Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టీ20లో భారత్ గెలుపు
- పంత్, కోహ్లి అర్థ శతకాలు
- ఛేదనలో విండీస్ చతికిల
చిన్నదీ చిక్కింది. వరుసగా రెండో టీ20లో జయభేరి మోగించిన టీమ్ ఇండియా టీ20 సిరీస్ సొంతం చేసుకుంది. ఛేదనలో పావెల్ (68 నాటౌట్), పూరన్ (62) అర్థ సెంచరీలతో చెలరేగినా ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. 2-0తో టీ20 సిరీస్‌ను ఖాయం చేసుకుంది. రిషబ్ పంత్ (52 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (33) ధనాధన్ షోతో చెలరేగారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (52) అర్థ సెంచరీతో కదం తొక్కాడు.
నవతెలంగాణ-కోల్‌కత
టీ20 సిరీస్ భారత్ వశమైంది. రెండో టీ20లో వెస్టిండీస్‌పై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 187 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 178 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పూరన్ (61, 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (68 నాటౌట్, 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన తరుణంలో భువనేశ్వర్ కుమార్ ఆరు బంతుల్లో నాలుగు పరుగులకు ఓ వికెట్ కూల్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లు బాదినా ప్రయోజనం లేకపోయింది. మూడో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పావెల్, పూరన్‌లు విండీస్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. కానీ చివరి రెండు ఓవర్లలో భారత్ పుంజుకుని మ్యాచ్‌ను లాగేసుకుంది. అంతకముందు, విరాట్ కోహ్లి (52, 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కాడు. టీ20ల్లో 30వ అర్థ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లి భారత్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశాడు. యువ విధ్వంసకారుడు రిషబ్ పంత్ (52 నాటౌట్, 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్థ సెంచరీతో విరుచుకుపడగా.. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33, 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టే ప్రదర్శన చేశాడు. విరాట్, పంత్, అయ్యర్ మెరుపులతో వెస్టిండీస్‌తో రెండో టీ20లో భారత్ 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ (3/25) మూడు వికెట్లతో మాయ చేశాడు.
ఆ ముగ్గురు షో! : కీలక టాస్ కోల్పోయిన భారత్ ఈడెన్‌గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఇషాన్ కిషన్ (2), రోహిత్ శర్మ (19) నిరాశపరిచారు. దీంతో పవర్‌ప్లేలో భారత్ ఆధిపత్యం సాగలేదు. సూర్యకుమార్ యాదవ్ (8) సైతం స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ మ్యాజిక్ స్పెల్‌తో భారత టాప్ ఆర్డర్‌ను ఇరకాటంలో పడేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (52), యువ బ్యాటర్ రిషబ్ పంత్ (52 నాటౌట్)లు కీలక భాగస్వామ్య నెలకొల్పారు. విరాట్ కోహ్లి ఆరంభంలో దూకుడుగా ఆడినా..ఎదుర్కొన్న చివరి 23 బంతుల్లో 23 పరుగులే చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 బంతుల్లో కోహ్లి అర్థ సెంచరీ బాదాడు. అత్యధిక టీ20 అర్థ సెంచరీల జాబితాలో రోహిత్ శర్మ (30)ను సమం చేశాడు. ఛేజ్ స్పిన్‌కు కోహ్లి నిష్క్రమించినా.. భారత్ దూకుడు తగ్గలేదు. అప్పటికే క్రీజులో కుదురుకున్న రిషబ్ పంత్‌తో కలిసి వెంకటేశ్ అయ్యర్ (33) ఇన్నింగ్స్‌కు వేగం జోడించాడు. ఈ ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. 35 బంతుల్లోనే 76 పరుగులు పిండుకున్నారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో పంత్ 27 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకోగా.. అయ్యర్ 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. ఈ ఇద్దరి ధాటికి భారత్ భారీ స్కోరు సాధించింది. చివరి ఓవర్లో రోమారియో షెఫర్డ్ కట్టుదిట్టమైన బంతులతో భారత్ స్కోరు 200 చేరువ కాకుండా నిలువరించాడు. విండీస్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లతో రాణించాడు.
30
టీ20 అత్యధిక అర్థ శతకాల్లో రోహిత్ శర్మ (30) సరసన కోహ్లి నిలిచాడు. విండీస్‌పై ఫిఫ్టీతో విరాట్ 30వ అర్థ సెంచరీ నమోదు చేశారు. అత్యధిక పరుగుల జాబితాలో మార్టిన్ గప్టిల్ (3299)కు కోహ్లి (3296) మూడు పరుగుల దూరంలో నిలిచాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) కింగ్ (బి) ఛేజ్ 19, కిషన్ (సి) మేయర్స్ (బి) కాట్రెల్ 2, కోహ్లి (బి) ఛేజ్ 52, సూర్య (సి,బి) ఛేజ్ 8, పంత్ నాటౌట్ 52, వెంకటేశ్ (బి) షెఫర్డ్ 33, హర్షల్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం :(20 ఓవర్లలో 5 వికెట్లకు) 186.
వికెట్ల పతనం : 1-10, 2-59, 3-72, 4-106, 5-182.
బౌలింగ్ : అకీల్ హొసెన్ 4-0-30-0, షెల్డన్ కాట్రెల్ 3-1-20-1, జేసన్ హోల్డర్ 4-0-45-0, రొమిరియా షెఫర్డ్ 3-0-34-1, రోస్టన్ ఛేజ్ 4-0-25-3, ఒడీన్ స్మిత్ 1-0-10-0, పొలార్డ్ 1-0-14-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : కింగ్ (సి) సూర్య (బి) రవి 22, మేయర్స్ (సి,బి) చాహల్ 9, పూరన్ (సి) రవి (బి) భువనేవ్వర్ 62, పావెల్ నాటౌట్ 68, పొలార్డ్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం :(20 ఓవర్లలో 3 వికెట్లకు) 178.
వికెట్ల పతనం : 1-34, 2-59, 3-159.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-29-1, దీపక్ చాహర్ 4-0-40-0, యుజ్వెంద్ర చాహల్ 4-0-31-1, హర్షల్ పటేల్ 4-0-46-0, రవి బిష్ణోరు 4-0-30-1.