Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంచ్ ఆటగాళ్లకు నేడు ఛాన్స్
- సిరీస్ క్లీన్‌స్వీప్‌పై రోహిత్‌సేన గురి
- విండీస్‌తో భారత్ మూడో టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఈడెన్‌గార్డెన్స్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా పొట్టి సిరీస్ ఇప్పటికే భారత్ ఖాతాలో పడిపోయింది. టీ20ల్లో భీకర జట్టు విండీస్‌పై మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ విజయం సాధించింది. ప్రపంచకప్ జట్టు కూర్పుపై ప్రధానంగా దృష్టి సారించిన భారత్ నేడు క్లీన్‌స్వీప్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. పర్యటనలో గెలుపు రుచి చూసేందుకు కరీబియన్లు నేడు బరిలోకి దిగనున్నారు. భారత్, వెస్టిండీస్ చివరి టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-కోల్‌కత
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కౌంట్‌డౌన్ సమీపిస్తున్న తరుణంలో పొట్టి ఫార్మాట్లో ప్రమాదకర జట్టు వెస్టిండీస్‌పై 2-0 సిరీస్ విజయం పట్ల భారత్ సంతోషంగా ఉంది. ప్రధాన బౌలర్ సేవలు లేకుండానే కరీబియన్లపై పైచేయి సాధించిన ఉత్సాహం టీమ్ ఇండియా శిబిరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు క్లీన్‌స్వీప్ విజయం ఊరిస్తున్నా.. జట్టులోని ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లు విరామం తీసుకున్న వేళ నేడు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ సహా బౌలింగ్ విభాగంలో కొందరికి తుది జట్టులో చోటు దక్కనుంది. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ ఓటమి చూసిన వెస్టిండీస్.. కనీసం టీ20ల్లోనైనా ఊరట పొందాలని చూస్తోంది. భారత పర్యటనలో ఓ విజయమైనా సాధించాలనే పట్టుదల విండీస్ శిబిరంలో ఉంది. నామమాత్రపు చివరి టీ20 సమరం సైతం ఆసక్తికరంగా సాగేందుకు రంగం సిద్ధమైంది.
కుర్రాళ్లకు ఛాన్స్ : భారత్ నేటి మ్యాచ్‌లో కొత్త ఆటగాళ్లను బరిలోకి దింపనుంది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌ల స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో నిలువనున్నారు. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లు మ్యాచ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రవి బిష్ణోరు రెండు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్ విభాగంలో బెంచ్ ఆటగాళ్లలో అవకాశం దక్కనుంది. వెంకటేశ్ అయ్యర్ లోయర్ ఆర్డర్లో తనను తాను నిరూపించుకున్నాడు. నేడు అతడి స్థానంలో దీపక్ హుడాకు అవకాశం దక్కవచ్చు. లేదంటే అయ్యర్‌కే మరింత మ్యాచ్ సమయం ఇచ్చేందుకు మొగ్గు చూపవచ్చు.
ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న ఇషాన్ కిషన్ కోల్‌కతలో కంగారు పడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 42 బంతుల్లో 35, రెండో మ్యాచ్‌లో 10 బంతుల్లో 2 పరుగులే చేశాడు. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు కిషన్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఆరంభంలో కిషన్ నుంచి విధ్వంసక ఇన్నింగ్స్ ఆశించగా.. అతడు ఆ పని చేయలేదు. నేడు రుతురాజ్ ఓపెనర్‌గా రానుండగా కిషన్ లోయర్ ఆర్డర్‌కు మారనున్నాడు.
ఊరట దక్కేనా? : వన్డే సిరీస్‌లో చేతులెత్తేసినా.. టీ20ల్లో వెస్టిండీస్ నుంచి గట్టి పోటీ అంచనా వేశారు. రెండో టీ20లో వెస్టిండీస్ గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసినా.. డెత్ ఓవర్లలో చేయాల్సిన పరుగులు మరీ ఎక్కువగా ఉండిపోయాయి. ఇది విండీస్ విజయావకాశాలను గణనీయంగా దెబ్బతీసింది. బౌలింగ్ విభాగంలో రోస్టన్ ఛేజ్ మినహా ఎవరూ పెద్దగా రాణించటం లేదు. మిడిల్ ఓవర్లలో ఛేజ్ నాలుగు ఓవర్లలోనే భారత్ పరుగుల ప్రవాహం నెమ్మదిస్తుంది. ఇద్దరు ప్రధాన బౌలర్లపైనే ఆధారపడిన విండీస్.. మిగతా ఓవర్ల కోసం ఆల్రౌండర్లను ఆశ్రయిస్తుంది. ఇది ఆ జట్టును దెబ్బకొడుతుంది. తొలి మ్యాచ్‌లో చివరి 8 ఓవర్లలో 65 పరుగులను భారత్ అలవోకగా ఛేదించగా.. రెండో టీ20లో చివరి 8 ఓవర్లలో ఏకంగా 98 పరుగులు పిండుకుంది. దీనిపై కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫోకస్ చేయాల్సి ఉంది.
పిచ్ రిపోర్టు : ఈడెన్‌గార్డెన్స్ పిచ్ స్వభావంలో ఎటువంటి మార్పులు ఉండబోవు. తొలి రెండు మ్యాచులకు స్పందించినట్టే నేటి మ్యాచ్‌కు పిచ్ ఉండనుంది. మంచు ప్రభావం కాస్త తగ్గినా.. టాస్ నెగ్గిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్‌్/దీపక్ హుడా, హర్షల్ పటేల్, శార్దుల్/చాహర్, రవి బిష్ణోరు, భువనేశ్వర్/సిరాజ్/అవేశ్, కుల్దీప్/ చాహల్.
వెస్టిండీస్ : మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రోమారియో షెఫర్డ్, ఒడీన్ స్మిత్, అకీల్ హోసెన్, షెల్డన్ కాట్రెల్.
1
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్ల కూల్చిన ఘనతకు చాహల్ ఓ వికెట్ దూరంలో ఉన్నాడు. 66 వికెట్లతో బుమ్రా, చాహల్ సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతున్నారు.
6
సొంతగడ్డపై భారత్ వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు గెలుపొందింది. చివరగా 2019లో ఆస్ట్రేలియాకు టీ20 సిరీస్‌ను కోల్పోయింది.
13
స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో భారత్ వరుసగా 13 సిరీస్‌లు సాధించింది. విండీస్‌పై తాజాగా రెండు సిరీస్‌లు ఖాతాలో వేసుకుంది.