Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకున్న సైమన్ కటిచ్
హైదరాబాద్ : ఐపీఎల్లో వరుసగా రెండో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటేతర అంశాలతో వివాదాస్పదమవుతోంది!. 2016లో సన్‌రైజర్స్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపిన డెవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, తుది జట్టు నుంచి తప్పించి.. చివరకు డగౌట్లో కూర్చునే అవకాశం సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వలేదనే విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 కోసం నూతన కోచింగ్ బృందంను ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇటీవల ఆటగాళ్ల వేలానికి నయా బృందంతోనే వెళ్లింది. ఆటగాళ్ల వేలానికి ముందు ప్రాంఛైజీ ప్రణాళికలను, వేలంలో తుంగలో తొక్కటం పట్ల అసంతృప్తిగా ఉన్న అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవికి రాజీనామా చేశాడు. బెంగళూర్‌లో వేలం ముగిసిన తరువాతి రోజే కటిచ్ రాజీనామ చేసినట్టు తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఐపీఎల్ బయో బబుల్‌లో సుదీర్ఘ కాలం ఉండటాన్ని కారణంగా చూపుతూ కటిచ్ రాజీనామా లేఖలో రాశారు. గతంలో సన్‌రైజర్స్ సహాయక సిబ్బందిలో పని చేసిన సైమన్ హెల్మెట్‌ను కటిచ్ స్థానంలో నియమించే అవకాశం కనిపిస్తోంది. టామ్ మూడీ, బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్, డెల్ స్టెయిన్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ సిబ్బందిగా ఉన్నారు.
ఐపీఎల్ వేలంలో నికోలస్ పూరన్ (10.75), వాషింగ్టన్ సుందర్ (8.75), రాహుల్ త్రిపాఠి (8.5), రోమారియో షెఫర్డ్ (7.75), అభిషేక్ శర్మ (6.5)ల కోసం సన్‌రైజర్స్ యాజమాన్యం కోట్లు కుమ్మరించిన సంగతి తెలిసిందే. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు చీఫ్ కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్ 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే పదవి నుంచి వైదొలిగాడు. అందుకు కారణాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.