Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు
- శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు
ముంబయి : నిలకడగా నిరాశపరుస్తున్న సీనియర్ బ్యాటర్లు, టెస్టు స్పెషలిస్ట్లు చతేశ్వర్ పుజార, అజింక్య రహానెలపై వేటు పడింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు భారత జట్టును శనివారం ఎంపిక చేశారు. రహానె, పుజారలతో పాటు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాలకు సీనియర్ సెలక్షన్ కమిటీ మొండిచేయి చూపించింది. ఊహించినట్టుగానే రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై పలుకగా.. వన్డే, టీ20 సారథి రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు సైతం అప్పగించారు. కెఎల్ రాహుల్కు గాయంతో పేసర్ జశ్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ చాన్స్ దక్కింది. మార్చి 4న మొహాలీలో తొలి టెస్టుతో శ్రీలంకతో ఐదు రోజుల సవాల్ ఆరంభం కానుంది.
జడేజా రీ ఎంట్రీ : దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే పుజారా, రహానె, ఇషాంత్, సాహాలకు రానున్న శ్రీలంక సిరీస్కు పరిగణనలోకి తీసుకోవటం లేదని చెప్పామని సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ చెప్పారు. రంజీ ట్రోఫీలో రాణించి, పరుగులు సాధించాలని ఆ ఆటగాళ్లకు సూచించినట్టు చేతన్ శర్మ వెల్లడించారు. సౌరాష్ట్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో రహానె శతకం బాదినా అతడికి జట్టులో చోటు దక్కలేదు. గాయంతో దూరమైన రవీంద్ర జడేజా కోలుకుని జట్టులోకి వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ సైతం జట్టులో నిలిచినా.. అతడు ఫిట్నెస్ సాధిస్తేనే మొహాలీకి పయనం కావాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్కు సెలక్షన్ కమిటీ పిలుపు అందింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టెస్టు జట్టులోనూ తిరిగి స్థానం సంపాదించాడు.
భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.
భారత టీ20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, జశ్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్, రవి బిష్ణోరు, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్.