Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇషాన్‌కు రూ.15.25 కోట్లు
- దీపక్ చాహర్‌కు రూ.14 కోట్లు
- శ్రేయస్‌కు రూ.12.25 కోట్లు
- హసరంగకు రూ.10.75 కోట్లు
భారత క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. ఇషాన్ కిషన్ కోసం ముంబయి, శ్రేయస్ అయ్యర్ కోసం కోల్‌కత నైట్‌రైడర్స్ రికార్డు ధర చెల్లించాయి. ఐపీఎల్లో నాల్గో అత్యధిక మొత్తం అందుకోనున్న క్రికెటర్‌గా కిషన్ నిలిచాడు. కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న కోల్‌కత శ్రేయస్ అయ్యర్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలం తొలి రోజును పది ప్రాంఛైజీలు వ్యూహాత్మకంగా ముగించాయి!.
నవతెలంగాణ-బెంగళూర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలం ఊహించినట్టుగానే అంచనాలకు అందలేదు!. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్యాటర్ డెవిడ్ వార్నర్ అనూహ్యంగా తక్కువ ధరకు అమ్ముడుపోగా.. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఆశ్చర్యకరంగా అసలు అమ్ముడుపోలేదు. శ్రీలంక యువ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.10.75 కోట్లు దక్కించుకున్నాడు. పది ప్రాంఛైజీలు దేశీయ క్రికెటర్ల వెంట పడటంతో మెగా ఆటగాళ్ల వేలంలో అతి కొద్ది మంది క్రికెటర్లకు మాత్రమే భారీ ధర లభించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్లతో అత్యధిక ధర దక్కించుకోగా.. పేస్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ రూ.14 కోట్లకు సొంత గూటికి (చెన్నై సూపర్ కింగ్స్) చేరుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్లకు కోల్‌కత నైట్‌రైడర్స్ ప్రాంఛైజీకి వెళ్లిపోయాడు. నేడు రెండో రోజు వేలంలో సుమారు 400 మంది క్రికెటర్లు వేలంలోకి రానున్నారు.
ఔరా.. కిషన్ : నాణ్యమైన భారత క్రికెటర్లతో జట్టు నిర్మాణం చేసి చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఐపీఎల్లో విజయవంతమయ్యాయి. ఇదే ఫార్ములాను తాజా వేలంలో మిగతా ప్రాంఛైజీలు అనుసరించాయి. భారత క్రికెటర్ల కోసం అత్యధిక ధరను చెల్లించేందుకు సిద్ధపడ్డాయి. డికాక్, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తిరిగి దక్కించుకునేందుకు చూసిన ముంబయి ఇండియన్స్.. రూ.15.25 కోట్లతో ఇషాన్ కిషన్‌ను తీసుకుంది. ఇషాన్ కిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ సైతం గట్టిగా నిలువటంతో కిషన్ ధర అమాంతం పెరిగింది. చివరి వరకు కిషన్ కోసం ప్రయత్నించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స్ గరిష్ట ధర చెల్లించేలా చేసింది. పేసర్ దీపక్ చాహర్ ఇటీవల బ్యాటింగ్ మెరుపులతో ఐపీఎల్ ధరను అమాంతం పెంచుకున్నాడు. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్లలో ఒకరిని తీసుకునేందు చూసిన చెన్నై సూపర్‌కింగ్స్ చాహర్‌ను రూ.14 కోట్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఏ ఆటగాడి కోసం రూ.10 కోట్లకు మించి ఖర్చు చేసిన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ తొలిసారి రికార్డు ధరకు పాత ఆటగాళ్లను తిరిగి దక్కించుకున్నారు.
గత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ భారీ ధర దక్కించుకున్నారు. రూ. 10 కోట్లతో అవేశ్ ఖాన్‌ను కొత్త ప్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్ తీసుకోగా.. హర్షల్ పటేల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రూ.10.75 కోట్లు వెచ్చించింది. గత సీజన్లో అతి తక్కువ ధరకు వానిందు హసరంగను దక్కించుకున్న ఆర్సీబీ ఈసారి అతడి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ గుల్ల చేసుకుంది. రూ.10.75 కోట్ల ద్వీప దేశ ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకుంది. సఫారీ దిగ్గజం డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు బెంగళూర్, ఆసీస్ టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌ను రూ.7.25 కోట్లకు కోల్‌కత దక్కించుకున్నాయి. యువ క్రికెటర్లు శివం మావి రూ.7.25 కోట్లు, నితీశ్ రానా రూ.8 కోట్లకు కోల్‌కత గూటికి చేరుకున్నారు.
