ (2), కెప్టెన్ టామ్ ప్రెస్ట్ (0)లను రవి కుమార్ వెనక్కి పంపగా.. విలియం లక్ట్సన్ (4), జార్జ్ బెల్ (0), రెహన్ అహ్మద్ (10) భరతం బవా పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ వేగంగా పతనం దిశగా పయనించింది. 47/5తో ఉన్న జట్టు కొద్దిపేపట్లోనే 91/7కు చేరింది. మూడెంకల స్కోరు చేరుకునేలోపే కుప్పకూలేలా కనిపించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు జేమ్స్ రెవ్ ఊపిరీలూదాడు. లోయర్ ఆర్డర్లో జేమ్స్ సేల్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు విలువైన 93 పరుగులు జోడించాడు. స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన జేమ్స్ రెవ్ శతకానికి ఐదు పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. రెవ్ నిష్క్రమణ అనంతరం ఇంగ్లాండ్ పతనం లాంఛనమైంది. 44.5 ఓవర్లలోనే ఆ జట్టు 189 పరుగులకు చేతులెత్తేసింది. రాజ్ బవా ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా, రవి కుమార్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కౌశల్ తంబెకు ఓ వికెట్ లభించింది.
రషీద్, సింధు కొట్టేశారు : స్కోరు పరంగా భారత్ ఆరు వికెట్లు కోల్పోయినా.. ఛేదనలో యువ భారత్ మ్యాచ్‌ను నియంత్రణలోనే నిలుపుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రఘువంశి (0) డకౌట్‌గా నిష్క్రమించినా.. హర్నూర్ సింగ్ (21)తో కలిసి వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (50) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆరు ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించిన గుంటూరు వాసి సెమీస్ జోరును కొనసాగించాడు. హర్నూర్, కెప్టెన్ యశ్ ధుల్ (17) త్వరగా నిష్క్రమించినా.. మిడిల్ ఆర్డర్లో నిశాంత్ సింధు (50 నాటౌట్) బాధ్యత తీసుకున్నాడు. రాజ్ బవా (35)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సింధు యువ భారత్‌కు టైటిల్‌ను ఖాయం చేశాడు. బవా వెనుదిరిగినా దినేశ్ బనా (13 నాటౌట్)తో కలిసి లాంఛనం ముగించాడు. వరుసగా రెండు భారీ సిక్సర్లతో భారత్‌కు ఐదో అండర్-19 ప్రపంచకప్‌కు కట్టబెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బోడెన్, జేమ్స్ సేల్స్, థామస్ అస్పిన్‌వాల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ' ఇది గర్వించదగిన సందర్భం. ఇంగ్లాండ్ బాగా పుంజుకుంది. కానీ మా మైండ్‌సెట్, ఫోకస్ మారలేదు. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఉండటం గొప్ప విషయం. ఫైనల్లో అన్ని విభిన్న సందర్భాలకు జట్టుకు మానసికంగా సన్నద్ధమైంది. ప్రపంచకప్ విజయం పట్ల సంతోషంగా ఉందని' మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ యశ్ ధుల్ అన్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ అండర్-19 : 189 (జేమ్స్ రెవ్ 95, జేమ్స్ సేల్స్ 34, రాజ్ బవా 5/31, రవి కుమార్ 4/34)
భారత్ అండర్-19 : 195/6 (నిశాంత్ సింధు 50, షేక్ రషీద్ 50, బోడెన్ 2/24, థామస్ 2/42)
బీసీసీఐ భారీ నజరానా
భారత అండర్-19 ప్రపంచకప్ హీరోలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు సాధించినపెట్టిన యశ్‌ధుల్ సేనకు రూ.40 లక్షల చొప్పున నగదు బహుమతి అందివ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు అందించనున్నారు. యువ విజేతలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా అభినందనలు తెలిపారు.