Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరాగమనంపై నటరాజన్ దీమా
- సొంతూరులో జోరుగా సాధన
చెన్నై : రెండేండ్ల క్రితం భారత క్రికెట్లో సంచలనం సృష్టించిన పేరు తంగరసు నటరాజన్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పీఎల్) సూపర్ ఓవర్లో కండ్లుచెదిరే యార్కర్లతో క్రికెట్ సర్క్యూట్లో అందరి దృష్టిలో పడిన నటరాజన్.. 2020లో చిన్నపాటి తుఫాన్ సృష్టించాడు. 2020 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన టి నటరాజన్ ఆ టూర్లో మూడు ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్‌తో కలిసి పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో కీలక పేసర్‌గా ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే ఉన్నత శిఖరాలు చూసిన నటరాజన్ గాయం, ఫిట్నెస్తో జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2021 సీజన్ పూర్తిగా క్రికెట్‌కు దూరమైన నటరాజన్ 2022లో సరికొత్తగా దూసుకొచ్చేందుకు చూస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండో రౌండ్లో తమిళనాడు తరఫున బరిలోకి దిగనున్న నటరాజన్ రానున్న ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలంలో పేసర్ల జాబితాలో ఐదో సెట్లో వేలానికి రానున్నాడు. రూ.1 కోటి కనీస ధరతో నటరాజన్ వేలంలో ఉన్నాడు. రూ. 3 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన నటరాజన్.. మోచేతి గాయంతో కోలుకుంటున్న దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 40 లక్షలకే వెళ్లిపోయాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఐదు నెలలు ఫిట్‌నెస్‌పై దృష్టి నిలిపి సాధన చేసిన నటరాజన్ తాజాగా సొంతూరులోని అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నయా సీజన్ ఆరంభానికి ముందు నటరాజన్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు.
వేలంపై ఆలోచన లేదు! : ' ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఉంది. నిజానికి వేలం గురించి నేను పెద్దగా ఆలోచన చేయటం లేదు. ఐపీఎల్, మరో టీ20 ప్రపంచకప్ ఉన్నాయి. నా బలంపై ఫోకస్ నిలిపి, హార్డ్‌వర్క్ చేస్తున్నాను. నేను ఈ పని చేస్తే మిగతా అన్ని లైన్లో పడిపోతాయి. చాలా కాలం తర్వాత పునరాగమనం చేస్తున్నాను. దీంతో సహజంగానే కొంచెం ఒత్తిడి ఉంది. ఐపీఎల్లో, భారత జట్టుకు గతంలో మంచి ప్రదర్శన చేశాను. దీంతో నా నుంచి అభిమానులు మంచి ప్రదర్శనలు కోరుకుంటారు. ఒక్కసారి నేడు ఒకట్రెండు మ్యాచులు ఆడితే రిథమ్ అందుకుంటాను. నా ప్రణాళికలపై అప్పుడు మరింత స్పష్టత వస్తుంది. పునరుత్తేజంతో ఉన్నాను, గతంలో ఏదైతే బాగా పనిచేసిందో ఇప్పుడు వాటిని ప్రయత్నిస్తున్నాను. యార్కర్లు, కట్టర్లపై దృష్టి నిలిపాను. పాత నటరాజన్లా తిరిగి రావాలని అనుకుంటున్నాను. జాతీయ క్రికెట్ అకాడమీ బెంగళూర్‌లో సుమారు ఐదు నెలలు ఉన్నాను. ఆరంభం నుంచీ మళ్లీ మొదలెట్టడం కాస్త చికాకు. కానీ ఫిట్నెస్ సాధించేందుకు చేసిందే మళ్లీ మళ్లీ చేయాలి. వారాంతాల్లో ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపేవాడిని. నా మెంటర్, అన్న జయప్రకాశ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, రజినీకాంత్ (ట్రైనర్), శ్యామ్ సుందర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫిజియో)తో రికవరీ గురించి ఎక్కువగా మాట్లాడేవాడిని. జయప్రకాశ్ నాలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తాడు. వైట్ బాల్ ఫార్మాట్లో బంతిని స్వింగ్ చేయాలని చూస్తున్నాను. గతంలో పెద్ద మ్యాచుల్లో ఒత్తిడిలో బంతిని స్వింగ్ చేసేవాడిని కాదు. నా లెగ్ కట్టర్స్పై మరింత నియంత్రణ కోసం శ్రీనాథ్ అరవింద్‌తో కలిసి పని చేస్తున్నాను. గత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో టోర్నీలో నేను రిథమ్ అందుకోలేదు. ఏదో పొరపాటు ఉందని నా వీడియోలను శ్రీనాథ్‌కు పంపాను. నా బౌలింగ్ యాక్షన్, ల్యాండింగ్ సరిదిద్దుకోవాలని అతడు సూచించాడు. అతడి సూచనలు గొప్పగా పనిచేస్తున్నాయి' అని నటరాజన్ తెలిపాడు.
శిష్యులూ ఐపీఎల్ బరిలో..! : పేద కుటుంబం నుంచి క్రికెటర్‌గా ఎదిగిన తంగరసు నటరాజన్.. భారత జట్టు పేసర్‌గా, ఐపీఎల్లో నాణ్యమైన బౌలర్‌గా పేరందుకున్నాడు. ఈ సమయంలో స్వీయ ఎదుగుదలతో పాటు ఇతర క్రికెటర్లకు సైతం నటరాజన్ ప్రేరణగా నిలిచాడు. నటరాజన్ మెంటార్షిప్లో తమిళనాడు తరఫున మెరిసిన జి పెరియస్వామి, వి గౌతమ్‌లు తాజా ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలోకి రానున్నారు. గౌతమ్ గతేడాది టిఎన్పీఎల్ ఆరంగ్రేటంతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్ నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇటీవల ముంబయి ఇండియన్స్ ట్రయల్స్‌కు సైతం గౌతమ్ హాజరయ్యాడు. పంజాబ్ కింగ్స్ ట్రయల్స్‌కు వెళ్లిన పెరియస్వామి గత రెండు టీఎన్పిఎల్ సీజన్లలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా విలువైన అనుభవం గడించాడు. ' మా సొంతూరులో క్రికెట్ అకాడమీ ఆరంభించి అక్కడ ప్రతిభావంతులను సానపట్టాలని నా కల. పెరియస్వామి, గౌతమ్ పురోగతి చూసి ఎంతో గర్వపడుతున్నాను. పెరియస్వామితో కలిసి తమిళనాడుకు బౌలింగ్ చేశాను. టిఎన్పీఎల్లో అతడు గొప్పగా రాణించాడు. గౌతమ్‌ను చూస్తే నన్ను చూసినట్టే ఉంటుంది. వచ్చే రెండేండ్లలో ఇద్దరూ మరో స్థాయికి చేరుకుంటారు. ఐపీఎల్లో ఈ ఇద్దరు నా ప్రత్యర్థులు సైతం అవుతారేమో, ఎవరికి తెలుసు?' అని నటరాజ్ అన్నాడు.