Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో భారత్ మూడో వన్డే నేడు
- 3-0 విజయంపై కన్నేసిన రోహిత్‌సేన
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టీమ్ ఇండియా 3-0 విజయంపై కన్నేసింది. ఓ మ్యాచ్‌లో స్పిన్, మరో మ్యాచ్‌లో పేస్ అండతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన రోహిత్‌సేన.. ముచ్చటగా మూడో వన్డేలో స్పిన్, పేస్ మేళవింపుతో సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై వెస్టిండీస్ జట్టు 50 ఓవర్ల పాటు క్రీజులో నిలువటమే గగనంగా మారగా.. చివరి వన్డేలో భారత్ బ్యాట్‌తోనూ ధనాధన్ మోత మోగించాలని చూస్తోంది. భారత్, వెస్టిండీస్ మూడో వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా నేడు మూడో వన్డేలో భారత్ బరిలోకి దిగుతోంది. సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ అందుబాటులోకి వచ్చిన వేళ అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియా 3-0 విజయం నమోదు చేయాలని చూస్తోంది. బ్యాటర్లు నిలకడగా నిరాశపరుస్తున్న అహ్మదాబాద్ పిచ్‌పై మూడో వన్డేలోనైనా పరుగుల మోత మోగుతుందేమో చూడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల నుంచి అభిమానులు ధనాధన్ షో ఆశిస్తున్నారు. సిరీస్‌పై ఆశలు కోల్పోయిన వెస్టిండీస్ ఊరట విజయం కోసం నేడు రంగంలోకి దిగుతోంది. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతున్న విండీస్ బ్యాటింగ్ లైనప్ చివరి వన్డేలోనైనా పోరాట పటిమ చూపిస్తుందేమో చూడాలి. భారత్, వెస్టిండీస్ చివరి వన్డే సమరం నేడు.
ఆ ఇద్దరు మెరిసేనా?! : రెండేండ్లుగా విరాట్ కోహ్లి శతకంపై విరామం లేని చర్చ నడుస్తోంది. వరుస శతకాలు బాదిన విరాట్ కోహ్లి.. ఉన్నట్టుండి శతకం సాధించే కళ మర్చిపోయినట్టున్నాడు!. విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలతో అతడి వంద పరుగుల మైలురాయిపై చర్చ కాస్త.. అతడు ఫామ్‌లోకి వస్తాడనే స్థితికి చేరుకునేలా ఉంది. తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచిన విరాట్ కోహ్లి చివరి మ్యాచ్‌లోనైనా జోరందుకోవాలని జట్టు ఆశిస్తోంది. కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపిస్తున్నా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఓపెనర్‌గా భీభీత్స ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన రోహిత్ శర్మ అతి పెద్ద స్టేడియంలో తనదైన శైలిలో రెచ్చిపోతే జట్టుకు అంతకుమించి ఇంకేం కావాలి. సీనియర్ బ్యాటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ కోవిడ్-19 నుంచి కోలుకుని తిరిగి బబుల్‌లోకి అడుగుపెట్టాడు. రోహిత్ తోడుగా ధావన్ నేడు ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్‌లో రాణించాడు. రిషబ్ పంత్, కెఎల్ రాహల్ బ్యాటింగ్ పొజిషన్లపై కాస్త సందిగ్థత నెలకొంది. ధావన్ రాకతో ఎవరు బెంచ్‌కు పరిమితం అవుతారో ఆసక్తికరం. బౌలింగ్ విభాగంలో యువ పేసర్ ప్రసిద్ కృష్ణ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. రెండో వన్డేలో సంచలన గణాంకాలు నమోదు చేసిన ప్రసిద్ కృష్ణ.. శార్దుల్, సిరాజ్ తోడుగా నేడూ వికెట్ల వేటలో దూసుకెళ్లాలని చూస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
నిలబడగలరా? : ఇంగ్లాండ్‌పై మెరుపు విజయం సాధించి భారత పర్యటనకు వచ్చినా.. వన్డే సిరీస్‌లో ఆ జట్టుకు పెద్దగా అవకాశాలు లేవు. 50 ఓవర్ల పాటు క్రీజులో నిలబడటమే కరీబియన్ల ముందున్న తొలి సవాల్. రెండో వన్డేలో స్వల్ప ఛేదనలో ఆ జట్టుకు అవకాశాలు కనిపించినా.. వికెట్లు లేకపోవటంతో ఓటమి తప్పలేదు. లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిండీస్ ఛేదనలో ఎప్పుడైనా ప్రమాదకారే. కెప్టెన్ కీరన్ పొలార్డ్ నేడు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. డారెన్ బ్రావో, బ్రూక్స్, నికోలస్ పూరన్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయాల్సి ఉంది. సీనియర్ పేసర్ జేసన్ హౌల్డర్ బంతితో మరింత బాధ్యత తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం స్ఫూర్తితోనైనా నేడు విండీస్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందేమో చూడాలి.
పిచ్ రిపోర్టు : అహ్మదాబాద్ పిచ్‌లో ఎటువంటి మార్పులు లేవు. తొలి రెండు వన్డేల తరహాలోనే నేడూ పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించనుంది. క్రీజులో నిలిస్తే బ్యాటర్లకు సైతం పరుగుల వేల సులువు కానుంది. టాస్ నెగ్గిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.
వెస్టిండీస్ : షారు హౌప్ (వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమరా బ్రూక్స్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెనÊ), జేసన్ హౌల్డర్, అకీల్ హుసేన్, ఫబియన్ అలెన్, ఒడీయన్ స్మిత్, కీమర్ రోచ్.