Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో భారత్ తొలి టీ20 నేడు
- కూర్పుపై టీమ్ ఇండియా ఫోకస్
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
వన్డే సవాల్ ముగిసింది. మూడు మ్యాచుల్లో భారత్‌కు వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేదు. ఫార్మాట్‌తో పాటు వేదిక మారింది. సహజంగానే వెస్టిండీస్ పొట్టి క్రికెట్లో గట్టి జట్టు. ఈ ఫార్మాట్లో కరీబియన్లకు తిరుగుండదు. 2022 టీ20 ప్రపంచకప్ ప్రణాళికలో భాగంగా జట్టు కూర్పుకు ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్న రోహిత్‌సేన.. విండీస్‌తో పొట్టి పోరును సవాల్‌గా స్వీకరించనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను వాడుకోనుంది. భారత్, వెస్టిండీస్ తొలి టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-కోల్‌కత
ప్రయోగాలు కాదు.. నేరుగా సమర సన్నాహకం మోగిస్తున్నామంటూ.. 2022 టీ20 ప్రపంచకప్‌పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. పొట్టి ప్రపంచకప్ లక్ష్యంగా రోహిత్ శర్మ జట్టు కూర్పుపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాడు. అందులో భాగంగానే వెస్టిండీస్ సిరీస్‌లో పలు నిర్ణయాలు తీసుకోనున్నాడు. పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుండటంతో భారత్ అంచానలకు తగినట్టు రాణిస్తేనే తుది ఫలితం అనుకూలంగా మలచుకోగలదు. లేదంటే, ఈ ఫార్మాట్లో వెస్టిండీస్‌కు సిరీస్ విజయం పెద్ద లెక్క కాదనే విషయం అందరికీ తెలుసు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లతో నిండిన వెస్టిండీస్ జట్టు ప్రదర్శనపై అభిమానుల్లోనూ విపరీత ఆసక్తి కనిపిస్తోంది. నేడు కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో ధనాధన్ సమరంలో తొలి సవాల్‌కు భారత్ సిద్ధమైంది.
ఎవరెక్కడ ఆడతారో!? : ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా కదులుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుపై తన మార్క్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పొట్టి ఫార్మాట్లో 20 ఓవర్ల పాటు ధనాధన్ జోరు చూపించేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కెఎల్ రాహుల్ గాయంతో దూరమవగా రోహిత్ శర్మ తోడుగా ఓపెనర్‌గా ఎవరు వస్తారనే ఆసక్తి కనిపిస్తోంది. గతంలో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వస్తానని ప్రకటించాడు. కానీ కెప్టెన్సీ మార్పుతో జట్టు ప్రణాళికలు మారిపోయాయి. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లు మిడిల్ ఆర్డర్లో మెరుగ్గా ఆడగలరు. ఆ ఇద్దరినీ అక్కడే ఆడించటం ప్రయోజనకరమని రోహిత్ భావిస్తున్నాడు. నయా సంచలనం ఇషాన్ కిషన్ ఐపీఎల్లో ఓపెనర్‌గా విజయవంతం అయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్‌కు ఓపెనింగ్ అవకాశం ఇవ్వనున్నారు. ఐపీఎల్, అంతర్జాతీయ షెడ్యూల్లో గాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్థానానికి నాణ్యమైన ప్రత్యామ్నాయం సైతం ఉండేలా రోహిత్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వన్డే సిరీస్‌లో నిరాశపరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల నుంచి అభిమానులు ధనాధన్ షో ఆశిస్తున్నారు. లోయర్ ఆర్డర్లో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్లలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. డెత్ ఓవర్లలో మెరుగైన బౌలింగ్ నైపుణ్యంతో శార్దుల్ ఠాకూర్‌ను నెట్టేసి హర్షల్ పటేల్ తుది జట్టులో చోటు సాధించనున్నాడు. యువ స్పిన్నర్ రవి బిష్ణోరు అరంగేట్రానికి రెఢ అవుతున్నా.. కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ జోడీ మ్యాజిక్ పునరాగమనానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మహ్మద్ సిరాజ్, హర్షల్‌తో కలిసి అవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
చెలరేగుతారా? : వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫిట్నెస్ సమస్యలతో చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. నేడు పొలార్డ్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. మ్యాచ్‌కు ముందే పొలార్డ్ ఆడేది లేనిది తేలనుంది. పొలార్డ్ ఫిట్‌గా ఉంటే విండీస్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదు. మేయర్స్, కింగ్, పావెల్, హౌల్డర్ సహా రొమారియో షెఫర్డ్‌లు జోరు మీదున్నారు. వన్డే సిరీస్‌లో ఒడీన్ స్మిత్ అదరగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో పోటీపడే చెలరేగే వెస్టిండీస్ క్రికెటర్లు ఐపీఎల్ వేలం జోష్‌ను ఈడెన్‌గార్డెన్స్‌లో చూపిస్తా రమో చూడాలి.
పిచ్, వాతావరణం : కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్ పిచ్‌పై పేస్, బౌన్స్ లభించనుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రధాన సమస్య మంచు ప్రభావం. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ మంచు ఎక్కువగా ఉంది. నేడు ఉదయం సైతం తేమతో కూడిన వాతావరణం ఉంది. టాస్ కీలక పాత్ర పోషించనుంది. తొలుత ఫీల్డింగ్ చేసేందుకు జట్లు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్, అవేశ్ ఖాన్.
వెస్టిండీస్ : కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, జేసన్ హౌల్డర్, రోమారియో షెఫర్డ్, ఫబిన్ అలెన్, ఒడీన్ స్మిత్, అకీల్ హుసేన్, షెల్డన్ కాట్రెల్.
10
భారత్, వెస్టిండీస్ టీ20ల్లో ముఖాముఖి 17 మ్యాచుల్లో తలపడ్డాయి. టీమ్ ఇండియా 10 మ్యాచుల్లో విజయాలు సాధించగా.. ఆరు మ్యాచుల్లో వెస్టిండీస్ పైచేయి సాధించింది.
30
టీ20 పరుగుల జాబితాలో విరాట్ కోహ్లి (3227), రోహిత్ శర్మ (3197) మధ్య అంతరం 30 పరుగులే. మార్టిన్ గప్టిల్ (3299) తర్వాతి స్థానంలో కోహ్లి, రోహిత్ ఉన్నారు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు బాదిన ఘనత అందుకునే అవకాశం ఈ సిరీస్‌లో కోహ్లి, రోహిత్‌ల ముంగిట ఉంది.