Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్, స్పిన్ ఆల్రౌండర్లకు డిమాండ్
- విదేశీ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు నిరాశ
- ఐపీఎల్ 2022 ఆటగాళ్ల వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలం ఆదివారంతో ముగిసింది. దీపక్ చాహర్, వానిందు హసరంగ, షిమ్రోన్ హెట్మయర్, లియాం లివింగ్‌స్టోన్‌లు రికార్డు ధర దక్కించుకోగా.. డెవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్ వంటి స్టార్ బ్యాటర్లు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. డెవిడ్ వార్నర్ కోసం ప్రాంఛైజీలు పోటాపోటీగా డబ్బులు కుమ్మరిస్తాయనే అంచనాలు తలకిందులు అయ్యాయి. 2022 ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలంలో ప్రాంఛైజీలు ఆలోచనలు, వ్యూహలు ఎలా సాగాయో చూద్దాం!.
నవతెలంగాణ క్రీడావిభాగం :
హసరంగకు ఎందుకు అంత ధర? :
వానిందు హసరంగకు రికార్డు ధర దక్కటంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ప్రాంఛైజీల ఆలోచన భిన్నంగా ఉంది. హసరంగతో జట్టులో రెండు స్థానాలు భర్తీ చేయవచ్చు. వైవిధ్యమైన మణికట్టు స్పిన్నర్‌గా, నం.6 స్థానంలో 130 స్ట్రయిక్‌రేట్‌తో ధనాధన్ బ్యాటింగ్ చేయగలడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ గూగ్లీ బౌలర్లలో ఒకడిగా హసరంగ పేరు సాధించాడు. టీ20ల్లో అతడి స్ట్రయిక్‌రేట్ 12.9. ఎకానమీ రేటు 6.32. వైవిధ్య బంతులతో మాయ చేయగల మణికట్టు స్పిన్నర్లు ఐపీఎల్లో సహజంగానే విజయవంతం అయ్యారు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ హసరంగ రికార్డు ధర దక్కించుకోవడానికి కారణం.. అతడి రెండో నైపుణ్యం. ఐపీఎల్ వేలంలో ఇటువంటి క్రికెటర్ల కొరత భారీగా ఉంది. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, అండ్రీ రసెల్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి ఆల్రౌండర్లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌కు మంచి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అందుకే ఈ ప్రాంఛైజీలు హసరంగ కోసం పోటీపడ్డాయి. గత సీజన్లో హసరంగ జట్టులో ఉన్నప్పటికీ బెంగళూర్ రెండు మ్యాచుల్లోనే అవకాశం ఇచ్చింది. చాహల్ ఉండటంతో హసరంగకు అవకాశం చిక్కలేదు. ఈ సీజన్లో మాక్స్వెల్ రెండో స్పిన్నర్‌గా..హసరంగ ప్రధాన స్పిన్నర్‌గా ఈ సీజన్లో అన్ని మ్యాచులు ఆడనున్నాడు.
వార్నర్, డికాక్‌లకు మరీ అంత తక్కువా?! :
డెవిడ్ వార్నర్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అందుకున్న మొత్తం రూ.12 కోట్లు. గత సీజన్లో అనూహ్య పరిణామాల నడుమ వార్నర్ సన్‌రైజర్స్‌ను వీడాల్సి వచ్చింది. ఐపీఎల్లో వరుసగా మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ సాధించిన వార్నర్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ప్రాంఛైజీలు వార్నర్ కోసం బలంగా ప్రయత్నిస్తాయని అనుకున్నారు. సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ విషయంలోనూ ఇవే అంచనాలు. వార్నర్, డికాక్ తక్కువ ధరకు అమ్ముడుపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఐపీఎల్లో విదేశీ బ్యాటర్లకు కొరత లేదు. వేలంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ ధరకు చిక్కుతారు. వేలానికి ముందే ప్రతి జట్టుకు ఓ ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. చాలా ప్రాంఛైజీలు ఇషాన్ కిషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. వార్నర్, డికాక్‌లు దిగ్గజ జాబితాలో ఉండటం సైతం వారికి చేటు చేసింది. ఇషాన్ కిషన్ కోసం చూస్తున్న ప్రాంఛైజీలు సొమ్మును అతడికి కోసం అట్టిపెట్టుకున్నాయి. ఇషాన్ కిషన్ తర్వాత వేలంలోకి వచ్చిన నికోలస్ పూరన్ (10.75 కోట్లు)ను సన్‌రైజర్స్ తీసుకుంది. కిషన్ తర్వాత డికాక్ వేలంలోకి వచ్చుంటే సఫారీ స్టార్‌కు సైతం భారీ ధర వచ్చేది. వేలానికి ముందు ప్రాంఛైజీలు 31 మంది క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. అందులో 11 మంది ఓపెనర్లు ఉన్నారు. ప్రతి జట్టుకు కనీసం ఓ ఓపెనర్ ఉన్నాడు. దీంతో ఐపీఎల్ వేలంలో ఓపెనర్లకు పెద్దగా డిమాండ్ లేదు. ఇటీవల వేలంలో విదేశీ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. డిమాండ్, సప్లయి చక్రం మెరుగ్గా ఉంది. భారత్, పాకిస్థాన్‌లను మినహాయిస్తే ప్రతి జట్టులోనూ నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఉన్నారు. అదే ఆల్‌రౌండర్ల విషయంలో డిమాండ్‌కు తగిన సరఫరా లేదు. అందుకే, ఆల్‌రౌండర్లతో పోల్చితే స్టార్ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పెద్దగా బిడ్డింగ్ రాలేదు. వార్నర్ కోసం పోటీపడిన చెన్నై సూపర్‌కింగ్స్.. రూ.1 కోటికే డెవాన్ కాన్వేను తీసుకుంది. ఓపెనింగ్‌కు ఎంతో మంది భారత క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. విదేశీ ఆటగాళ్ల కోటాలో ప్రాంఛైజీలు ఇతర విభాగాల్లో ఆటగాళ్లను తీసుకోవాలని చూశాయి.
హెట్మయర్ కోసం ఎందుకంత పోటీ? :
మళ్లీ ఇక్కడ డిమాండ్, సప్లయి తెరపైకి వస్తుంది. ప్రాంఛైజీలు నం.5 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఫినిషర్ పాత్ర పోషించే ఆటగాడు అవసరం. అవసరమైతే ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి నిర్మిస్తూ.. చివరి వరకు తీసుకెళ్లగలిగే ఆటగాడు కావాలి. పొలార్డ్, రసెల్, పాండ్య, జడేజా తరహాలో జట్టు సమతూకం పెంచే ఆటగాడు కోసం ప్రాంఛైజీలు ఎదురుచూశాయి. నం.5 స్థానంలో, అంతకంటే దిగువన హెట్మయర్ బ్యాటింగ్ స్ట్రయిక్‌రేట్ 150. ఐపీఎల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో ఐదో స్థానంలో హెట్మయర్ ఏకంగా 160.26 స్ట్రయిక్‌రేట్ కలిగి ఉన్నాడు. ఫినిషర్లుగా ఉపయోగపడగల షారుక్ ఖాన్, టిమ్ డెవిడ్‌లు సహా లియాం లివింగ్‌స్టోన్ సైతం భారీ ధర దక్కించుకున్నారు. తొలి సెట్ బ్యాటర్ల జాబితాలో ఉండటం హెట్‌మయర్‌కు కలిసొచ్చింది. డబ్బులు అయిపోయాక ఫినిషర్ కోసం ప్రయత్నించకుండా.. ముందుగానే ఫినిషర్‌ను తీసుకోవాలని చూశాయి.
