Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా నిర్ణయాల ఘనతను మరొకరు తీసుకున్నారు
- ఆస్ట్రేలియా సిరీస్‌పై అజింక్య రహానె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతం చేసింది. వరుసగా రెండుసార్లు కంగారూ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు మరింత ప్రత్యేకత ఉంది. ఆ పర్యటనలో తొలి టెస్టులో భారత్ అవమానకర ఓటమి చవిచూసింది. 36 పరుగులకే కుప్పకూలి ఆడిలైడ్ టెస్టులో అభాసుపాలైంది. తొలి టెస్టు అనంతరం పితృత్వ సెలవుపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశం వెళ్లిపోయాడు. కీలక బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌కు ముగ్గురు కీలక క్రికెటర్ల సేవలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో మెల్బోర్న్ టెస్టులో శతకంతో జట్టును ముందుండి నడిపించిన అజింక్య రహానె భారీ విజయంతో సిరీస్ సమం చేశాడు. సిడ్నీ టెస్టులో అద్వితీయ పోరాటంతో డ్రా, బ్రిస్బేన్‌లో చారిత్రక విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరోసారి భారత్ సొంతమైంది. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయం ఘనతను అప్పటికి చీఫ్ కోచ్ రవిశాస్త్రి తీసుకున్నాడు. మీడియాలోనూ రవిశాస్త్రి అదే విధంగా చెప్పుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన జట్టును మెల్బోర్న్లో గెలుపు తీరాలకు చేర్చిన ఘనతను రవిశాస్త్రి తనదేనని చెప్పుకున్నాడు. ఆ సిరీస్‌లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె తాజాగా కంగారూ గడ్డపై చారిత్రక సిరీస్ ఘనతపై పెదవి విప్పాడు. మైదానంలో, డ్రెస్సింగ్‌రూమ్‌లో తాను తీసుకున్న నిర్ణయాలకు ఇంకెవరో ఘనతను ఆపాదించుకున్నారని వాపోయాడు. ఓ టాక్ షోలో మాట్లాడుతూ అజింక్య రహానె ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఏం చేశానో నాకు తెలుసు. అందరికీ నేను చేసినది చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పుకుని ఘనత సొంతం చేసుకోవటం నా స్వభావం కాదు. అవును, ఆస్ట్రేలియా పర్యటనలో మైదానంలో, డ్రెస్సింగ్‌రూమ్‌లో నేను కీలక నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ఆ నిర్ణయాలకు ఘనతను మాత్రం మరొకరు దక్కించుకున్నారు. జట్టు సిరీస్ విజయం సాధించింది. చారిత్రక విజయమే నాకు మిక్కిలి సంతోషం. ఆ సిరీస్ విజయం అనంతరం.. మీడియాలో నేను ఇది చేశాను, నేను అది చేశాను.. ఆ నిర్ణయం నాదే అంటూ మీడియాలో చెప్పటం చూశాను. నేను వాళ్లకోసమే చెబుతున్నాను.. నేనేం నిర్ణయాలు తీసుకున్నానో నాకు తెలుసు. నా గురించి నేను గొప్పలు చెప్పుకోను. జట్టు మేనేజ్మెంట్తోనూ నిర్ణయాల గురించి చర్చించేవాడిని. కానీ ఆ సిరీస్ ఘనతను మరొకరు కొట్టేశారు' అని అజింక్య రహానె అన్నాడు.
ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ టెస్టులో అదిరే శతకం సాధించిన అజింక్య రహానె.. ఆ తర్వాత టచ్ కోల్పోయాడు. నిరుడు 13 టెస్టుల్లో 20.82 సగటుతో 479 పరుగులే చేశాడు. ఈ సమయంలో రెండు అర్థ సెంచరీలు, మరికొన్ని 40 ప్లస్ ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. పేలవ షాట్ సెలక్షన్, పరుగుల వేటలో వెనుకంజతో ఇటీవల టెస్టు వైస్ కెప్టెన్సీ సైతం కోల్పోయిన అజింక్య రహానె రానున్న శ్రీలంకతో సిరీస్‌లో జట్టులో స్థానం ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ' నా బ్యాటింగ్ సామర్థ్యంపై నాకు విశ్వాసం ఉంది. నేను బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. నాలో ఇంకా మంచి క్రికెట్ మిగిలి ఉందని నమ్ముతున్నాను' అని రహానె చెప్పాడు.