Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం నేటి నుంచే
- కోట్లు కుమ్మరించేందుకు ప్రాంఛైజీలు రెఢీ
రూ. 900 కోట్లు, 590 మంది క్రికెటర్లు, 10 ప్రాంఛైజీలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలం వచ్చేసింది. 2008 తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఓపెన్ ఆటగాళ్ల వేలం కావటంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి బెంగళూర్పైనే నెలకొంది. 10 ప్రాంఛైజీలు వేలంలో క్రికెటర్లపై కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ క్రికెటర్లకు అనూహ్య భంగపాటు, దేశీయ క్రికెటర్లు రాత్రికి రాత్రి కోటీశ్వరులు కానున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ 2022 మెగా ఆటగాళ్ల వేలం నేడు బెంగళూర్‌లో ఆరంభం.
నవతెలంగాణ-బెంగళూర్
ఐపీఎల్ వేలం అనగానే వేలం వెర్రిగా క్రికెటర్లపై కోట్లు కుమ్మరించటమే. ఏండ్లుగా ఆటగాళ్ల వేలంలో ఇదే తంతు చూస్తున్నాం. రికార్డు ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఎవరు? ఏ ఆటగాడి కోసం ఏ ప్రాంఛైజీ పోటీపడుతుందనే అంశాలు గతంలో ఎక్కువగా ఆసక్తి పెంచాయి. కానీ 2022 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం గతంతో పోల్చితే భిన్నంగా సాగనుంది. ఈ వేలాన్ని ఓరకంగా ఓపెన్ వేలం అనవచ్చు. అన్ని ప్రాంఛైజీలు తమ జట్లను పునాది నుంచి నిర్మించుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరి ఐదుగురు ఆటగాళ్లను తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ కార్డు సదుపాయం ఇప్పుడు అందబాటులో లేదు. నాణ్యమైన క్రికెటర్లను దక్కించుకునేందుకు, సరసమైన ధరలో విలువైన ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రాంఛైజీల సహాయక సిబ్బంది బృందం వ్యూహ రచనపై దృష్టి సారించింది. మెరుగైన వ్యూహంతో వేలానికి వచ్చిన ప్రాంఛైజీ సరసమైన జట్టు నిర్మాణం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తొలి రోజు 161 మంది క్రికెటర్లు వేలంలోకి రానున్నారు.మిగతా క్రికెటర్లు ఆదివారం వేలంలో అందుబాటులోకి వస్తారు. ఈ నేపథ్యంలో నేడు ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలంలో ప్రభావం చూపగల అంశాలను చూద్దాం.
కీలక ఆటగాళ్ల వేట : చెన్నై, ముంబయి, ఢిల్లీ, కోల్‌కత జట్లు అత్యధికంగా నలుగురేసి క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. రైట్ టు కార్డ్ అవకాశం లేకపోవటంతో తమ జట్టులోని కీలక ఆటగాళ్ల కోసం మిగతా ప్రాంఛైజీలతో పోటీపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రాంఛైజీలు ప్లాన్-ఏ, ప్లాన్-బి అనుసరించనున్నాయి. ఉదాహరణకు వికెట్ కీపర్ బ్యాటర్లు డికాక్, ఇషాన్ కిషన్ కోసం ముంబయి వేలంలో పోటీపడనుంది. డికాక్ ఆరంభంలో దిగ్గజాల జాబితాలో రానుండగా.. కిషన్ నాల్గో సెట్లో వేలానికి రానున్నాడు. ఇతర జట్లు సైతం ఈ ఇద్దరి కోసం ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో తొలుత డికాక్ భారీ ధర పలికితే.. చివర్లో కిషన్ కోసం ముంబయి వద్ద తగిన డబ్బు ఉండకపోవచ్చు. కిషన్ రికార్డు ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉండటంతో వేరే ప్రాంఛైజీ దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో ఏ ఆటగాడి కోసం ఎంత వరకు వెళ్లవచ్చు? ఏ ఆటగాడి కోసం తగినంత డబ్బు అట్టిపెట్టుకోవాలనే అంశంలో ప్రాంఛైజీలు స్పష్టమైన ప్రణాళికతో ఉండాల్సి ఉంటుంది. గత సీజన్లో తమ కీలక ఆటగాళ్ల కోసం ప్రాంఛైజీలు పట్టుబడనుండటంతో ఆ ప్రాంఛైజీల పర్సు ఖాళీ చేసేందుకు ఇతర ప్రాంఛైజీలు కృత్తిమ పోటీ సైతం సృష్టించే అవకాశం ఉంది. అప్పుడు వేలంలో రాబోయే కీలక ఆటగాళ్ల రేసులో ఆ ప్రాంఛైజీలను వ్యూహాత్మకంగా తప్పించవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం అశ్విన్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్ల కోసం వేలంలో పోటీపడనుంది. దీంతో ఈ ఆటగాళ్ల కోసం ఢిల్లీ గరిష్ట మొత్తం చెల్లించేలా ఇతర ప్రాంఛైజీలు కృత్తిమ పోటీకి రావచ్చు, లేదంటే అనుకున్నంతలో లభిస్తే ఎగరేసుకుపోవచ్చు. వ్యూహాత్మక ఎత్తుగడలు తాజా వేలంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
అనుకూలతా? ప్రతికూలతా?! : మెగా వేలానికి ముందు ప్రాంఛైజీలకు అందుబాటులో ఉన్న సొమ్ము అనుకూలత, ప్రతికూలతలు ఆసక్తి రేపుతోంది. పంజాబ్ రూ.72 కోట్లు, హైదరాబాద్ రూ.68 కోట్లతో వేలంలో అడుగుపెడుతున్నాయి. దిగ్గజ క్రికటర్ల కోసం కోట్లు కుమ్మరించే శక్తి ఈ ప్రాంఛైజీలకు ఉంది. మరోవైపు ముంబయి రూ.48 కోట్లు, ఢిల్లీ రూ.47.5 కోట్లతో తక్కువ మొత్తంతో వేలానికి రానున్నాయి. ఈ సొమ్ముతోనే జట్టు పూర్తి నిర్మాణం చేయాల్సి ఉండటంతో గరిష్టంగా ఒక్క ఆటగాడికి మాత్రమే పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలవు. ఒకరిద్దరు క్రికెటర్ల కోసమే 20 కోట్లు కుమ్మరిస్తే మిగతా జట్టు కోసం తగినంత సొమ్ము అందుబాటులో ఉండదనే విషయం గుర్తించాలి.