దీపక్ చాహర్ ఎలా అత్యధిక ధర!! :
నాణ్యమైన పేసర్లకు ఐపీఎల్ వేలంలో సహజంగానే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రతి ప్రాంఛైజీకి ఐదారుగురు నాణ్యమైన పేసర్లు అవసరం. గాయాలు, ఫామ్, ఆత్మవిశ్వాసం పరిగణనలోకి తీసుకుని పేసర్లను రొటేట్ చేస్తుంటారు. ఇక లోయర్ ఆర్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగటంతో బ్యాటింగ్ లైనప్‌కు బలం చేకూర్చగల ఆటగాడికి టీ20 ఫార్మాట్లో విలువ ఎక్కువ. దీపక్ చాహర్‌తో పోల్చితే అతడి కంటే బలంగా బంతికి బాదగల పేసర్లు ఉన్నారు. కానీ పవర్‌ప్లేలో దీపక్ చాహర్ ఓవర్లు అత్యంత కీలకం. పవర్ ప్లేలో దీపక్ చాహర్ పడగొట్టే వికెట్లకు డిమాండ్ ఉంది. బంతితో ఆరంభంలో, బ్యాట్‌తో చివర్లో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్థుడు దీపక్ చాహర్. అందుకే తొలిసారి చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు ధర వెచ్చించి తొలిసారి వేలంలో ఓ ఆటగాడిని తీసుకుంది. 2008 ఐపీఎల్లో ఎం.ఎస్ ధోని కోసం రికార్డు ధర పెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.. తర్వాత ఆ స్థాయిలో వేలంలో ధర పెట్టి దక్కించుకున్న ఆటగాడు దీపక్ చాహర్ మాత్రమే.
జోఫ్రా ఆర్చర్‌ను ఎందుకు తీసుకున్నారు? :
ఇటీవల గాయంతో శస్త్రచికత్స చేయించుకున్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 15 సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయం ఈసీబీ స్పష్టంగా తెలిపింది. అయినా, ప్రాంఛైజీలు జోఫ్రా ఆర్చర్ కోసం పోటీపడ్డాయి. జోఫ్రా ఆర్చర్ కోసమే సొమ్ము అట్టిపెట్టుకున్న ముంబయి ఇండియన్స్ అతడి కోసం ఎంతవరకైనా వెళ్లేలా కనిపించింది. మిగతా ప్రాంఛైజీల వద్ద తగినంత సొమ్ము లేకపోవటం ముంబయి ఇండియన్స్‌కు కలిసొచ్చింది. దిగ్గజ జాబితాలో రావాల్సిన జోఫ్రా ఆర్చర్ పేరు చివర్లో వచ్చింది. దీంతో ఆర్చర్‌ను తాజా వేలంలో తీసుకోరని, వచ్చే ఏడాది వేలంలో అతడి కోసం పోటీపడతారని అనుకున్నారు. కానీ 2023 ఐపీఎల్ సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ ఈ ఏడాది వేలంలోనే గట్టిగా ప్లాన్ చేసింది. పూర్తి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ కచ్చితంగా రికార్డు ధరకు అమ్ముడుపోయేవాడు. ప్రాంఛైజీల వద్ద డబ్బు లేనప్పుడే అతడి కోసం పోటీపడ్డాయి. అదే వచ్చే ఏడాది మినీ వేలంలో అతడి కోసమే పూర్తి సొమ్ము వెచ్చించేందుకు వెనుకాడేవి కావు. ఈ ఏడాది ఆర్చర్‌కు ఎలాగూ కాంట్రాక్టు సొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది రూ.8 కోట్ల ధరకే ఆర్చర్ అందుబాటులోకి వస్తాడు. 2025 మెగా వేలానికి ముందు ఆర్చర్‌ను ముంబయి ఇండియన్స్ అట్టిపెట్టుకునే అవకాశం సైతం లేకపోలేదు.
కోల్‌కత రహానెను ఎలా తీసుకుంది? :
గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో అజింక్య రహానె స్ట్రయిక్ రేటు 120 కంటే తక్కువ. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అజింక్య రహానె రెండు మ్యాచుల్లోనే ఆడాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అజింక్య రహానెను తొలుత ఎవరూ తీసుకోలేదు. కానీ చివర్లో కోల్‌కత నైట్‌రైడర్స్ రహానెను జట్టులోకి తీసుకుంది. విధ్వంసక వెంకటేశ్ అయ్యర్‌కు తోడుగా నిలకడగా నిలబడే ఓపెనర్ అవసరం. కోల్‌కత తరఫున శుభ్‌మన్ గిల్ స్ట్రయిక్‌రేట్ సైతం 120 కంటే తక్కువే. కానీ గిల్ నిలకడగా పరుగులు సాధించాడు. గిల్ స్థానాన్ని రహానెతో తక్కువ ధరకే భర్తీ చేసేందుకు కోల్‌కత నైట్‌రైడర్స్ పావులు కదిపింది.