Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకైక టీ20లో భారత్ ఓటమి
- రాణించిన తెలుగమ్మాయి మేఘన
ప్రపంచకప్ వేట సన్నాహకంలో భాగంగా టీమ్ ఇండియాకు ఆరంభంలోనే చుక్కెదురు. న్యూజిలాండ్ పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఏకైక టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ అమ్మాయిలు మెరుగైన ప్రదర్శనతో ఘన విజయం సాధించారు. కీలక బ్యాటర్లు తేలిపోవటంతో 156 పరుగుల ఛేదనలో భారత అమ్మాయిలు చేతులెత్తేశారు. భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఫిబ్రవరి 12 నుంచి షురూ కానుంది.
క్వీన్స్టౌన్ : న్యూజిలాండ్‌తో ఏకైక టీ20లో భారత అమ్మాయిలకు భంగపాటు ఎదురైంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ వేటలో భాగంగా న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన టీమ్ ఇండియా.. పరాజయంతో పర్యటనను ఆరంభించింది. పొట్టి ఫార్మాట్లో ఆతిథ్య కివీస్ అమ్మాయిలు భారత్‌పై పైచేయి సాధించారు. 156 పరుగుల ఛేదనలో భారత్‌ను 137 పరుగులకే పరిమితం చేసి 18 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఫిబ్రవరి 12 నుంచి ఆరంభం కానుంది.
మేఘన మెరిసినా..! : భారీ టార్గెట్ ఛేదనలో ధనాధన్ బ్యాటర్ షెఫాలీ వర్మ (13, 14 బంతుల్లో 2 ఫోర్లు) వైఫల్యంతో ఆరంభంలోనే భారత్ ఆశించిన పరుగులు చేయలేదు. ఓపెనర్ యస్టికా భాటియా (26, 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు సాధించటంలో విఫలమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12, 13 బంతుల్లో) పేలవ ఫామ్ కివీస్ గడ్డపైనా కొనసాగించింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (37, 30 బంతుల్లో 6 ఫోర్లు) మిడిల్ ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసింది. మేఘన మెరుపులతో భారత్ ఛేదనలో ఆశలు నిలుపుకుంది. లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్ (12), పూజ (10) నుంచి సహకారం లోపించటంతో మేఘన పోరాటం వృథా అయ్యింది. నిర్ణీత ఓవర్లలో భారత్ 137 పరుగులే చేయగల్గింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ ఖెర్, అమేలి ఖెర్, జెన్సెన్లు రెండేసి వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (36, 34 బంతుల్లో 2 ఫోర్లు), సోఫీ డెవిన్ (31, 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా రాణించటంతో కివీస్ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించింది. మిడిల్ ఆర్డర్లో మాడీ గ్రీన్ (26, 20 బంతుల్లో 3 ఫోర్లు), లీ టహుహు (27, 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు పిండుకున్నారు. భారత బౌలర్లలో పూజ (2/16), దీప్తి (2/26) రాణించినా కివీస్ బ్యాటర్ల జోరుకు అడ్డుకట్ట వేయటంలో విఫలమయ్యారు. ఏకైక టీ20లో గెలుపొందిన న్యూజిలాండ్ పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన లీ టహుహు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 155/5 (సుజీ బేట్స్ 36, మాడీ గ్రీన్ 26, లీ టహుహు 27, పూజ 2/16, దీప్తి 2/26)
భారత్ ఇన్నింగ్స్ : 137/8 ( మేఘన 37, యస్టికా భాటియా 26, జెస్ ఖెర్ 2/20, అమేలీ ఖెర్ 2/25, జెన్సెన్ 2/25).
క్వారంటైన్లో మంధాన!
భారత స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన ఏకైక టీ20లో బరిలోకి దిగలేదు. న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ కోసం భారత మహిళల జట్టు క్వీన్స్టౌన్కు చేరుకోగా.. రేణుక సింగ్, మేఘ్న సింగ్ సహా మరో ఇద్దరు సహాయక సిబ్బందితో కలిసి స్మృతీ మంధాన న్యూజిలాండ్ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో ఉంది. కోవిడ్-19 కేసులు వెలుగులోకి రాకపోయినా.. ప్రయాణ సంబంధిత కారణాలతో స్మృతీ మంధాన సహా మరో ఇద్దరు యువ క్రికెటర్లు ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్మృతీ మంధాన ఏకైక టీ20కి అందుబాటులో ఉండలేదు. ఫిబ్రవరి 12న తొలి వన్డేకు సైతం మంధాన అందుబాటులో ఉండే అవకాశం కనిపించటం లేదు. మంధాన లేకపోవటంతో షెఫాలీ వర్మతో కలిసి యస్టికా భాటియా ఇన్నింగ్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. మంధాన క్వారంటైన్‌పై బీసీసీఐ నుంచి సవివరణ ప్రకటన రావాల్సి ఉంది.