Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపికలో భావోద్వేగాలకు తావులేదు
- సాహా, రహానె, పుజారాపై వేటు సబబే
క్రీడాకారుడి కెరీర్‌కు పరిపూర్ణ ముగింపు అత్యంత అరుదు. ఎంతో పోటీతత్వంతో కూడిన క్రీడల్లో తరం మార్పిడి దశ సహజం. ఈ దశను అనుభవించటం క్రీడాకారులకు కష్టమైన పని. జాతీయ జట్టు ప్రయోజనాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్ల కోసమే సెలక్టర్లు, జట్టు మేనేజ్మెంట్ ఎదురు చూస్తాయి. ఈ చేదు నిజం ఆటగాళ్లకు తెలిసినా.. భావోద్వేగాలు వాస్తవ పరిస్థితులకు తగినట్టు ఉండేలా చేయనివ్వవు!. భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ క్రికెటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, ఇషాంత్ శర్మ సహా వృద్దిమాన్ సాహాలపై వేటు పడటం చర్చకు తెరతీసింది. క్రికెట్ జట్టు ఆట. ఇందులో జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట ఉంటుంది, వ్యక్తిగత భావోద్వేగాలు ఎంపికలో ప్రభావం చూపలేవు.
నవతెలంగాణ క్రీడావిభాగం
సాహాకు కాస్త కష్టమే! :
వృద్దిమాన్ సాహా ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. కానీ సాహా కెరీర్ దిగ్గజ వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోని కాలంలో ఉండటం అతడికి చేటు చేసింది. ఎం.ఎస్ ధోని వికెట్ కీపర్‌గా ఉండగా సాహాకు పెద్దగా అవకాశాలు రాలేదు. సాహా ఇతర వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, పార్దీవ్ పటేల్ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. 2014లో ధోని టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐదు రోజుల ఆటలో సాహాకు నిలకడగా అవకాశాలు లభించాయి. కెరీర్ ఆరంభంలో ధోని.. కెరీర్ ముగింపులో పంత్‌లు సాహాకు అవకాశాలు దూరం చేశారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ల్లో టెస్టు శతకాలు బాదిన ఏకైక వికెట్ కీపర్ రిషబ్ పంత్ విదేశీ టెస్టుల్లో ఛాన్స్ కొట్టేయగా.. స్పిన్ పిచ్‌లపై సాహా అవకాశాలు అందుకున్నాడు. పంత్ స్థాయి విధ్వంసకారుడు అందుబాటులో ఉన్నప్పటికీ సాహా అవకాశాలు దక్కించుకోవటం వెనుక పూర్తిగా అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం దాగి ఉంది. వృద్దిమాన్ సాహా వయసు 37 ఏండ్లు. రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలో భారత ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ఆడుతున్నాడు. జట్టు నాయకత్వ బృందంలోనూ పంత్ భాగంగా మారుతున్నాడు. ఈ పరిస్థితుల్లో సాహాకు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా 37 ఏండ్ల సాహా జట్టుతో ఉండటం భవిష్యత్‌లో టీమ్ ఇండియాకు ఏమాత్రం మేలు చేయదు. సాహా స్థానంలో ఓ యువ వికెట్ కీపర్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో ఉండటంతో విలువైన అనుభవం గడిస్తాడు. భవిష్యత్‌లో వికెట్ కీపర్‌గా రాణించగల ఆత్మవిశ్వాసం సాధించగలడు. ఈ విషయం సాహాకు మింగుడు పడకపోవటం అర్థం చేసుకోవచ్చు. కానీ జట్టు ప్రయోజనాలకు వ్యక్తిగత భావోద్వేగాలు అడ్డు కారాదు. వికెట్‌కీపర్‌గా వృద్దిమాన్ సాహా భారత క్రికెట్లో తనదైన స్థానం నిలుపుకున్నాడు. జట్టు ప్రణాళికల్లో అతడు లేనంత మాత్రాన అతడి గౌరవానికి భంగం వాటిల్లినట్టు భావించలేం.
