Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో రెండో టీ20 నేడు
- సిరీస్ విజయంపై రోహిత్‌సేన గురి
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
పొట్టి సిరీస్‌పై భారత్ కన్నేసింది. ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టీ20లో ఏకపక్ష విజయం సాధించిన టీమ్ ఇండియా నేడు సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీ20ల్లో కరీబియన్లు గట్టి పోటీ ఇస్తారని ఆశించినా, భారత బౌలర్లు విండీస్ హిట్టర్లను సమర్థవంతంగా నిలువరించారు. రెండో మ్యాచ్‌లోనైనా పుంజుకోవాలని పొలార్డ్సేన భావిస్తుండగా.. ఇప్పుడే సిరీస్ విజయం పూర్తి చేయాలని భారత్ బరిలోకి దిగుతోంది.
టీ20 సిరీస్ విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుండగా.. పొట్టి సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు వెస్టిండీస్ ఆరాటప డుతుంది. ఈ నేపథ్యంలో నేడు ఈడెన్‌గార్డెన్స్‌లో రెండో టీ20 మరింత ఆసక్తి రేపుతోంది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోన్న టీమ్ ఇండియా విజయంపై దీమాగా కనిపిస్తోంది. పొట్టి ఫార్మాట్లో వేగంగా ఫలితాన్ని శాసించగల కరీబియన్లు నేడు తఢాకా చూపించేందుకు వెనుకాడరు. మంచు ప్రభావం, స్పిన్ కీలక పాత్ర పోషిస్తుండటంతో మరోసారి టాస్ ప్రధానం కానుంది. టాస్ నెగ్గిన జట్టు విజయావకాశాలు మెరుగ్గా ఉండనున్నాయి!. నేడు కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ రెండో టీ20 సమరం.
విరాట్ మెరిసేనా? :
దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లి ఎన్నడూ ఎదుర్కొని పరిస్థితి చవిచూస్తున్నాడు. కెరీర్లో తొలిసారి ఫామ్ అందుకుంటాడా? లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. విరాట్ శతకంపై కోసం మొదలైన చర్చ.. అతడు ఫామ్‌లోకి వస్తే చాలనే వరకు వచ్చింది. తొలి టీ20లోనూ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌రేట్ 130. దీంతో నేడు విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రధా నంగా ఫోకస్ కనిపిస్తోంది. విమర్శలను పట్టించుకున్నా, విస్మరించినా.. జట్టు మేనేజ్ మెంట్ అంచనాలనైనా కోహ్లి అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్‌లో ధనాధన్ షోతో అలరిం చాడు. పవర్‌ప్లేలో పవర్ ఫుల్ ప్రదర్శన చేశాడు. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడినా.. స్ట్రయిక్రొటేషన్లో అతడు మరింత మెరుగు పడాలి. బౌండరీలపైనే దృస్టి పెట్టిన కిషన్ ఇక నుంచి వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీయటంపై ఫోకస్ చేయాలి. లోయర్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించారు. ధనాధన్ మెరుపులతో ఫినిషింగ్ చేశారు. బౌలింగ్ విభాగంలో గాయపడిన దీపక్ చాహర్ స్థానంలో మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రానున్నాడు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌తో కలిసి అతడు పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. యువ స్పిన్నర్ రవి బిష్ణోరుతో కలిసి చాహల్ మ్యాజిక్ షోకు సిద్ధమవుతున్నాడు.
విండీస్ పుంజుకునేనా?
వన్డే సిరీస్‌లో చేతులెత్తేసిన వెస్టిండీస్ నుంచి టీ20ల్లో మెరుగైన ప్రదర్శన ఆశించారు. కరీబియన్లకు అచ్చొచ్చిన ఫార్మాట్లో భారత్‌కు గట్టి పోటీ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ విండీస్ క్రికెటర్లు అంచనాలను అందుకోలేదు. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న నికోలస్ పూరన్ మినహా విండీస్ నుంచి ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణాత్మక ఇన్నింగ్స్‌తో రాణించిన నికోలస్ పూరన్ నేడూ భారత బౌలర్లకు సవాల్‌గా మారనున్నాడు. కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, రోవ్‌మన్ పావెల్ సహా కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. బిగ్ హిట్టర్లు ఒడీన్ స్మిత్, రొమారియో షెఫర్డ్ బ్యాటింగ్ స్థానాలపై జట్టు మేనేజ్మెంట్ పునరాలోచన చేయటం మంచిది. బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన రావటంతో అంతిమంగా విండీస్ స్కోరు బోర్డు ప్రతికూల ప్రభావం చూపుతుంది. నేటి మ్యాచ్‌లో విండీస్ ఆ పొరపాటు సరిదిద్దుకుంటుందేమో చూడాలి. బౌలింగ్ విభాగంలో రోస్టన్ ఛేజ్ నుంచి విండీస్ మ్యాజిక్ ఆశిస్తోంది. షెల్డన్ కాట్రెల్, రోమారియో షెఫర్డ్, ఒడీన్ స్మిత్, అలెన్‌లు భారత బ్యాటర్ల దూకుడు అడ్డుకట్ట వేస్తారేమో చూడాలి.
పిచ్, వాతావరణం
ఈడెన్‌గార్డెన్స్ పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలం!. చిన్న బౌండరీలతో తొలి టీ20 నడిచినా ఇక్కడ స్పిన్ మాయ ప్రభావం చూపింది. నేటి మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి ఉండనుంది. ఇరు జట్ల స్పిన్నర్లు కీలకం కానున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కనిపించనుంది. దీంతో టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోరు, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్, రోవ్‌మన్ పావెల్, అకీల్ హుసేన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఒడీన్ స్మిత్, ఫబిన్ అలెన్, రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్.