Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నయా ఫార్మాట్‌తో ఐపీఎల్ 15
- గ్రూపులు, సీడింగ్స్ విడుదల చేసిన బీసీసీఐ
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్తగా అభిమానుల ముందుకు రాబోతుంది. 2011 ఐపీఎల్ తరహాలో ఐపీఎల్ 15 పది జట్లతో క్రికెట్ విన్యాసం పంచేందుకు ముస్తాబైంది. ఊహించినట్టుగానే ఐపీఎల్ 15 మార్చి 26న ఆరంభం కానుండగా.. టైటిల్ పోరు మే 29న జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్-15ను పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. పది జట్లును రెండు గ్రూపులుగా విభజించి సీడింగ్స్ కేటాయించారు.
మూడు వేదికల్లోనే : ఐపీఎల్ 15 లీగ్ దశ పూర్తిగా మూడు స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. ముంబయిలో 55 మ్యాచులు ఆడనుండగా, పుణె 15 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబయి వాంఖడె స్టేడియం, ముంబయి బ్రబౌర్న్ స్టేడియం, ముంబయి డివై పాటిల్ స్టేడియం సహా పుణె ఎంసీఏ స్టేడియంలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో 20 చొప్పున మ్యాచులు.. ఎంసీఏ స్టేడియం, బ్రబౌర్న్ మైదానాల్లో 15 మ్యాచుల చొప్పున నిర్వహించనున్నారు. ప్రతి జట్టు వాంఖడే, డివై పాటిల్ స్టేడియంలో నాలుగేసి మ్యాచులు.. బ్రబౌర్న్, ఎంసీఏ స్టేడియాల్లో మూడేసి మ్యాచులు ఆడనున్నాయి.
జట్లకు సీడింగ్స్ : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జట్లకు సీడింగ్స్ కేటాయించారు. ఐపీఎల్ టైటిల్ విజయాలు, ఫైనల్స్‌కు చేరుకున్న సీజన్ల ఆధారంగా జట్లకు సీడింగ్స్ కేటాయించారు. అత్యధికంగా ఐదు టైటిళ్లు గెల్చుకున్న ముంబయి ఇండియన్స్ టాప్ సీడింగ్ పొందగా.. నాలుగు టైటిళ్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో సీడింగ్ దక్కించుకుంది. రెండు సార్లు విజేత కోల్‌కత నైట్‌రైడర్స్‌కు 3, ఓ సారి టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (2 సార్లు ఫైనల్స్) 4, రాజస్థాన్ రాయల్స్ (1 ఫైనల్, 1 టైటిల్)కు 5వ సీడింగ్ దక్కాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా సీడింగ్స్ పొందాయి.
పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో టాప్ సీడ్ ముంబయి ఇండియన్స్ సహా కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడనుంది. సొంత గ్రూప్‌లోని జట్లతో రెండేసి మ్యాచులు ఆడనుండగా.. మరో గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో సారి, మరో జట్లుతో రెండు సార్లు తలపడనుంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన (రెండు గ్రూప్‌లలో కలిపి) జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనున్నాయి.
లోధా సిఫారసులకు పాతర : జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫారసులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తుంగలో తొక్కింది. ఐపీఎల్‌కు, అంతర్జాతీయ షెడ్యూల్‌కు కనీసం రెండు వారాల విరామం అవసరమని లోధా కమిటీ చెప్పింది. శ్రీలంకతో స్వదేశీ సిరీస్ ముగిసిన పది రోజుల్లోనే ఐపీఎల్ 15 ఆరంభం కానుంది. కేవలం పది రోజుల విరామంతోనే ఈ సీజన్ ఐపీఎల్‌కు బీసీసీఐ సిద్ధపడుతోంది.