వార్నర్.. ఎందుకిలా?! : ఐపీఎల్ 2022 ఆటగాళ్ల వేలంలో అతిపెద్ద ఆశ్చర్యం డెవిడ్ వార్నర్. ఐపీఎల్లో అతి తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ డెవిడ్ వార్నర్. వరుస సీజన్లలో 500 పైచిలుకు పరుగులు సాధించిన బ్యాటర్ కోసం ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరిస్తాయనే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు భిన్నంగా డెవిడ్ వార్నర్ కోసం ప్రాంఛైజీలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన డెవిడ్ వార్నర్ తిరిగి ఢిల్లీ చెంతకు చేరాడు. అనూహ్యంగా రూ.6.25 కోట్లకు ఢిల్లీ చేతికి వార్నర్ చిక్కాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహజంగానే వార్నర్ కోసం ప్రయత్నించలేదు. బెంగళూర్, పంజాబ్, చెన్నై సూపర్‌కింగ్స్ వార్నర్ కోసం పోటీపడతాయని ఆశించినా.. అది జరుగలేదు. దీంతో అత్యంత తక్కువ ధరకు డెవిడ్ వార్నర్ అమ్ముడుపోయాడు. మైదానంలో ప్రదర్శన కంటే, గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో విభేదాల కారణంగానే డెవిడ్ వార్నర్ కోసం ఇతర ప్రాంఛైజీలు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.
ఇక ఐపీఎల్ సూపర్‌స్టార్, చిన్న తాలా సురేశ్ రైనా అనూహ్యంగా అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సురేశ్ రైనాను చెన్నై సూపర్‌కింగ్స్ సైతం తీసుకోలేదు. 2021 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే యుఏఈ నుంచి స్వదేశానికి వచ్చిన సురేశ్ రైనాపై ఆ ప్రాంఛైజీ గుర్రుగా కనిపించింది. అది తాజా వేలంలో ప్రస్ఫుటంగా తెలిసింది. వృద్దిమాన్ సాహా, స్టీవ్ స్మిత్, షకిబ్ అల్ హసన్, మహ్మద్ నబి, మాథ్యూ వేడ్, శామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, ఆదిల్ రషీద్, ఇమ్రాన్ తాహీర్, అమిత్ మిశ్రా, అన్మోల్ప్రీత్ సింగ్, రజత్ పాటిదార్, మహ్మద్ అజహరుద్దీన్, విష్ణు వినోద్, విష్ణు సోలంకి, ఎన్.జగదీశన్లు వేలంలో అమ్ముడుపోలేదు.
వేలం నిర్వాహకుడికి అస్వస్థత! : ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం నిర్వాహకుడు ఎడ్మండ్స్ వేలం నిర్వహిస్తూ కుప్పకూలాడు. రక్త ప్రసరణ (బిపి) తక్కువ కావటంతో వానిందు హసరంగ కోసం వేలం నడుస్తున్న సమయంలో అతడు వేదిక మీద నుంచి పడిపోయాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం తేల్చింది. వ్యాఖ్యాత చారు శర్మ మధ్యాహ్నాం సెషన్లో వేలం పాట నిర్వహించారు. నేడు వేలానికి ఎడ్మండ్స్ తిరిగి రానున్నట్టు బీసీసీఐ తెలిపింది.
రాజస్థాన్ రాయల్స్ : రియాన్ పరాగ్ (3.8), దేవ్‌దత్ పడిక్కల్ (7.75), యశస్వి జైస్వాల్ (4), అశ్విన్ (5), ట్రెంట్ బౌల్ట్ (8), జోశ్ బట్లర్ (10), సంజు శాంసన్ (14), యుజ్వెంద్ర చాహల్ (6.5), షిమ్రోన్ హెట్మయర్ (8.5), కెసి కరియప్ప (0.30), ప్రసిద్ కృష్ణ (10). చేసిన ఖర్చు : 77.85 కోట్లు, మిగిలిన డబ్బు : 12.15 కోట్లు.
ముంబయి ఇండియన్స్ : డెవాల్డ్ బ్రెవిస్ (3), కీరన్ పొలార్డ్ (6), రోహిత్ శర్మ (16), సూర్యకుమార్ యాదవ్ (8), మురుగన్ అశ్విన్ (1.6), జశ్‌ప్రీత్ బుమ్రా (12), ఇషాన్ కిషన్ (15.25), బసిల్ తంపీ (0.30). చేసిన ఖర్చు : 62.15 కోట్లు, మిగిలిన డబ్బు : 27.85 కోట్లు.
గుజరాత్ టైటాన్స్ : రషీద్ ఖాన్ (15), అభినవ్ ముకుంద్ (2.6), హార్దిక్ పాండ్య (15), లాకీ ఫెర్గుసన్ (10), మహ్మద్ షమి (6.25), రాహుల్ తెవాటియ (9), జేసన్ రారు (2), నూర్ అహ్మద్ (0.30), శుభ్‌మన్ గిల్ (8), సాయి కిశోర్ (3). చేసిన ఖర్చు : 71.15 కోట్లు, మిగిలిన డబ్బు : 18.85 కోట్లు .
