Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో భారత్ రెండో వన్డే నేడు
- సిరీస్ విజయమే లక్ష్యంగా రోహిత్‌సేన
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
సఫారీ చేతిలో వైట్‌వాష్ ఓటమితో స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. కొత్త కెప్టెన్ నాయకత్వంలో సరికొత్త ప్రయాణం మొదలెట్టింది. సహస్ర సమరంలో ఎదురులేని విజయం నమోదు చేసిన రోహిత్‌సేన నేడు వన్డే సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. స్పిన్ సవాల్‌ను కాచుకుని సిరీస్‌ను సమం చేయాలని కరీబియన్లు భావిస్తున్నా.. అహ్మదాబాద్‌లో మరోసారి భారత్ మేనియాకు రంగం సిద్ధమైంది!. నేడు భారత్, వెస్టిండీస్ రెండో వన్డే పోరు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఎంతటి ఉత్తమ జట్టునైనా.. ఎవరు నడిపిస్తున్నారనే అంశం కీలకం అవుతుంది. ఆ విషయాన్ని రోహిత్ శర్మ మరోసారి నిరూపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణ పరాజయం చవిచూసిన జట్టును.. స్వదేశంలో గెలుపు పథంలోకి తీసుకొచ్చాడు. నేడు ఏకంగా సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించి భారత్‌కు వచ్చిన వెస్టిండీస్.. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇబ్బంది పడుతోంది. బ్యాటింగ్ లైనప్‌లో లోపాలు సరిదిద్దుకుంటేనే నేడు రోహిత్‌సేనతో పోరులో నిలువగలదు. స్పిన్ అస్త్రంతో నేడు భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
విరాట్ మెరుస్తాడా? : జట్టు విజయాలు వ్యక్తిగత వైఫల్యాలను కప్పిపుచ్చుతాయి. విండీస్‌తో తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఒకే ఓవర్లో వికెట్ పారేసుకున్నారు. స్టార్ బ్యాటర్లు ఇద్దరూ వెన్వెంటనే నిష్క్రమించటంతో కరీబియన్ బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బంతులేశారు. శతక నిరీక్షణ ముగించేందుకు విరాట్ కోహ్లి ఇక్కట్లు పడుతూనే ఉన్నాడు. నాయకత్వం కోల్పోయిన విరాట్ కోహ్లి సరైన దృక్పథంతో బ్యాట్ పట్టుకోవాల్సి ఉంది. అప్పుడే మునుపటి స్థాయిలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగలడు. వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో రాహల్ ఓపెనర్‌గా రానున్నాడు. లేదంటే, దీపక్ హుడా స్థానంలో లోయర్ ఆర్డర్లో ఫినీషర్‌గా రాహుల్‌ను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు మంచి టచ్‌లో ఉన్నారు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ ఫామ్ అందుకోవటం భారత్‌కు శుభపరిణామం. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి చాహల్ మ్యాజిక్ మరో స్థాయికి వెళ్లింది. సిరాజ్, ఠాకూర్లకు తోడు నేడు దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది.
నిలువగలరా? : 50 ఓవర్ల పాటు క్రీజులో నిలువటమే వెస్టిండీస్ ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది. ధనాధన్ ఫార్మాట్‌కు అలవాటు పడిన కరీబియన్లు వన్డే ఫార్మాట్‌కు అంత త్వరగా సర్దుకుపోవటం లేదు. జట్టులో యువ బ్యాటర్లు ఉన్నప్పటికీ అంచనాలు అందుకోవటం లేదు. హౌప్, కింగ్, బ్రూక్స్, పూరన్ సహా బ్రావో, పొలార్డ్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయాల్సి ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను ఒకరు తీసుకోవాల్సి ఉంది. ఐపీఎల్ వేలం ముంచుకొస్తున్న తరుణంలో ధనాధన్ షోపై బ్యాటర్లు దృష్టి సారిస్తున్నట్టు అనిపిస్తోంది. అల్జారీ జొసెఫ్, కీమర్ రోచ్, ఫబియన్ అలెన్‌కు తోడు జేసన్ హౌల్డర్ బంతితో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. లోతైన బ్యాటింగ్ కలిగిన వెస్టిండీస్.. క్రీజులో నిలదొక్కుకుంటే భారత్ ముందు భారీ స్కోరు ఉంచగలదు. భారత స్పిన్నర్లను కాచుకుంటే కరీబియన్లు నేడు మెరుగైన స్కోరు చేయగలరు.
పిచ్, వాతావరణం : అహ్మదాబాద్ పిచ్ సహజసిద్ధంగా బౌలర్లకు అనుకూలం. తొలి వన్డేలోనూ అదే కనిపించింది. రెండో వన్డేకు పిచ్ స్వభావంలో ఎటువంటి మార్పులు ఉండబోవు. ఆరంభంలో పేసర్లు, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. మంచు ప్రభావం దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోనుంది. మ్యాచ్‌కు ఎటువంటి వర్ష సూచనలు లేవని చెప్పవచ్చు!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ : షారు హౌప్, బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హౌల్డర్, అకీల్ హుసేన్, ఫబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.