Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44 పరుగుల తేడాతో భారత్ గెలుపు
- రాణించిన సూర్య, ప్రసిద్ కృష్ణ
విజయంతో కొత్త కెప్టెన్ ప్రయాణం మొదలెట్టాడు. వెస్టిండీస్‌ను వరుస వన్డేల్లో చిత్తు చేసిన టీమ్ ఇండియా సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలో స్పిన్‌కు పడిపోయిన కరీబియన్లు.. రెండో వన్డేలో పేస్‌కు చిత్తయ్యారు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (4/12) నిప్పులు చెరిగే ప్రదర్శనతో ఛేదనలో వెస్టిండీస్ చిత్తయ్యింది. సూర్యకుమార్ యాదవ్ (64) అర్థ సెంచరీతో తొలుత భారత్‌ను నిలబెట్టాడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (4/12) నిప్పులు చెరిగాడు. 54 బంతుల్లో 12 పరుగులే ఇచ్చిన ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో విజృంభించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ప్రసిద్ కృష్ణకు శార్దుల్ ఠాకూర్ (2/41) సైతం తోడవగా 238 పరుగుల ఊరించే ఛేదనలో వెస్టిండీస్ 193 పరుగులకే కుప్పకూలింది. షమరా బ్రూక్స్ (44, 64 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అకీల్ హుసేన్ (34, 52 బంతుల్లో 3 ఫోర్లు), ఒడీన్ స్మిత్ (24, 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) విండీస్ పోరాటాన్ని ముందుకు నడిపించినా.. ప్రయోజనం లేకపోయింది. 46 ఓవర్లలో 193 పరుగులకే వెస్టిండీస్ కుప్పకూలింది. 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మరో వన్డే మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సూర్యకుమార్ యాదవ్ (64, 83 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరుగైన స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (18) మరోసారి నిరాశపరిచారు. నామమాత్రపు మూడో వన్డే శుక్రవారం జరుగనుంది.
సూర్య ఒక్కడే! : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆశించిన స్కోరు చేయలేదు. ఓపెనర్‌గా వచ్చి ఆశ్చర్యపరిచిన రిషబ్ పంత్ (18, 34 బంతుల్లో 3 ఫోర్లు) కొత్త పాత్రలో మెప్పించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (18, 30 బంతుల్లో 3 ఫోర్లు) మళ్లీ విఫలమయ్యారు. 43/3తో ఉన్న జట్టును కెఎల్ రాహుల్ (49, 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (64) ఆదుకున్నాడు. ఈ ఇద్దరు నాల్గో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ నిష్క్రమణ అనంతరం వాషింగ్టన్ సుందర్ (24), దీపక్ చాహర్ (29)లు నిలబడినా వేగంగా పరుగులు చేయలేకపోయారు. శార్దుల్ (8), సిరాజ్ (3), చాహల్ (11) తడబాటుతో డెత్ ఓవర్లలో భారత్ పెద్దగా పరుగులు పిండుకోలేదు. కరీబియన్ బౌలర్లలో అల్జారీ జొసెఫ్ (2/36), ఒడీన్ స్మిత్ (2/29) రెండేసి వికెట్లతో రాణించారు.
ప్రసిద్ కృష్ణ ధాటికి విండీస్ ఛేదనలో చతికిల పడింది. 76/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న విండీస్‌ను షమరా బ్రూక్స్ (44), అకీల్ హుసేన్ (34) ఆదుకున్నారు. ఈ ఇద్దరు మెరవటంతో విండీస్ మ్యాచ్‌లో నిలబడింది. చివర్లో ఒడీన్ స్మిత్ (24) సైతం కదం తొక్కినా.. అప్పటికే విండీస్ కథ ముగిసింది. బ్రావో (1), హోల్డర్ (2), పూరన్ (9) విఫలమవగా వెస్టిండీస్ 193 పరుగులకే చేతులెత్తేసింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 237/9 (సూర్యకుమార్ యాదవ్ 64, కెఎల్ రాహుల్ 49, హుడా 29, జొసెఫ్ 2/36, స్మిత్ 2/29)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 193/10 (షమరా బ్రూక్స్ 44, హుసేన్ 34, స్మిత్ 24, ప్రసిద్ కృష్ణ 4/12, శార్దుల్ 2/41)