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ప్రియాం గార్గ్ (0.20), అభిషేక్ శర్మ (6.5), కార్తీక్ త్యాగి (4), అబ్దుల్ సమద్ (4), ఉమ్రాన్ మాలిక్ (4), కేన్ విలియమ్సన్ (14), భువనేశ్వర్ కుమార్ (4.2), శ్రేయాస్ గోపాల్ (0.75), రాహుల్ త్రిపాఠి (8.5), సుచిత్(0.20), నికోలస్ పూరన్ (10.75), వాషింగ్టన్ సుందర్ (8.75), టి. నటరాజన్ (4). చేసిన ఖర్చు : 69.85 కోట్లు, మిగిలిన డబ్బు : 20.15 కోట్లు.
లక్నో సూపర్‌జెయింట్స్ : రవి బిష్ణోరు (4), మనీశ్ పాండే (4.6), మార్కస్ స్టోయినిస్ (9.2), మార్క్‌వుడ్ (7.5), డికాక్ (6.75), జేసన్ హౌల్డర్ (8.75), కెఎల్ రాహుల్ (17), కృనాల్ పాండ్య (8.25), దీపక్ హుడా (5.75), అంకిత్ రాజ్‌పుత్ (0.50), అవేశ్ ఖాన్ (10). చేసిన ఖర్చు : 83.10 కోట్లు, మిగిలిన డబ్బు : 6.90 కోట్లు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విరాట్ కోహ్లి (15), మాక్స్వెల్ (11), హర్షల్ పటేల్ (10.75), వానిందు హసరంగ (10.75), డుప్లెసిస్ (7), సిరాజ్ (7), దినేశ్ కార్తీక్ (5.5), హజిల్‌వుడ్ (7.75), ఆకాశ్ దీప్ (0.20), షాబాజ్ అహ్మద్ (2.4), అనుజ్ రావత్ (3.4). చేసిన ఖర్చు : 80.75 కోట్లు, మిగిలిన డబ్బు : 9.25 కోట్లు
కోల్‌కత నైట్‌రైడర్స్ : శ్రేయస్ అయ్యర్ (12.25), అండ్రీ రసెల్ (12), వరుణ్ చక్రవర్తి (8), వెంకటేశ్ అయ్యర్ (8), నితీశ్ రానా (8), పాట్ కమిన్స్ (7.25), శివం మావి (7.25), సునీల్ నరైన్ (6), షెల్డన్ జాక్సన్ (0.60). చేసిన ఖర్చు : 77.35 కోట్లు, మిగిలిన డబ్బు : 12.65 కోట్లు
పంజాబ్ కింగ్స్ : రాహుల్ చాహర్ (5.25), అర్షదీప్ సింగ్ (4), ప్రభుసిమ్రాన్ సింగ్ (0.60), హర్‌ప్రీత్ బరార్ (3.80), శిఖర్ ధావన్ (8.25), జానీ బెయిర్‌స్టో (6.75), మయాంక్ అగర్వాల్ (12), కగిసో రబాడ (9.25), షారుక్ ఖాన్ (9), జితేశ్ శర్మ (0.20), ఇషాన్ పొరెల్ (0.25). చేసిన ఖర్చు : 61.35 కోట్లు, మిగిలిన డబ్బు : 28.65 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (6), అసిఫ్ (0.20), జడేజా (16), ఎం.ఎస్ ధోని (12), అంబటి రాయుడు (6.75), రాబిన్ ఉతప్ప (2), దీపక్ చాహర్ (14), డ్వేన్ బ్రావో (4.4), తుషార్ దేశ్‌పాండే (0.20), మోయిన్ అలీ (8). చేసిన ఖర్చు : 69.55 కోట్లు, మిగిలిన డబ్బు : 20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా (7.5), కమలేశ్ నాగర్కోటి (1.1), డెవిడ్ వార్నర్ (6.25), మిచెల్ మార్ష్ (6.5), ముస్తాఫిజుర్ రెహమాన్ (2), షార్దుల్ ఠాకూర్ (10.75), ఎన్రిచ్ నోకియా (6.5), కెఎస్ భరత్ (2), అక్షర్ పటేల్ (9), కుల్దీప్ యాదవ్ (2), సర్ఫరాజ్ ఖాన్ (0.20), అశ్విన్ హెబ్బర్ (0.20), రిషబ్ పంత్ (16). చేసిన ఖర్చు : 73.50 కోట్లు, మిగిలిన డబ్బు : 16,50 కోట్లు.