సొమ్ము ఎలా ఖర్చు చేయాలి? : ప్రతి ప్రాంఛైజీ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మంది క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెనింగ్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, వికెట్ కీపర్, ఆల్‌రౌండర్, పేసర్లు, స్పిన్నర్లు..ఈ అన్ని విభాగాల్లో ప్రత్యామ్నాయ క్రికెటర్లను ప్రాంఛైజీలు నేర్పుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ విభాగంలో ఆటగాడి కోసం అధిక మొత్తం వెచ్చించాలి? ఏ విభాగంలో ఆటగాళ్ల కోసం ఓ మోస్తరు ఖర్చు చేయవచ్చు అనే ప్రణాళికలు స్పష్టంగా ఉండాలి. వేలంలో అన్ని ప్రాంఛైజీలు భారత బ్యాటర్లు, భారత పేసర్లు, భారత స్పిన్నర్ల కోసం పోటీపడనున్నాయి. దీంతో ఈ మూడు విభాగాల్లో క్రికెటర్లకు భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ప్రధానంగా 11-15 మంది క్రికెటర్లను తీసుకునేందుకు ప్రాంఛైజీలు 90 శాతం సొమ్మును ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఎవరికి విలువెక్కువ? : బలమైన ఐపీఎల్ జట్టు నిర్మాణానికి కీలక భారత క్రికెటర్లు అవశ్యమని చెన్నై, ముంబయి, ఢిల్లీ జట్లు నిరూపించాయి. దీంతో నేటి వేలంలో అన్ని ప్రాంఛైజీలు అదే ఫార్ములాను అనుసరించేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ప్రతి ప్రాంఛైజీ కనీసం ఐదారుగురు కీలక దేశీయ క్రికెటర్లను సొంతం చేసుకోవాలని చూస్తాయి. ఏదేని ఆటగాడి కోసం రికార్డు ధరను వెచ్చించటంలో చెన్నై, ముంబయి ఆసక్తి చూపవు. కానీ తమ మ్యాచ్ విన్నర్లు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్ల కోసం ఈసారి ఈ ప్రాంఛైజీలు భారీ సొమ్ము సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ వేలంలో భారత క్రికెటర్లు అత్యధిక ధర సొంతం చేసుకుంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వయసు భారమా?! : సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్లు ఒంటిచేత్తో మ్యాచులనే కాదు టోర్నీలను సాధించిపెట్టారు.అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, పియూశ్ చావ్లా, రాబిన్ ఉతప్ప, ఇషాంత్ శర్మ వంటి క్రికెటర్లు ఇప్పుడు వయసు పైబడ్డారు. ఈ ఆటగాళ్లందరూ గరిష్ట ధరకు వేలంలోకి రానున్నారు. ఇప్పటికీ ఈ క్రికెటర్ల కోసం అంత సొమ్ము ఖర్చు చేయడానికి ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయా? చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ వయసు పెద్ద సమస్య కాదని నిరూపించింది. రాబిన్ ఉతప్పను రూ.3 కోట్లకు రాయల్స్ నుంచి, డుప్లెసిస్‌ను రూ.1.6 కోట్లకే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరూ చెన్నై నాల్గో టైటిల్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. దీంతో ప్రాంఛైజీలు సీనియర్ క్రికెటర్ల కోసం ఎటువంటి ప్రణాళికతో వస్తున్నాయేది ఆసక్తిరేపుతోంది.
నేడు 161 మందే!
తొలి రోజు వేలంలో 161 మంది క్రికెటర్లు రానున్నారు. దిగ్గజ విభాగంలో పది మంది క్రికెటర్లు వేలంలో ఉన్నారు. డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, మహ్మద్ షమి, డుప్లెసిస్, పాట్ కమిన్స్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్ ఈ విభాగంలో ఉన్నారు. రూ. 2 కోట్ల కనీస ధరతో 48 క్రికెటర్లు, రూ.1.5 కోట్ల కనీస ధరతో 20 మంది క్రికెటర్లు, రూ.1 కోటి కనీస ధరతో 34 మంది క్రికెటర్లు వేలంలోకి రానున్నారు.