ఇషాంత్దీ అదే కథ :
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కథ కూడా ఇదే. వయసు పరంగా ఇషాంత్ శర్మకు ఇప్పుడు 33 ఏండ్లే. 2007-08లోనే భారత క్రికెట్లో అడుగుపెట్టిన ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఎన్నో చేదు అనుభవాలు చవిచూశాడు. ఆ తర్వాతే ప్రపంచంలో అత్యంత పురోగతి గడించిన పేసర్‌గా నిలిచాడు. ఇషాంత్ శర్మ టెస్టుల్లో 19,160 బంతులు విసిరాడు. ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే ప్రభావశీల, దుర్భేద్యమైన పేస్ దాడిలో వచ్చాయి. ఇషాంత్ శర్మ లెంగ్త్‌లు మెరుపర్చుకోవటంపై ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. అయితే, ఇషాంత్ శర్మ సృష్టించిన ఒత్తిడిని ఇతర బౌలర్లు ఎవరూ సడలనివ్వలేదు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ పేస్ దళంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పు ఇది. ఇషాంత్ శర్మ ఫిట్నెస్, అతడి శరీరం ఇక ఎంతమాత్రం టెస్టు క్రికెట్‌కు సహకరించలేవు. అందుకే జట్టు మేనేజ్మెంట్ మరో యువ పేసర్‌ను సానపట్టేందుకు సిద్ధపడుతోంది. మహ్మద్ సిరాజ్ రూపంలో నాణ్యమైన పేసర్ అందుబాటులో ఉన్నాడు. బుమ్రా, షమి, సిరాజ్‌లతో కూడిన పేస్ దాడి దీటుగా ఉంటుంది. నాల్గో పేసర్‌కు జట్టులో చోటు దక్కాలంటే అతడు కచ్చితంగా మెరుగైన బ్యాటర్ అయి ఉండాలి. సాహా, ఇషాంత్ పరిస్థితి ఒక్కటే. యువ తరం ఆటగాళ్లను జట్టు వాతావరణంలో ఉంచటం జట్టుకు మరింత మేలు చేస్తుందని సెలక్టర్లు నమ్మారు.
పుజారా, రహానె చేజేతులా.. :
అజింక్య రహానె, చతేశ్వర్ పుజారాలపై వేటు పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు. సాహా, ఇషాంత్‌లతో పోల్చితే ఈ జోడీ ఎక్కువ అవకాశాలు దక్కించుకుంది. 2020 నుంచి పుజారా 20, రహానె 19 టెస్టులు ఆడగా.. ఇషాంత్ 9, సాహా 3 టెస్టులే ఆడారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లను రొటేషన్ చేస్తుంటారు. ఫిట్నెస్ను కాపాడుకోవటం సైతం కీలకం. నిజానికి క్రికెట్లో బౌలర్లే దాడి మొదలుపెడతారు. బ్యాటర్లు ప్రతి దాడి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత క్రికెట్లో అన్ని జట్ల పేస్ బృందాలు పటిష్టంగా ఉన్నాయి. వారిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాణ్యమైన బ్యాటర్ల కొరత ఉంది. అందుకే పుజారా, రహానెలకు భారత జట్టు అధిక అవకాశాలు కల్పించింది. ఫామ్ అందుకునేందుకు, ఆధునిక పేసర్లపై పైచేయి సాధించేందుకు వీలైనన్ని అవకాశాలు లభించినా.. పుజారా, రహానె నిరాశపరిచారు. భారత జట్టు ఉద్వాసన ఈ ఇద్దరికి కొత్త కాదు. కుర్రాళ్లుగా ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. జట్టులోకి తీసుకుని బెంచ్‌కు పరిమితం చేయటం.. రహానె, పుజారాలలో ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వటంతో పోల్చితే ప్రస్తుత నిర్ణయమే మంచిది. ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో తుది జట్టు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను తప్పించేందుకు నిరాకరించాడు. ప్రస్తుత టీమ్ ఇండియా అదే ఫార్ములా పాటించిందని చెప్పవచ్చు.
మళ్లీ అదే మాట.. పోటీతత్వ క్రికెట్లో ఏ ఆటగాడి ముగింపు పర్ఫెక్ట్గా ఉండదు. ముగింపు ఇక్కడే అని ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. అంతిమంగా జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక ప్రక్రియ సాగుతుంది. వ్యక్తిగత భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని జట్టు ఎంపిక చేయలేం. భారత క్రికెట్ ఎన్నో సార్లు తరం మార్పిడి చవిచూసింది. ఇప్పుడూ అదే దశలో ఉంది. భవిష్యత్‌లోనూ ఉంటుంది. అత్యుత్తమ జట్టు నిర్మాణం కోసం ఇదొక నిరంతర ప్రక్రియ. అందరూ స్వాగతించాలి!.