Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన నైట్రైజర్స్ యాజమాన్యం
కోల్‌కత : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండుసార్లు చాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్.. టైటిల్ నెగ్గేందుకు ఢిల్లీ ఫార్ములా అనుసరిస్తోంది!. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి గౌతం గంభీర్‌ను తెచ్చుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్.. తాజాగా ఆ ప్రాంఛైజీ నుంచి శ్రేయస్ అయ్యర్‌ను సైతం దక్కించుకుంది. రూ.12.25 కోట్ల రికార్డు ధరతో వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ ఊహించినట్టుగానే సారథ్య పగ్గాలు అప్పగించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వరుస సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 15లో కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు ఆ ప్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. ' ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన బ్యాటర్‌గా అయ్యర్ అందరి మన్నన్నలు పొందాడు. కోల్‌కత జట్టు కెప్టెన్‌గా అయ్యర్ విజయవంతం అవుతాడని నమ్మకంగా ఉన్నామని' కోల్‌కత నైట్‌రైడర్స్ సీఈవో, ఎండీ వెంకీ మైసూర్ తెలిపారు. 'కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహించటం గౌరవంగా భావిస్తున్నాను. భిన్నమైన పద్దతులు, ఆచారాల నుంచి వచ్చే వ్యక్తులను ఐపీఎల్ ఏకం చేస్తుంది. ప్రతిభావంతులతో కూడిన జట్టును నడిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని' శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 2019లో ఎలిమినేటర్‌కు చేర్చిన అయ్యర్.. 2020లో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 2021 ఐపీఎల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు టైటిల్ పోరుకు చేర్చిన ఇయాన్ మోర్గాన్‌ను ఈ సారి వేలంలో తీసుకునేందుకు కోల్‌కత విముఖత చూపిన సంగతి తెలిసిందే.